ETV Bharat / sukhibhava

చెవిలో గులిమి తీస్తున్నారా?.. అయితే మీరు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

author img

By

Published : Jan 8, 2023, 7:15 AM IST

చాలామంది చెవిలో గులిమి ఉందని ఏవేవో పెట్టి తిప్పి వినికిడి సంబంధిత సమస్యలను కోరి తెచ్చుకుంటారు. అయితే చెవిలో ఉన్న గులిమి ఎలా తీయాలి? చెవిలో గులిమి ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అనే అంశాలపై నిపుణులు కొన్ని సలహాలను ఇచ్చారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

Lump in the ear - precautions
చెవిలో గులిమి - జాగ్రత్తలు

చెవిలో గులిమి - జాగ్రత్తలు

జ్ఞానేంద్రియాలలో చెవికి చాలా ప్రాముఖ్యం ఉంది. చెవి బయట నుంచి వచ్చే సూక్ష్మజీవులు లోపలికి పోకుండా గులిమి స్రవిస్తుంది. అయితే ఈ విషయం తెలియకుండా చాలామంది చెవిలో ఏదో ఒకటి పెట్టి గులిమిని బయటకు తీసేయాలని అనుకుంటారు. దీనివల్ల చెవి నొప్పి, ఇన్ఫెక్షన్స్, వినికిడి లోపం వంటి సమస్యలను కోరితెచ్చుకుంటారు. మనం ఆహారం తినేటప్పుడు దవడలు కదలడం ద్వారా చెవిలో ఉండే గులిమి వాటంతట అదే బయటకు పోతుందని అంటున్నారు వైద్యులు. అయితే చెవిలో గులిమి ఉంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను సూచించారు నిపుణులు. అవేంటంటే?..

చెవిలో గులిమి ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • చెవిలో గులిమి ఉండటం మంచిదే. ఇది చెవిని రక్షిస్తుంది. చెవిలో గులిమి దానంతట అదే బయటకు పోతోంది. దీన్ని బయటకు తీయడం అంత మంచిది కాదు.
  • స్విమ్మింగ్, స్నానం చేసేటప్పుడు చెవి లోపలికి నీరు వెళ్లకుండా చూసుకోవాలి. దీనివల్ల కార్టిలైజ్డ్ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదముంది.
  • తరచూ చెవిలో ఎదో ఒకటి పెట్టి గులిమి తీయటం మంచిదికాదు. దీనివల్ల చెవిలోని కర్ణభేరి పొర దెబ్బతింటుంది.
  • బయట ఎవరైనా గులిమి తీస్తామంటే వారికి చెవిని ఇవ్వకూడదు.
  • నొప్పి రాకుండా చెవిలో గులిమి బయటకు తీయగలమని అనిపిస్తే తీయొచ్చు. లేకుంటే నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
  • చెవిలో గులిమి తీసేందుకు చెవి నాళం కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్నవాటిని వాడకూడదు. దీనివల్ల గులిమి ఇంకాస్త లోపలికి వెళ్లిపోతోంది.
  • కొంతమందికి చెవిలో ఏదో ఒకటి పెట్టి తిప్పుకునే అలవాటు ఉంటుంది. దీనివల్ల చెవిపోటు సమస్యలు వస్తాయి. ఈ అలవాటును మానుకుంటే మంచిది.
  • చిన్న పిల్లలకు చెవిలో గులిమి తీసేందుకు క్లాత్​ను ఉపయోగిస్తారు. ఇలా చేయటం కూడా మంచిది కాదు. దీనివల్ల గులిమి ఇంకాస్త లోపలికి పోయి వినికిడి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
  • గులిమి ఎండిపోయి రాళ్లలా మారితే అలాంటప్పుడు ఇయర్ డ్రాప్స్ వేసి దాన్ని మెత్తబడేలా చేసుకోవచ్చు. అయితే ఈ సమస్య ఒక శాతం మందిలో మాత్రమే తలెత్తుతుంది.
  • వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు చెవిలోకి నీరు చేరి గులిమి ఉబ్బిపోతుంది. దీనివల్ల చెవి నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల చల్లటి వాతావరణంలో చెవిలోకి నీరు చేరకుండా చూసుకోవాలి.
  • బయటకు వెళ్లేటప్పుడు దుమ్ము, ధూళి, పొగ వలన చెవిలో వ్యర్థాలు చేరుతాయి. ఇవే చెవిపోటుకు కారణం అవుతాయి. అయితే బయటకు వెళ్లేటప్పుడు చెవికి రక్షణ ఏర్పరచుకోవడం మంచిది.
  • పరిస్థితి తీవ్రంగా ఉంటే సొంత వైద్యం మానేసి, వైద్యులను సంప్రదించటం ఉత్తమం.
  • ఇవీ చదవండి:
  • బార్లీ గింజల నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా?
  • మేకప్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుందా? అవి వాడితే ప్రమాదమా?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.