ETV Bharat / sukhibhava

వాన నీటిలో నడుస్తున్నారా? జర భద్రం.. ఆ వ్యాధి వచ్చే ప్రమాదం!

author img

By

Published : Jul 11, 2022, 7:03 AM IST

flood water health risks
వాన నీటిలో నడుస్తున్నారా? జర భద్రం.. ఆ వ్యాధి వచ్చే ప్రమాదం!

వానలు దంచికొడుతున్నాయి. అనేక చోట్ల వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోతోంది. చాలా మందికి ఆ నీటిలో నుంచే నడిచి వెళ్లక తప్పని పరిస్థితి. అయితే.. అలా వాన నీటిలో నడవడం ప్రమాదకరమని అంటున్నారు వైద్యులు. వర్షాకాలంలో ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులూ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.

వరద నీటితో ఆరోగ్యానికి ముప్పు

వానాకాలం వచ్చిందంటే చాలు రోడ్లపై ఎక్కడ చూసినా నీరు ప్రవహిస్తుంది. రకరకాల ప్రదేశాల నుంచి వచ్చి చేరే ఆ కలుషిత నీటిలో నడవడం ప్రమాదకరం. కాళ్ల ద్వారా హానికారక వైరస్​ శరీరంలోకి ప్రవేశించి.. లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకినవారు 24 నుంచి 72 గంటల వ్యవధిలో వైద్యుడిని సంప్రదించాలి.

లెప్టోస్పైరోసిస్ ఎలా సోకుతుంది?
నిల్వ ఉన్న వర్షపు నీటిలో లెప్టోస్పైరా అనే బ్యాక్టీరియా ఉంటుంది. దీని నుంచి లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి సోకుతుంది. వాన నీటిలో ఎలుకలు, కుక్కలు, గేదెలు లాంటి జంతువుల మూత్రం కలిసి ఉంటుంది. ఎవరైనా ఈ నీటిలో నడిస్తే ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కాళ్లకు ఏమైనా గాయాలైన వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం అధికం.

చికిత్స ఎలా?
లెప్టోస్పైరోసిస్ వ్యాధి బారిన పడిన వారు.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యులు సూచించిన ఔషధాలను తీసుకోవాలి. ఈ వ్యాధి బారిన పడిన గర్భిణీలు, 8 ఏళ్లలోపు చిన్నారులు వైద్యుల సలహా మేరకే తగిన మందులు వాడాలి.

ఇది అంటు వ్యాధా?
లెప్టోస్పైరా అనే సూక్ష్మజీవిని అనేక జంతువులు తీసుకొస్తాయి. ఈ వ్యాధికి ప్రత్యేక వ్యాధి లక్షణాలు ఏమీ ఉండవు. అయితే.. వర్షాకాలంలో జ్వరం వస్తే మాత్రం.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది అంటువ్యాధి కాదు.

flood water health risks
వరద నీటితో ఆరోగ్యానికి ముప్పు

Flood water health risks: లెప్టోస్పైరోసిస్​తో పాటు వర్షాకాలంలో మరెన్నో వ్యాధులు సోకే ప్రమాదముంది. అవి..

  • మలేరియా
  • డయేరియా
  • కలరా
  • పారాసైటిక్ క్రిప్టోస్పోరీడియం
  • డెంగ్యూ
  • చికున్​ గున్యా
  • హెపటైటిస్​ ఏ, ఈ
  • శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లు
  • చర్మ సంబంధ సమస్యలు

5 tips to stay healthy this monsoon: ఒకటి రెండు రోజులకు మించి జ్వరం ఉండడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం, వాంతులు, విరేచనాలు, మూత్రం పసుపు రంగులో రావడం.. వీటిలో ఏ లక్షణాలు కనిపించినా వెంటనే అప్రమత్తం కావాలి. వైద్యుడ్ని సంప్రదించాలి.
వర్షాకాలంలో తాగు నీరు కలుషితమైతే.. బ్యాక్టీరియా లేదా వైరస్​ల కారణంగా అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ బారిన పడే ప్రమాదముంది. అలాంటి వారికి విరేచనాలు, వాంతులు అవుతాయి. డీహైడ్రేషన్​ జరుగుతుంది. తీవ్రత మరీ ఎక్కువైతే.. కిడ్నీలు దెబ్బతినే అవకాశముంది. అందుకే తాగు నీటిని కాచి, చల్లార్చి తాగడం ముఖ్యం.

flood water health risks
వరద నీటితో ఆరోగ్యానికి ముప్పు

వర్షాకాలంలో తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలు:

  • కాళ్లు, చేతులు పొడిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే చర్మ సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది.
  • వర్షపు నీటిలో నుంచి బయటకు రాగానే.. కాళ్లు కడుక్కుని, పొడి వస్త్రంతో తుడుచుకోవాలి.
  • తాజాగా, వేడిగా ఉండే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి.
  • నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా రసాయనాలు చల్లుకోవాలి.
  • వ్యాధులు విజృంభించకుండా ముందస్తుగా వ్యాక్సిన్లు తీసుకోవాలి.
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే సహాయక సిబ్బంది, వాలంటీర్లు చేతులకు రబ్బరు గ్లౌజులు, కాళ్లకు బూట్లు వాడాలి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.