ETV Bharat / t20-world-cup-2022

కోహ్లీపై పాక్ కెప్టెన్​ ఆసక్తికర వ్యాఖ్యలు.. విరాట్​కు హ్యాట్సాఫ్ చెప్పిన రోహిత్​

author img

By

Published : Oct 23, 2022, 9:08 PM IST

icc t20 world cup 2022
icc t20 world cup 2022

పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం తమ జట్టు ఓటమిపై స్పందిచాడు. ఈ సందర్భంగా విరాట్‌ కోహ్లీ ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్​ రోహిత్ శర్మ సైతం విరాట్​ను కొనియాడాడు.

Ind Vs Pak T20 World Cup : ప్రపంచకప్‌లో నాలుగు వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్‌ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమ్‌ ఇండియా సారథి రోహిత్‌శర్మ హర్షం వ్యక్తం చేశాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన విరాట్‌ను కొనియాడాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం సైతం తమ జట్టు ఓటమిపై స్పందించాడు. తమ ఆటగాళ్లు చివరి వరకు పోరాడారని తెలిపాడు. ఈ సందర్భంగా విరాట్‌ కోహ్లీ ఫామ్‌పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వారే మలుపు తిప్పారు
"మ్యాచ్‌ ఫలితం నాకు నోటమాట రానివ్వలేదు. వీలైనంతవరకు ఎక్కువ సేపు ఆటలో ఉండేందుకే మేం ప్రయత్నించాం. ఇక్కడి పిచ్‌లోనే ఏదో ఉంది. ఇఫ్తికార్‌, మసూద్‌ కలిసి చివరివరకు గట్టిపోటీనిచ్చారు. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ఎంతో శ్రమించాల్సి వస్తుందని మాకు ముందే అర్థమైంది. హార్దిక్‌ పాండ్య, విరాట్‌ కోహ్లీ ప్రశాంతంగా ఆడి ఆటను మలుపుతిప్పారు. గెలిచామనే భావన కన్నా.. ఓడిపోతామనుకుని తిరిగి పుంజుకుని విజయం సాధించడం మరింత ఆనందం ఇచ్చింది. ఎల్లవేళలా మాకు తోడుగా నిలుస్తూ భారతీయులు మాకు అందించిన ప్రోత్సాహం మరువలేనిది" అంటూ రోహిత్ తెలిపాడు.

అప్పుడు మియాందాద్.. ఇప్పుడు కోహ్లీ
బాబర్‌ మాట్లాడుతూ.. "కొత్త బాల్‌తో ఆడటం అంత తేలికైన విషయం కాదు. అయినా మా బౌలర్స్‌ అద్భుతంగా ఆడారు. గెలుపు క్రెడిట్‌ అంతా విరాట్‌కే దక్కుతుందని నేను భావిస్తాను. మా జట్టులో ఇఫ్తికార్‌, షాన్‌ చాలా బాగా ఆడారు. 80వ దశకాల్లో ఒక్క సిక్స్‌ బాది మియాందాద్‌ ఆటను ముగించేవాడని భారతీయులు వినే ఉంటారు. 2014లో షాహిన్‌ అఫ్రిది ఇలాగే చేశాడు. ఇప్పుడు మళ్లీ విరాట్‌, హార్దిక్‌ల భాగస్వామ్యం చివరి ఓవర్లో అద్భుతం చేసింది. ఇక భారత్‌ పనైపోతుందని అనుకున్న సమయంలో విరాట్‌ మాయాజాలం చేశాడు. స్టేడియం నుంచి ఒక్కరు కూడా లేచి వెళ్లలేదు. క్రీడలకు ఇంతకన్నా మంచి ప్రచారం ఉంటుందా? చాలా మంది క్రికెట్‌ అభిమానులు విరాట్‌ ఫామ్‌పై సందేహం వ్యక్తం చేశారు. కానీ, ఫామ్‌ కన్నా క్లాస్‌ శాశ్వతం అని ఈరోజు అతడి ప్రదర్శనతో రుజువుచేశాడు" అంటూ వివరించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.