ETV Bharat / sukhibhava

మతిమరుపు రావడానికి కారణాలేంటో తెలుసా

author img

By

Published : Aug 23, 2022, 7:00 AM IST

Forgetful Disease సాధారణంగా చాలా మంది ఎప్పుడూ ఏదో ఒకటి మరిచిపోతుంటారు. మళ్లీ కాసేపటికే గుర్తు తెచ్చుకుంటారు. అది మామూలు విషయమే కానీ అసలు మతిమరుపు ఎందుకొస్తుంది. కారణాలేంటి.

Forgetfulness Reasons
Forgetfulness Reasons

Forgetful Disease: ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి మరచిపోవటం, కాసేపయ్యాక అవి తిరిగి గుర్తుకురావటం మామూలే. వయసు మీద పడుతున్నకొద్దీ ఎంతో కొంత మతిమరుపూ వస్తుంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఇబ్బంది పడొచ్చు. లేదూ పాత విషయాలు గుర్తు రావటానికి కాస్త ఎక్కువ సమయం పట్టొచ్చు. అలాగని వృద్ధాప్యంతో మతిమరుపు వస్తుందని కాదు. దీనికి రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు.

నిద్రలేమి
జ్ఞాపకశక్తికి నిద్ర చాలా కీలకం. దీర్ఘకాలం గుర్తుంచుకోవటానికి తోడ్పడే మెదడు కణాల మధ్య అనుసంధానాలు నిద్రపోతున్నప్పుడే బలోపేతమవుతాయి. అందుకేనేమో నిద్ర సరిగా పట్టనప్పుడు ఆయా విషయాలు చప్పున గుర్తుకురావు. నిద్రలేమితో మనసు కుదరుగా ఉండదు కూడా. దీంతో జ్ఞాపకాలు ఏర్పడటం కష్టమవుతుంది. కాబట్టి రాత్రిపూట కంటి నిండా నిద్రపట్టేలా చూసుకోవాలి. ఇందుకు రోజూ వ్యాయామం చేయటం, వేళకు పడుకోవటం, పొద్దుపోయాక మద్యం, కాఫీ తాగకపోవటం వంటివి మేలు చేస్తాయి.

మధుమేహం
మధుమేహంతో బాధపడేవారికి డిమెన్షియా వంటి మతిమరుపు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. రక్తంలో గ్లూకోజు నిరంతరం ఎక్కువగా ఉండటం వల్ల మెదడులోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతినటం దీనికి కారణం కావొచ్చు. ఇన్సులిన్‌ మోతాదులు ఎక్కువగా ఉండటమూ మెదడు కణాలను దెబ్బతీయొచ్చు. మధుమేహం, మతిమరుపు మధ్య సంబంధాన్ని తెలుసు కోవటానికి శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనాలు చేస్తున్నారు. ఏదేమైనా మధుమేహం ఉన్నట్టయితే మందులు, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహం లేనివారు నివారణ మీద దృష్టి పెట్టాలి.

జన్యువులు
జ్ఞాపకశక్తి తగ్గటం, డిమెన్షియా రావటంలో తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యువులూ పాలు పంచుకుంటాయి. అయితే ఇదంత తేలికైన విషయం కాదు. కొన్నిరకాల డిమెన్షియాలో జన్యువుల పాత్ర ఎక్కువగా ఉంటే, కొన్నింటిలో తక్కువగా ఉంటుంది. ఒకరిలో మతిమరుపునకు కారణమయ్యే జన్యువు మరొకరిలో ఎలాంటి ప్రభావమూ చూపకపోవచ్చు. జన్యు పరీక్షతో దీనికి సంబంధించిన సమాచారం కొంతవరకు ఉపయోగపడొచ్చు.

వయసు
వృద్ధాప్యం మీద పడుతున్నకొద్దీ మతిమరుపు ఎక్కువవుతూ రావొచ్చు. ఇది రోజువారీ పనులను దెబ్బతీసేలా కూడా మారొచ్చు. డిమెన్షియా రకాల్లో ప్రధానమైన అల్జీమర్స్‌ జబ్బు బారినపడుతున్నవారిలో 65 ఏళ్లు దాటినవారే ఎక్కువ. ఇందులో జన్యువులు మాత్రమే కాదు.. ఆహారం, వ్యాయామం, సామాజిక జీవనం.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బుల వంటి సమస్యలూ పాలు పంచుకుంటాయి.

