ETV Bharat / sukhibhava

కంటిని కంటికి రెప్పలా కాపాడుకునే పద్ధతి ఇదే..!

author img

By

Published : Aug 17, 2020, 10:31 AM IST

ప్రపంచాన్ని చూపించే కళ్లు డీలా పడిపోతే ఎలా? ఆ కళ్లు నిత్యం కళకళలాడాలి. ఆ చూపు మసకబారకుండా వెలిగిపోవాలి. అప్పుడే కదా, అసలుసిసలైన, ఆరోగ్యవంతమైన నయనాలు ఆనందాన్ని ఒలకపోసేది. మరి ఆ కళ్ల కోసం మనం ఏం చేయాలి...? కంటిపాపను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం రండి..

Yoga improves circulation to eye muscles.
కంటిని కంటికి రెప్పలా కాపాడే పద్ధితి ఇదే..!

రోజంతా విశ్రాంతి లేకుండా పనిచేసే కండరాల్లో నయనాలు ముందు వరసలో ఉంటాయి. మరి, ఆ కళ్లు అలసిపోకుండా ఉండాలంటే యోగా చేయాలంటున్నారు నిపుణులు. కళ్లకు శక్తినిచ్చే యోగాలో ఓ మూడు ముద్రలు కళ్ల అలసటను దూరం చేస్తాయన్నారు.. కైవలళ్యధామ్ యోగా సంస్థలో సలహాదారు, జనరల్ సర్జన్ డాక్టర్ సతీష్ పతాక్. మరి అవేంటో చూసేయండి...

  1. బ్రహ్మ ముద్ర
  2. వ్యాఘ్ర ముద్ర (సింహ ముద్ర)
  3. త్రాతక్

బ్రహ్మ ముద్ర

బ్రహ్మ ముద్ర వేయడం వల్ల ముఖ, కను కండరాల్లో రక్త ప్రసరణ పెరుగతుంది. మరి ఈ ముద్ర ఎలా వేయాలంటే..

  • మెడ కండరాలు వదులుగా పెట్టండి. ఆపై మెల్లిగా ఎడమవైపుకు తిప్పండి. కొద్ది క్షణాలు ఉంచి మళ్లీ ముందుకు తీసుకురండి. ఇప్పుడు మళ్లీ కుడివైపుకు తిప్పండి. కొద్ది సెకండ్లు ఆగి, నిదానంగా యాథాస్థితికి తీసుకురండి.
  • ఇప్పుడు మెడను నిదానంగా పైకెత్తి కొద్దిసేపుంచి, కిందికి దించండి. మళ్లీ ఛాతీని తాకే విధంగా తలను దించి కాసేపుంచి మళ్లీ యాథాస్థితికి తీసుకురండి.
  • ఎడమ వైపు కాసేపు, కుడివైపు కాసేపు వంచి ఉంచండి. మళ్లీ తటస్థ స్థితిలోకి తీసుకురండి.
  • చివరిగా తలను మెల్లిగా కుడి నుంచి ఎడమ వైపుకు, ఎడమ నుంచి కుడికి తిప్పండి.
  • మెడ నొప్పులు ఉన్నవారు తలను కిందికి వంచకుండా పక్కలకు తిప్పొచ్చు.
  • ఈ ముద్రలన్నీ కళ్లుమూసుకుని.. మీకు వీలైనన్ని సార్లు చేయాలి.
  • బ్రహ్మ ముద్ర పూర్తయ్యాక, ఓ నిమిషం తర్వాత నిదానంగా కళ్లు తెరవాలి. అప్పుడే తాజాగా భావన కలుగుతుంది.

సింహ ముద్ర

  • ముక్కుతో ఊపిరి పీల్చుకుని, నోరు వీలైనంత తెరచి, నాలుక బయటికి తీసి కళ్లు పెద్దవి చేసి గాలిని వదలాలి. ఇలా మూడు సార్లు పునారావృతం చేయాలి.
  • ఈ ముద్రను మూడేళ్ల వయసు నుంచి వృద్ధుల దాకా ఎవరైనా చేయొచ్చు.

మరి ఎవరు చేయొద్దు...

  • కన్నుగుడ్డు ఉబ్బినవారు ఈ సింహ ముద్ర చేయకూడదు.
  • గ్లౌకోమా వంటి కంటి సమస్యలు ఉన్నవారు చేయరాదు.
  • గర్భంతో ఉన్నవారు సింహ ముద్ర వేయడం అంత మంచిది కాదు.

త్రాతక్

  • 15 ఏళ్ల వయసును మించినవారెవరైనా ఈ త్రాతక్ ముద్ర వేయొచ్చు. యోగా నిపుణుల ఆధ్వర్యంలో చేయడం మరింత ఉత్తమం. త్రాతక్ అంటే ఓ బిందువు, లేదా నిప్పు కణిక మీద దృష్టిని కేంద్రీకృతం చేయడమే. అయితే, కంటి సమస్యలతో బాధపడేవారు ఈ ప్రయోగం చేసి కంటికి మరింత ఒత్తిడి కలిగించకూడదు.
  • ఈ త్రాతక్ ముద్రను ఉదయాన్నే చేయడం ఉత్తమం. ఉదయం వేళ పచ్చదనం వైపు చూడటానికి ప్రయత్నించండి, సుదూర వస్తువుపై ఓ నిమిషం పాటు దృష్టిని కేంద్రీకరించండి.
  • ఆ తర్వాత రెండు అరచేతులను రాపిడి చేసి కళ్లపై సున్నితంగా కప్పేయండి. అలా చేతుల కిందే కనురెప్పలను తెరిచి మూయండి. ఇలా ఓ 15-20 నిమిషాలు చేయండి.

ఉదయించే సూర్యుడిని చూడండి..

ఈ ముద్రలతో పాటు కంటిని కాపాడుకునే మరికొన్ని పురాతన పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలుంటాయి.

తెల్లవారుజామున సూర్యుడు ఉదయించే సమయంలో.. సూర్య రశ్మిని చూసే ప్రయత్నం చేయండి. అయితే, ఈ ప్రక్రియను బారెడు పొద్దెక్కాక చేస్తే మొదటికే మోసం వస్తుంది.

ఉదయం లేచిన వెంటనే, కళ్లపై తడి గుడ్డను వేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి. తడిగుడ్డ కాకపోతే దోసకాయ, క్యారెట్, బంగాళదుంప, లేదా పచ్చి అరటిపండును వాడొచ్చు.

ఇలా ఈ పద్ధతులన్నీ పాటిస్తే కంటి కండరాలకు ఎంతో శక్తి లభిస్తుంది. దీంతో కళ్లు కళకళలాడతాయి.

ఇదీ చదవండి: ఎల్లలు దాటిన 'స్వాతంత్ర్య' భారత సంబరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.