తెలంగాణ

telangana

'జ్ఞానవాపిలో యథావిధిగా హిందువుల పూజలు'- ఆ పిటిషన్​ను కొట్టేసిన హైకోర్టు

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 12:09 PM IST

Updated : Feb 26, 2024, 12:39 PM IST

Gyanvapi Prayer Order Allahabad HC : జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువులు యథావిధిగా పూజలు చేసుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. జనవరి 31న హిందువులు పూజలు చేసుకోవచ్చన్న వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్​ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేస్తూ ఈ మేరకు తీర్పు వెల్లడించింది.

HC Of Allahabad On Gyanvapi Case
HC Of Allahabad On Gyanvapi Case

Gyanvapi Prayer Order Allahabad HC :ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు కొనసాగించవచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. హిందువులు పూజలు చేసుకోవచ్చన్న వారణాసి జిల్లా కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది. జిల్లా కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు లేవని తేల్చిచెప్పింది.

పరిశీలకుడిగా జిల్లా మెజిస్ట్రేట్‌
మసీదులోని 'వ్యాస్‌ తెహ్‌ఖానా' అని పిలిచే దక్షిణ నేలమాళిగలో హిందువులు పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్టు జనవరి 31న ఆదేశాలు జారీ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్‌ను వ్యాస్‌ తెహ్​ఖానాకు పరిశీలకుడిగా నియమిస్తూ జనవరి 17న ఉత్తర్వులిచ్చింది. ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా చేపట్టిన సర్వే నివేదిక ఆధారంగా అక్కడ హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నట్లు వారణాసి కోర్టు నిర్ధరించింది. ఈ క్రమంలో ఆ రెండు ఉత్తర్వులను మసీదు కమిటీ హైకోర్టులో సవాల్‌ చేసింది. వ్యాజ్యంపై ఫిబ్రవరి 15న విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది.

"జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకోవచ్చని ఈ రోజు అలహాబాద్​ హై కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ప్రదేశంలో అప్పట్లో హిందువులు మతపరమైన ఆచారాలు పాటించేవారని కోర్టు కూడా అంగీకరించింది. కాగా, ఎటువంటి ఆధారాలు లేకుండా 1993లో మసీదు ప్రాంగణంలో పూజలు చేయడాన్ని నిషేధించారు. దీనిని సవాలు చేస్తూ మేము వేసిన పిటిషన్​పై వారణాసి జిల్లా కోర్టు విచారణ చేపట్టి మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై హైకోర్టుకు వెళ్లిన అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సభ్యులకు ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్​ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ రోహిత్​ రంజన్​ అగర్వాల్​ కూడా సమర్థిస్తూ పిటిషన్​ను తోసిపుచ్చారు."
- సుభాశ్​ నందన్​ చతుర్వేది, న్యాయవాది

జ్ఞానవాపి మసీదు కేసు!
ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి ప్రార్థనా మందిరం విషయంలో యాజమాన్య హక్కుల కోసం కొన్నేళ్లుగా రెండు వర్గాల మధ్య వివాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే మసీదు ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తులను ఆరాధించుకోవడానికి అనుమతివ్వాలంటూ కొందరు హిందూ మహిళలు ఇటీవలే కోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో విచారణ జరిపిన వారణాసి కోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్‌ చేసిన వాజూఖానా మినహా మసీదు ప్రాంగణమంతా కార్బన్‌ డేటింగ్‌, ఇతర పద్ధతులతో భారత పురావస్తు విభాగం(ఏఎస్​ఐ) సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో కీలక విషయాలు బయటపడినట్లు హిందువుల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ ఇటీవలే తెలిపారు. మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలున్నట్లు నివేదిక పేర్కొందన్నారు. ఈ నేపథ్యంలో ప్రార్థనా మందిరంలో సీల్‌ చేసిన బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు కొద్దివారాల క్రితం వారణాసి కోర్టు అనుమతినిచ్చింది. కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన అర్చకులతో పూజలు చేయించాలని కోర్టు సూచించినట్లు హిందూ మహిళల తరఫు న్యాయవాది విష్ణు శంకర్‌ వెల్లడించారు.

'కేసు కోర్టులో ఉన్నా పదేపదే సమన్లా?'- ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఏడోసారి దూరం

ట్రాక్​పై లారీ బోల్తా- రైలుకు ఎదురెళ్లి వృద్ధ జంట సాహసం- వందల మంది ప్రాణాలు సేఫ్!

Last Updated : Feb 26, 2024, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details