కాంగ్రెస్ 11 సార్లు అధికారంలో ఉన్నా ఏం అభివృద్ధి చేసింది : కేటీఆర్
Minister KTR Road Show at Miryalaguda : రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే.. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహణ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మిర్యాలగూడలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రి.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రోడ్ షోకి వచ్చిన ప్రజలని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ ర్యాలీలా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మిర్యాలగూడ ఎలా ఉన్నదో.. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఒకసారి ఆలోచన చేయ్యాలని మంత్రి సూచించారు. కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల విద్యుత్ సరఫరా కనపించడం లేదని ఆరోపించారు. ఏసీ బస్సులు, బిర్యానీ పెట్టి తిప్పి చూపిద్దామని ఎద్దేవా చేశారు.
BRS Election Campaign in Miryalaguda : 11 సార్లు అధికారంలో ఉన్నా.. ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేతగాని వారి చేతుల్లో పెడదామా ఈ రాష్ట్రాన్ని? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తారని.. గ్రామాల్లో పట్వారి వ్యవస్థను తీసుకొస్తామంటున్నారని మండిపడ్డారు. కొత్త జిల్లాలు ఎప్పుడు ఏర్పాటు చేసినా మిర్యాలగూడను జిల్లాగా చేస్తామని హామీనిచ్చారు. దామరచర్లలో రూ.30 వేల కోట్లతో పవర్ ప్లాంట్‌ను కడుతున్నామని చెప్పారు. గాడిదలకు గడ్డి వేసి.. ఆవులకు పాలు పిండితే వస్తాయా అని మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు.