తెలంగాణ

telangana

ఈరోజు గూగుల్​ డూడుల్​ గమనించారా? ఆమె ఎవరో మీకు తెలుసా? - indias first women wrestler hamida

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 1:21 PM IST

Hamida Banu Google Doodle : ఈరోజు గూగుల్ ఓపెన్ చేయగానే మీకు డూడుల్ కనిపించిందా? అందులో ఉన్నది ఎవరో కనిపెట్టారా? అందులో కన్పిస్తున్న వ్యక్తి భారత మహిళా రెజ్లర్‌. ఎవరామే? ఆమె పేరు ఏంటి? వంటి వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..

Hamida Banu Google Doodle
Hamida Banu Google Doodle (Etv Bharat)

India's First Women Wrestler Hamida Banu: గూగుల్​ డూడుల్​ లో కనిపించిన వ్యక్తి హమీదా బాను (Hamida Banu). ఈమె భారత తొలి మహిళా ప్రొఫెషనల్‌ రెజ్లర్‌గా గుర్తింపు పొందారు. 1940 సంవత్సరంలో క్రీడల్లో పురుషాధిక్యం ఎక్కువగా ఉండే రోజుల్లో రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టిన హమీదా.. ఎంతో మంది పహిల్వాన్‌లను నిమిషాల్లోనే మట్టికరిపించారు. 'అమెజాన్‌ ఆఫ్‌ అలీగఢ్‌'గా పేరొందిన ఆమెకు నివాళిగా నేడు గూగుల్‌ (Google) ప్రత్యేక డూడుల్‌ను రూపొందించి గౌరవించింది.

కట్టుబాట్లను దాటి రెజ్లింగ్​లోకి ఎంట్రీ:1920లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ ప్రాంతంలో హమీదా జన్మించారు. 1940-50 వరకు పది సంవత్సరాల పాటు ఆమె కెరీర్‌ సాగింది. దాదాపు 300లకు పైగా పోటీల్లో ఆమె విజయం సాధించారు. హమీదా కెరీర్​లో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఆ కాలంలో అథ్లెటిక్స్‌లోకి ఆడవాళ్లను ఎక్కువగా రానిచ్చేవారు కాదు. అలాంటి కట్టుబాట్లను దాటడమే గాక.. రెజ్లింగ్‌కు ఎంచుకున్నారామె..

నన్ను ఓడించిన వాడినే పెళ్లి చేసుకుంటా:తనను కించపర్చేవారికి ఆటతో గట్టి సమాధానమిచ్చేవారు హమీదా. అంతే కాకుండా.. రెజ్లింగ్‌లో తనను ఓడించే తొలి మగవాడిని పెళ్లి చేసుకుంటానని ఓసారి సవాల్‌ విసిరారు. ఆమె ఛాలెంజ్‌ను స్వీకరించి కోల్‌కతా, పాటియాలా నుంచి ఇద్దరు పురుష ఛాంపియన్లు ఆమెతో పోటీ పడి ఓడిపోయారు. మూడోసారి.. రెజ్లింగ్‌లో దిగ్గజంగా పేరొందిన బాబా పహిల్వాన్‌తో పోటీ పడగా.. కేవలం 1 నిమిషం 34 సెకన్లలో అతడిని మట్టికరిపించారు హమీదా. సవాల్‌ సమయంలో ఆమె పెట్టిన షరతు కారణంగా బాబా పహిల్వాన్‌ ఈ ఓటమి తర్వాత ప్రొఫెషనల్‌ రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నాడు. 1954 మే 4వ తేదీన ఈ మ్యాచ్‌ జరిగింది. ఈ విజయంతో ఆమె అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఆమెకు గుర్తుగా నేడు గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించి గౌరవించింది.

మీసం, గడ్డం ఫుల్​గా పెంచారని 80మందిని తీసేసిన కంపెనీ- వాళ్లు చెప్పినట్లు చేసినా!! - Beard Moustache Controversy

'అమెజాన్‌ ఆఫ్‌ అలీగఢ్‌’గా​: అంతర్జాతీయంగానూ ఎంతోమందితో పోటీపడ్డారు హమీదా. రష్యా ‘ఫీమేల్‌ బియర్‌’గా పేరొందిన ప్రముఖ ఫిమేల్​ రెజ్లర్‌ వెరా కిస్టిలిన్‌ను కేవలం 2 నిమిషాల్లోనే మట్టికరిపించారు. అప్పట్లో కొన్ని సంవత్సరాల పాటు ఆమె పేరు వార్తాపత్రికల్లో హెడ్‌లైన్లలో వచ్చింది. దీంతో ‘అమెజాన్‌ ఆఫ్‌ అలీగఢ్‌’గా గుర్తింపు హమీదా సాధించారు.

రోజుకు 5.6 లీటర్ల పాలు:హమీదా బాను ఆహార్యం, ఆమె డైట్‌ గురించి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 108 కేజీల బరువుండే హమీదా.. రోజుకు 9 గంటల నిద్ర, ఆరు గంటల ట్రైనింగ్‌ పోగా.. మిగతా సమయమంతా భోజనానికి కేటాయించేవారంట. రోజుకు 5.6 లీటర్ల పాలు, 1.8 లీటర్ల జ్యూసులు, సుమారు కేజీ మటన్‌, బాదం పప్పు, నాటు కోడి, అరకేజీ నెయ్యి ఇలాంటి డైట్‌ తీసుకునేవారట.

ఎన్నో విమర్శలు: వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి. తనకు రెజ్లింగ్‌లో శిక్షణ ఇచ్చిన కోచ్‌తో ఆమె సహజీవనం చేశారు. అయితే, అతడు ఆమెను ఎంతగానో వేధించినట్లు ఆమె మనవడు (దత్తపుత్రుడి కొడుకు) ఫిరోజ్‌ షేక్‌ మీడియాకు చెప్పారు. ఆ గాయాల కారణంగా రెజ్లింగ్‌కు దూరమైన ఆమె.. చివరి రోజుల్లో చాలా కష్టాలు అనుభవించారని పేర్కొన్నారు. ఏదేమైనా.. స్పోర్ట్స్​లో అడుగుపెట్టేందుకు ఎంతోమంది అమ్మాయిలకు హమీదా స్ఫూర్తిగా నిలిచారు.

పూరీ, కాశీ, అయోధ్యకు వెళ్లాలా? భక్తుల కోసం స్పెషల్ ట్రైన్​- ప్యాకేజీ ఎంతో తెలుసా? - Bharat Gaurav Train Package

ABOUT THE AUTHOR

...view details