తెలంగాణ

telangana

26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్‌- బిహార్‌లో తేలిన సీట్ల లెక్క - INDIA Bloc Seat Sharing Bihar

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 3:29 PM IST

INDIA Bloc Seat Sharing Bihar : బిహార్​లో విపక్ష ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల లెక్క తేలింది. ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుండగా, కాంగ్రెస్ 9 చోట్ల బరిలోకి దిగనుంది.

Bihar INDIA Bloc Seat Sharing
Bihar INDIA Bloc Seat Sharing

INDIA Bloc Seat Sharing Bihar :బిహార్​లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. ఆర్జేడీ, కాంగ్రెస్​తోపాటు లెఫ్ట్ పార్టీలు పోటీ చేసే స్థానాల లెక్క తేలింది. రాష్ట్రాల్లో మొత్తం 40 లోక్​సభ స్థానాలు ఉండగా, 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుంది. కాంగ్రెస్​ పార్టీ 9 చోట్ల, వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు మిగిలిన ఐదు చోట్ల పోటీ చేయనున్నారు.

కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాలివే
కథియార్‌, కిషన్‌ గంజ్‌, పట్నా సాహిబ్‌, ససారాం, భాగల్‌పూర్‌, వెస్ట్‌ చంపారన్‌, ముజఫర్‌పుర్‌, సమస్తిపుర్‌, మహరాజ్‌ గంజ్‌ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. బెగుసరాయ్‌, ఖగారియా, అర్హ్‌, కరకట్‌, నలంద స్థానాల నుంచి వామపక్ష అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మిగిలిన 26 చోట్ల ఆర్జేడీ తమ అభ్యర్థులను పోటీలో నిలపనుంది.

అప్పుడు కాంగ్రెస్ ఒక్కచోటే
రాష్ట్రంలోని 40 స్థానాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్‌ 1 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క స్థానంలో విజయం సాధించగా- ఆర్జేడీ, లెఫ్ట్‌ పార్టీలు ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయాయి.

ఎన్​డీఏ నుంచి ఎవరెక్కడంటే?
2019లోబీజేపీ 17, జేడీయూ 16, ఎల్‌జేపీ 6 చోట్ల గెలుపొందాయి. ఎన్​డీఏ తరఫున ఈ సారి బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్‌ పాసవాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) ఐదు చోట్ల, జితన్‌ రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్థానీ ఆవామీ మోర్చా, లోక్‌ సమత పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) చెరో స్థానంలో పోటీ చేయనున్నాయి.

ఆరోజే కాంగ్రెస్ మేనిఫెస్టో!
మరోవైపు, లోక్‌సభ ఎన్నికలకు గాను మేనిఫెస్టోను ఏప్రిల్ 5న దిల్లీలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఏప్రిల్ 6వ తేదీన రాజస్థాన్ జైపుర్​లో మేనిఫెస్టో విడుదల ఉంటుందని ఆ పార్టీ నేత సుఖ్​జీందర్ సింగ్ రణధావా గురువారం తెలిపారు. భారీ బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారని చెప్పారు. కానీ ఇప్పుడు మేనిఫెస్టో విడుదల తేదీ మారినట్లు సమాచారం.

ఆ 2 రాష్ట్రాల మోడల్​తో లోక్​సభ బరిలోకి కాంగ్రెస్ - బీజేపీని ఢీకొట్టేందుకు 'పాంచ్​ న్యాయ్​' అస్త్రం

అడ్డంకులు అధిగమిస్తూ - వ్యూహాలకు పదును పెడుతూ - గెలుపు దిశగా కాంగ్రెస్ కార్యాచరణ

ABOUT THE AUTHOR

...view details