తెలంగాణ

telangana

దిల్లీలోని 97 స్కూళ్లకు బాంబు బెదిరింపులు- పోలీసులు అలర్ట్- టెన్షన్ టెన్షన్! - Bomb Threat At Delhi Schools

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 9:38 AM IST

Updated : May 1, 2024, 12:21 PM IST

Bomb Threat At Delhi Schools: దిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పదుల సంఖ్యలో స్కూళ్లలో బాంబులు పెట్టామని యాజమాన్యానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యి తనిఖీలు చేపట్టారు.

Bomb Threat At Delhi Schools
Bomb Threat At Delhi Schools

Bomb Threat At Delhi Schools:దేశ రాజధాని దిల్లీలోని ఎన్​సీఆర్ పరిధిలో ఉన్న పదుల సంఖ్యలో విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపాయి. మయూర్‌ విహార్‌లోని మదర్‌ మేరీ స్కూల్‌, ద్వారక, వసంతకుంజ్‌, నోయిడా సెక్టార్ 30లోని దిల్లీ పబ్లిక్‌ స్కూళ్లు, చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్‌, సాకేత్‌లోని అమిటీ సహా 97 స్కూళ్లకు మెయిళ్ల ద్వారా బుధవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే ఐదు పాఠశాలలను ఖాళీ చేయించినట్లు చెప్పారు. బాంబు స్క్వాడ్లు, అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
మయూర్ విహార్​లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకలోని దిల్లీ పబ్లిక్ స్కూల్, చాణక్యపురిలోని సంస్కృతి పాఠశాల, వసంత్ కుంజ్‌ లోని దిల్లీ పబ్లిక్ స్కూల్, సాకేత్‌ లోని అమిటీ పాఠశాల, గ్రేటర్ నోయిడాలోని దిల్లీ పబ్లిక్ స్కూళ్ల యాజమాన్యానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అన్ని స్కూళ్లకు మెయిల్స్ ఒకే ఐడీ నుంచి వచ్చాయి. స్కూళ్లకు బాంబు బెదిరింపుల వెనుక ఒకే వ్యక్తి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మెయిల్ పంపిన వ్యక్తిని కనుక్కొనేందుకు దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌ సహా భద్రతా ఏజెన్సీలు దర్యాప్తు చేపట్టాయి. 'బుధవారం వేకువజామున 4 గంటల 15 నిమిషాలకు ఒకే ఈ-మెయిల్ ఐడీ నుంచి దిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మాకు సమాచారం అందిన వెంటనే స్కూళ్లను మూసివేయాలని యాజమాన్యాలను ఆదేశించాం. విద్యార్థులను తిరిగి ఇంటికి పంపించాం. పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాం' అని ఆగ్నేయ దిల్లీ డీసీపీ రోహిత్ మీనా తెలిపారు.

'అవన్నీ బూటకపు బెదిరింపులు'
దిల్లీలోని ఎన్ సీఆర్ పరిధిలోని ఆరు స్కూళ్లు బాంబు బెదిరింపులు రావడంపై కేంద్ర హోం శాఖ స్పందించింది. ఇవన్నీ బూటకపు ఈ-మెయిల్స్ అని తెలిపింది. ఈ బెదిరింపులపై దిల్లీ పోలీసులు, భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయని పేర్కొంది.

'సమగ్ర నివేదిక ఇవ్వండి' మరోవైపు పాఠశాలల్లో బాంబు బెదిరింపులపై తనకు వివరణాత్మక నివేదిక అందించాలని దిల్లీ పోలీస్ కమిషనర్​ను ఆదేశించారు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. స్కూళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.

'ఎటువంటి అనుమానిత వస్తువులు కనిపించలేదు'
మయూర్ విహార్​లోని మదర్ మేరీస్ స్కూల్ తనిఖీలు చేపట్టగా ఎటువంటి అనుమానిత (పేలుడు) వస్తువులు లభించలేదని దిల్లీ అగ్నిమాపక అధికారి జేబీ సింగ్ తెలిపారు. ఎవరో ఆకతాయిలు బూటకపు బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన అభిప్రాయపడ్డారు. 'మా స్కూల్​లో బాంబు పెట్టారని మాకు మెయిల్ వచ్చింది. వెంటనే మేం పోలీసులకు సమాచారం అందించాం. అలాగే విద్యార్థులను ఇంటికి తిరిగి పంపించాం. వారి తల్లిదండ్రులకు సైతం సమాచారాన్ని తెలియజేశాం' అని నోయిడాలోని దిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కామిని తెలిపారు.

దిల్లీ మంత్రి స్పందన:దిల్లీ ఎన్​సీఆర్ పరిధిలో పలు పాఠశాలకు బాంబు బెదిరింపులపై ఆ రాష్ట్ర మంత్రి ఆతిశీ స్పందించారు. 'పాఠశాలల్లోని విద్యార్థులను ఇంటికి పంపించాం. స్కూళ్లలో దిల్లీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు ఎటువంటి అనుమానస్పద వస్తువు కనిపించలేదు' అని ట్వీట్ చేశారు.

బెంగళూరులో 48 స్కూళ్లకు బాంబు బెదిరింపులు- పేరెంట్స్​లో ఫుల్​ టెన్షన్- పోలీసులు అలర్ట్

అయోధ్య కొత్త ఆలయం పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపులు- యూపీ సీఎంకు కూడా!

Last Updated :May 1, 2024, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details