పేదోళ్లు ఉద్యమం చేస్తే, పెద్దోళ్లు రాజ్యం ఏలుతున్నారు: బండి సంజయ్
BJP Leader Bandi Sanjay in Husnabad Election Campaign : పేదోళ్లు ఉద్యమం చేస్తే, పెద్దోళ్లు రాజ్యం ఏలుతున్నారని.. అందుకే బీసీ ముఖ్యమంత్రిని గెలిపించుకోవాలని.. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీజేపీ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న బండి సంజయ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ అభ్యర్థి శ్రీరామ్‌కు మద్దతుగా బండి సంజయ్ ఎన్నికల ప్రచారం చేశారు. కరీంనగర్‌లో చెల్లని రూపాయి పొన్నం ప్రభాకర్ అని విమర్శించారు. కేటీఆర్ సీఎం అయితే బీఆర్ఎస్లో ముసలం పుడుతుందన్నారు.
BJP Husnabad Election Campaign : 70 మంది కాంగ్రెస్ అభ్యర్థులపై కేసీఆర్ పెట్టుబడి పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కొందరు పోలీసు అధికారులు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి రూ.లక్ష కోట్లు ఎలా వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తమకు 74 కేసులు గిఫ్ట్‌గా ఇచ్చారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారులు తెరమరుగైపోయారని.. కేవలం కేసీఅర్ కుటుంబమే రాజ్యమేలుతుందంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు. అన్ని వర్గాల కోసం పోరాడింది బీజేపీ మాత్రమేనని.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విషయంలో పోరాడి జైలుకు వెళ్లారో చెప్పాలంటూ బండి సంజయ్ నిలదీశారు.