తెలంగాణ

telangana

గర్భంలోని పిండం వయసు నిర్ధరణకు ఏఐ- ఇక డెలివరీ డేట్ మరింత పక్కాగా!

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 8:32 AM IST

Updated : Feb 27, 2024, 8:46 AM IST

Fetal Age Estimation AI Model : గర్భిణీ కడుపులో పెరుగుతున్న పిండం కచ్చితమైన వయసును నిర్ధరించేందుకు, పిండం స్థితిగతులు తెలుసుకునేందుకు ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు దేశంలోనే తొలిసారి కృత్రిమ మేధ (ఏఐ) మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఇది భారతీయ మహిళలు గర్భంలో పెరిగే పిండం వయసును కచ్చితత్వంతో అంచనా వేస్తుంది. తద్వారా దేశంలో మాతా శిశు మరణాల రేటు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Fetal Age Estimation AI Model
Fetal Age Estimation AI Model

Fetal Age Estimation AI Model :గర్భిణీలో పెరిగే పిండం కచ్చితమైన వయసును నిర్ధరించేందుకు ఐఐటీ మద్రాస్‌తోపాటు ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (టీహెచ్‌ఎస్‌టీఐ) పరిశోధకులు ఏఐ నమూనాను అభివృద్ధి చేశారు. భారత్‌లో ఈ తరహా ఏఐ మోడల్‌ను రూపొందించడం ఇదే తొలిసారి. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ మోడల్‌ను గర్భిణీ-జీఏ2గా పిలుస్తున్నారు.

గెస్టేషనల్‌ ఏజ్‌ అవసరం
గర్భిణీల సంరక్షణకు, ప్రసవ తేదీలను కచ్చితంగా నిర్ణయించడానికి సరైన గర్భధారణ వయసు (గెస్టేషనల్‌ ఏజ్‌) నిర్ధరించడం అవసరం. గర్భిణీ-జీఏ2గా పిలిచే ఈ ఏఐ నమూనాను భారత జనాభా డేటాను ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఇది భారతీయ మహిళలు గర్భం దాల్చిన తర్వాత పిండం కచ్చితమైన వయసును అంచనా వేస్తుంది. అంతేకాదు ప్రస్తుతం ఉపయోగిస్తున్న విధానంలో ఉన్న లోపాలను మూడు రెట్లు తగ్గిస్తుంది.

మాతా శిశు మరణాల రేటు తగ్గే ఛాన్స్​!
ప్రస్తుతం పిండం వయసును నిర్ధరించడానికి పాశ్చాత్య మహిళల కోసం అభివృద్ధి చేసిన పద్ధతిని వైద్యులు ఉపయోగిస్తున్నారు. కానీ దీని ద్వారా భారతీయ గర్భిణీల కడుపులోని పిండం వయసును నిర్ధరించినప్పుడు పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. తాజాగా అభివృద్ధి చేసిన ఈ జీఏ2 మోడల్​ పిండం వయసును కచ్చితంగా అంచనా వేస్తుందని, దీనివల్ల ఎలాంటి తప్పులు జరిగే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ప్రసూతి వైద్యులు మెరుగైన సంరక్షణ అందించేందుకు వీలవుతుందని, తద్వారా భారత్‌లో మాతా శిశు మరణాల రేటు తగ్గుతుందని చెప్పారు.

కాన్పు తేదీ పక్కాగా!
పిండం వయసు పక్కాగా ఉన్నప్పుడు గర్భిణీ కాన్పు తేదీ అత్యంత కచ్చితంగా చెప్పొవచ్చని, ఈ ఏఐ మోడల్‌ ద్వారా అది సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. భారతీయ జనాభా, జననాలు, గర్భధారణ సమయాల్లో మార్పుల్ని దృష్టిలో ఉంచుకుని ఆ సాంకేతికతను ఆవిష్కరించినట్లు వెల్లడిస్తున్నారు. భారత జనాభాపరంగా చూస్తే గర్భధారణ నుంచి కాన్పు సమయాల మధ్య చివరి నెలల్లో పిండం, కాన్పు సమయాల్ని అంచనా వేయడంలో పలు లోపాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

'దేశానికి చాలా అవసరం'
ఈ పరిశోధనను భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేశ్ గోఖలే ప్రశంసించారు. గర్భంలోని పిండం వయసును అంచనా వేయడానికి జనాభా-నిర్దిష్ట నమూనాలను అభివృద్ధి చేయడం ప్రశంసనీయమైన పరిణామమని పేర్కొన్నారు. ఈ ఏఐ మోడల్‌లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధ్రువీకరణ పొందుతున్నాయని చెప్పారు. కృత్రిమమేధతో తెచ్చిన ఈ మోడల్‌ దేశానికి చాలా అవసరమని అన్నారు. ఈ పరిశోధన వివరాలు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పీర్-రివ్యూడ్ జర్నల్ లాన్సెట్​లో ప్రచురితమయ్యాయి.

గర్భిణీ ప్రాజెక్టులో భాగంగా!
జనన ఫలితాలపై అధునాతన ప్రయోగాల కోసం కేంద్ర బయోటెక్నాలజీ శాఖ(డీబీటీ) తీసుకొచ్చిన గర్భిణీ ప్రాజెక్టులో భాగంగా ఈ కృత్రిమమేధతో ఉన్న కొత్త మోడల్‌ ఆవిష్కరించారు. ఐఐటీ మద్రాస్‌కు చెందిన అసోసియేట్ డాక్టర్‌ హిమాన్షు సిన్హా, టీహెచ్‌ఎస్‌టీఐ అహ్మదాబాద్‌కు చెందిన గర్భిణీ ప్రాజెక్టు ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ షింజినీ భట్నాగర్‌ సారథ్యంలో వీరేంద్ర పి.గడేకర్‌, నిఖిత దామరాజు, అష్లే గ్జేవియర్‌, శంబో బాసు ఠాకుర్‌, రమ్య విజయరామ్‌, రఘునాథన్‌ రంగాసామి, బాపు కౌండిణ్య దేశిరాజు, సుమిత్‌ మిశ్రా, నిత్యా వాద్వా, రామచంద్రన్‌ తిరువెంగడం, స్వాతీ రాథోర్‌, అనుజా అబ్రహం, సంతోష్‌ బెంజిమిన్‌, అన్నే జార్జ్‌ చెరియన్‌, అశోక్‌ ఖురానా ఈ పరిశోధనలో పాల్గొన్నారు.

అయితే గర్భిణీ-GA2 ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేయడానికి అధునాతన డేటా సైన్స్​తోపాటు కృత్రిమ మేధ పద్ధతులను పరిశోధకులు ఉపయోగించారు. ఈ పరిశోధనను గురుగ్రామ్ సివిల్ హాస్పిటల్, దిల్లీ సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, పుదుచ్చేరి ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భాగస్వామ్యంతో దిగ్విజయంగా నిర్వహించారు. రానున్న రోజుల్లో ఈ మోడల్‌ను ప్రసూతి వైద్యులు, నియోనాటాలజిస్ట్‌ల్లో ఉంచినప్పుడు దేశంలోని శిశుమరణాలు, గర్భస్థ మరణాలు బాగా తగ్గించవచ్చు.

గర్భిణీలకు నడుము నొప్పి ఎందుకొస్తుంది? తగ్గడానికి ఏం చేయాలి?

ప్రెగ్నెన్సీ టైమ్​లో ఈ ఆహారం తింటున్నారా? - మీ బిడ్డ హెల్త్ డేంజర్​లో పడ్డట్టే!

Last Updated : Feb 27, 2024, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details