Niranjan Reddy Fires on Bhatti : 'కాంగ్రెస్ చేసిన పాపమే.. పాలమూరుకు శాపమైంది'
Published: May 17, 2023, 6:18 PM

Niranjan Reddy comments on Bhatti Vikramarka in Hyderabad : కాంగ్రెస్ పార్టీ చేసిన పాపమే పాలమూరుకు శాపంగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. పాలమూరు- రంగారెడ్డికి అడ్డుపుల్ల వేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆక్షేపించారు. వందల కేసులు ఎదుర్కొని పాలమూరు- రంగారెడ్డి పనులను తుది దశకు తీసుకువచ్చామని చెప్పారు. పాలమూరు వలసలు, ఆకలి చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు.
263 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం వదిలి.. 6 టీఎంసీలున్న జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని పట్టుబట్టింది హస్తం పార్టీ నేతలేనని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ కోసం యువత బలిదానాలు చేస్తుంటే.. కోస్తాంధ్రను కలిపి రాష్ట్రం ఏర్పాటు చేయాలని అధిష్ఠానానికి లేఖలు రాశారని ధ్వజమెత్తారు. కృష్ణా జలాల పంపిణీపై కాంగ్రెస్ నేతలు ఒక్కరోజైనా కేంద్రానికి లేఖ రాశారా అని మండిపడ్డారు. భట్టి విక్రమార్క పాలమూరు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.