ETV Bharat / sukhibhava

బరువు తగ్గుతున్నారంటే అనుమానించాల్సిందే!

author img

By

Published : Sep 5, 2020, 10:31 AM IST

reducing-weight-without-doing-any-exercise-might-be-diabetes
బరువు తగ్గితున్నారంటే అనుమానించాల్సిందే!

అరకిలో, కిలో బరువు తగ్గటం, పెరగటం మామూలే. దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ, ఎలాంటి వ్యాయామాలు చేయకపోయినా..అదేపనిగా బరువు తగ్గుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. అదేంటి బరువు తగ్గితే మంచిదేగా అనుకుంటున్నారా? అవును, అతిగా బరువు తగ్గిపోవడం అనారోగ్య లక్షణమే అంటున్నారు వైద్యులు.

ఉన్నట్టుండి భారీగా బరువు తగ్గిపోతున్నారనిపిస్తే.. శ్రమలేకుండా బరువు తగ్గిపోతున్నామని ఆనందించకండి. ఎందుకంటే ఇది మధుమేహం తొలి లక్షణం కావొచ్చు అంటున్నారు నిపుణులు. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.

ఎందుకు తగ్గుతారు...?

మన శరీరంలోని ప్రతి కణానికీ శక్తి అవసరం. ఇది మనం తిన్న ఆహారంలోని గ్లూకోజు నుంచి లభిస్తుంది. కణాల్లోకి గ్లూకోజు చేరుకునేలా చూడటంలో ఇన్సులిన్‌ హార్మోన్‌ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే మధుమేహుల్లో ఇన్సులిన్‌ అంత సమర్థంగా పనిచేయదు. దీంతో కణాల్లోకి గ్లూకోజు చేరుకోవటం తగ్గుతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరుగుతాయి.

కణాల్లోకి గ్లూకోజు చేరనప్పుడు శరీరం తగినంత ఆహారం లభించటం లేదని భావిస్తుంది. దాన్ని భర్తీ చేసుకోవటానికి ఇతర మార్గాలను అన్వేషిస్తుంది. కొవ్వును, కండరాలను వేగంగా ఖర్చు చేసుకోవటం ద్వారా శక్తిని సృష్టించుకుంటుంది. ఇది బరువు తగ్గటానికి దారితీస్తుంది.

కిడ్నీలు కూడా..

ఇక కిడ్నీలు కూడా రక్తంలో అధికంగా ఉన్న చక్కెరలను తొలగించుకోవటానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఇందుకు అధిక శక్తి అవసరమవుతుంది. ఇది కిడ్నీలు దెబ్బతినటానికీ దారితీయొచ్చు. అందువల్ల అకారణంగా బరువు తగ్గుతుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు.

ఇదీ చదవండి:అందుకే రోజుకి కనీసం ఓ కొబ్బరి బోండం తాగేయాలి !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.