పక్షవాతం
మెదడులో కొంత భాగానికి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు పక్షవాతం వస్తుంది. ఫలితంగా మెదడు కణజాలం దెబ్బతింటుంది. దీంతో ఆలోచించటం, మాట్లాడటం, గుర్తు పెట్టుకోవటం, ఏకాగ్రత చూపటం కష్టమవుతుంది. దీన్నే వ్యాస్కులర్‌ డిమెన్షియా అంటారు. పైకి ఎలాంటి లక్షణాలు లేకుండా తలెత్తే సూక్ష్మ స్థాయి పక్షవాతం పదే పదే రావటం కూడా మతిమరుపును తెచ్చిపెట్టొచ్చు. పక్షవాతం ముప్పును పెంచే అధిక రక్తపోటు, గుండె జబ్బు, పొగ తాగే అలవాటుతోనూ ఇలాంటి డిమెన్షియా తలెత్తొచ్చు. ముఖం ఒకవైపున వాలిపోవటం.. ఒక చేయి, ఒక కాలు బలహీనం కావటం.. మాట తత్తరపోవటం వంటి పక్షవాత లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం తాత్సారం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించటం ముఖ్యం.

పొగ తాగటం
పొగతాగే వారిలో ఆలోచించటానికి, ఆయా విషయాలను గుర్తు పెట్టుకోవటానికి తోడ్పడే మెదడులోని భాగం దెబ్బతినే ప్రమాదముంది. అలాగే పొగ రక్తనాళాలను దెబ్బతీయటం కూడా డిమెన్షియాకు దారితీయొచ్చు. పొగ అలవాటుతో పక్షవాతం ముప్పూ పెరుగుతుంది. ఇది వ్యాస్కులర్‌ డిమెన్షియాకు కారణమవుతుంది. కాబట్టి పొగ తాగే అలవాటుంటే వెంటనే మానెయ్యటం మంచిది. మానటం కష్టంగా ఉంటే మానసిక నిపుణులను సంప్రదించాలి.

తలకు దెబ్బలు
ప్రమాదాల్లో తలకు దెబ్బలు తగలటం స్వల్పకాల జ్ఞాపకశక్తి మీద ప్రభావం చూపొచ్చు. అంతకుముందు రోజు చేసిన పనులు గుర్తురాకపోవచ్చు. విశ్రాంతి తీసుకోవటం, మందులు వేసుకోవటం ద్వారా త్వరగా కోలుకోవచ్చు. బాక్సింగ్‌, ఫుట్‌బాల్‌ వంటి ఆటల్లో తరచూ తలకు దెబ్బలు తగలటం వల్ల మున్ముందు డిమెన్షియా ముప్పు పెరగొచ్చు. తలకు దెబ్బలు తగలటం వల్ల స్పృహ కోల్పోయినా, చూపు మందగించినా, తల తిప్పినా, తికమక పడుతున్నా, వికారంగా ఉన్నా వెంటనే ఆసుపత్రికి చేర్చాలి.

ఊబకాయం
మధ్యవయసులో శరీర ఎత్తు, బరువు నిష్పత్తి (బీఎంఐ) 30 కన్నా ఎక్కువుంటే మున్ముందు డిమెన్షియా ముప్పు పెరుగుతుంది. అధిక బరువుతో ఎప్పుడైనా సరే గుండె జబ్బు ముప్పు పొంచి ఉంటుంది. ఇదీ కొన్నిసార్లు మెదడు క్షీణించటానికి, మతిమరుపు సమస్యలు తలెత్తటానికి దారితీయొచ్చు. కాబట్టి అధిక బరువు, ఊబకాయం తలెత్తకుండా చూసుకోవాలి.

వ్యాయామం చేయకపోవటం
క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మెదడు క్షీణించటం, మతిమరుపు, డిమెన్షియా ముప్పులు తగ్గుతాయి. అప్పటికే డిమెన్షియా గలవారిలోనూ వ్యాయామంతో మెదడు పనితీరు మెరుగవుతుంది. రోజుకు కనీసం అరగంట సేపు నడిచినా చాలు.

ఇవీ చదవండి: బరువు తగ్గేందుకు రన్నింగ్, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

వారు శృంగారం పట్ల ఆసక్తి చూపరు, పెంపకమే కారణమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.