How to Make Chicken Haleem at Home :రంజాన్ మాసం వచ్చిందంటే చాలు మనందరికీ వెంటనే గుర్తొచ్చే వంటకం హలీమ్. అందులో ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే రంజాన్(Ramadan 2024)నెల స్టార్ట్ అయ్యిందంటే చాలు వీధివీధిన హలీమ్ సెంటర్లు కనిపిస్తాయి. ఇందులో చికెన్, మటన్, వెజ్ వంటి హలీమ్ రకాలు లభిస్తుంటాయి. మాంసాన్ని మొత్తం ఉడికించి ద్రవంలాగా చేసే ఈ వంటకం అంటే ఇష్టపడనివారు ఉండరు! అలాగే ఈ హైదరాబాదీ హలీమ్ రుచి చూసిన వారెవరైనా దీనికి గులామ్ కావాల్సిందే! రుచే కాదు.. బోలెడంత ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తుందీ వంటకం. అయితే, అన్ని వంటకాలలాగా హలీమ్ ప్రిపేర్ చేయడం అంత సులువైన పని కాదు. దీన్ని తయారు చేసుకోవడానికి ఓపిక చాలా అవసరం. అలాగని తరచూ హలీమ్‌ను బయటకెళ్లి తినాలంటే అందరికీ కుదరదు కదా. అలాంటి వారు.. ఇంట్లోనే ఈజీగా రుచికరమైన 'చికెన్ హలీమ్' ప్రిపేర్ చేసుకోండి. మరి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారి చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చికెన్ హలీమ్‌కు కావాల్సినవి :
- బోన్‌లెస్ చికెన్- అరకిలో
- నెయ్యి- ఐదు పెద్ద చెంచాలు
- పెరుగు- కప్పు
- గోధుమరవ్వ- పావుకిలో
- నూనె- పావు కప్పు
- శనగపప్పు, బియ్యం- పిడికెడు చొప్పున
- అల్లంవెల్లుల్లి పేస్ట్- రెండు చెంచాలు
- లవంగాలు, యాలకులు- ఎనిమిది చొప్పున
- మిరియాల పొడి, శొంఠి పొడి- అర చెంచా చొప్పున
- దాల్చిన చెక్క- నాలుగు ముక్కలు
- షాజీరా- రెండు చెంచాలు
- పచ్చిమిర్చి- ఐదు
- ఉల్లిపాయలు- రెండు
- కారం- రెండు స్పూన్లు
- ఉప్పు- తగినంత
- పసుపు- అరచెంచా
- గరంమసాలా- 1 స్పూన్
- పోట్లీ మసాలా- చిన్న ప్యాకెట్
- పుదీనా, కొత్తిమీర- అర కప్పు చొప్పున
- డ్రై ఫ్రూట్స్ పేస్ట్ కోసం కావాల్సినవి :
- వేయించుకున్న జీడిపప్పు, బాదం, పిస్తా - కొంచెం
- 1/2 cup పెరుగు.
రంజాన్ మాసంలో కచ్చితంగా టేస్ట్ చేయాల్సిన ఫుడ్స్ ఇవే! - హలీమ్‌తో పాటు నోరూరించేవి ఇంకెన్నో!
చికెన్ హలీమ్ తయారీ విధానం :
- ముందుగా కుక్కర్లో నీట్‌గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు, శనగపప్పు, బియ్యం, ఓ చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, షాజీరా, నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు, సగం పుదీనా, రెండు పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఆ మిశ్రమంలో సగం చెంచా పసుపు, పోట్లీ మసాలా ఒక చిన్న క్లాత్‌లో మూటకట్టి వేసుకోవాలి. ఆపై దానిలో తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత మూత తీసి అందులో గోధుమ రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై మూత పెట్టి మళ్లీ నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని పూర్తిగా చల్లార్చుకోవాలి.
- అనంతరం.. అందులో వేసుకున్న పోట్లీ మసాలా మూట తీసేసి ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్ పేస్ట్(వేయించిన జీడిపప్పు, బాదం, పిస్తా, పెరుగు కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి) ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి.
- ఇప్పుడు పొయ్యి మీద పాన్ లేదా మందపాటి గిన్నె పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మిగిలిన లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, అల్లంవెల్లుల్లి పేస్ట్, మిగిలిన పచ్చిమిర్చి నూరి వేసుకోవాలి. ఆ మిశ్రమం కొద్దిగా వేగాక కారం, మిరియాల పొడి, శొంఠి పొడి, గరంమసాలా వేసి కాస్త వేయించుకోవాలి. ఆ తర్వాత కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న చికెన్ మిశ్రమం, తగినంత ఉప్పు, డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసి చిన్న మంటపై కలుపుతూ ఉడికించాలి లేదా పొయ్యి మీద ఇనుప పెనం పెట్టి దాని మీద ఈ గిన్నె పెడితే మాడకుండా నిదానంగా ఉడుకుతుంది.
- అది ఉడికే లోపు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మిగిలిన కొత్తిమీర, పుదీనాను నూనెలో కరకరలాడేలా వేయించి పక్కన పెట్టుకోవాలి. హలీమ్ మొత్తం ఉడికి మంచి వాసన వస్తున్నప్పుడు నెయ్యి కలిపి మరికొద్దిసేపు హీట్ చేసుకోవాలి.
- అప్పుడు మొత్తం ఉడికి నూనె, నెయ్యి కలిసి పైకి తేలుతుండగా దింపేసి ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి.
- ఆపై వేయించిన ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేసి నిమ్మరసం పిండుకోవాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే హైదరాబాదీ చికెన్ హలీమ్ రెడీ!
రంజాన్ స్పెషల్ ఫుడ్స్ ట్రై చేయాలనుకుంటున్నారా? హైదరాబాద్‌లో ఫేమస్ హోటల్స్ ఇవే !