ETV Bharat / sukhibhava

సైనస్​తో బాధ పడుతున్నారా?.. ఈ చిట్కాలు పాటిస్తే మంచి రిజల్ట్స్​ పక్కా​!

author img

By

Published : Jul 20, 2023, 7:26 AM IST

How To Reduce Sinusitis Pain : ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో సైనసైటిస్ ఒకటి. అలాంటి ఈ వ్యాధి తగ్గాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని తరిమికొట్టొచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం..

How To Reduce Sinusitis Pain
How To Reduce Sinusitis Pain

How To Reduce Sinusitis Pain : సైనసైటిస్ వ్యాధి దీర్ఘకాలం బాధిస్తుంది. ముక్కు లోపలి భాగాల్లో ఉండే గాలి గదులను సైనస్ అని అంటారు. ఈ సైనస్ లు ఇన్ఫెక్షన్ కు గురికావడం వల్ల సైనసైటిస్ వస్తుంది. ముక్కుకు ఇరువైపులా నుదురు, కళ్ల చుట్టూ నొప్పులు ఉంటాయి. జలుబు, తలనొప్పి, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలతో చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది ఉన్నవారు చాలా కాలం పాటు మందులు వాడుతూ ఉంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు, సహజ పద్ధతులతో సైనస్ ను తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Sinusitis Symptoms : మన ముఖం లోపల ఖాళీగా ఉండే భాగాలను సైనస్​లను, వాటికి వచ్చే ఇన్ఫెక్షన్​ను సైనసైటిస్ అని అంటారు. కళ్ల మధ్యలో ముక్కుకు ఇరువైపులా నుదుటి భాగంలో ఉండే సైనస్​ల్లో గాలి ఉంటుంది. వీటిల్లో జిగురు వంటి శ్రావం ఉత్పత్తి అవుతుంది. ఈ శ్లేష్మం మనం పీల్చే గాలిని తేమగా ఉంచుతుంది. అలాగే ముక్కులో బ్యాక్టీరియా, ఇతర రోగకారక క్రిములు చేరకుండా కాపాడుతుంది. సైనస్​ల లోపలి పొర వాపునకు గురై వాటి మార్గాలు మూసుకుపోవడాన్ని సైనసైటిస్ అంటారు. ఈ సైనసైటిస్​ను రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి అక్యూట్ అయితే, మరొకటి క్రానిక్ సైనసైటిస్.

అక్యూట్ సైనసైటిస్​లో ముక్కు కారడం, ముఖంలో ఒత్తిడి, నొప్పి, వాసన గ్రహించే శక్తి తగ్గడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఇది నాలుగు వారాల్లోగా తగ్గుతుంది. సాధారణ జలుబు వల్ల ఈ సమస్య వస్తుంది. పదే పదే సైనసైటిస్ రావడం వల్ల అది క్రానిక్ గా మారుతుంది. ఇది 12 వారాల వరకు ఉంటుంది. సాధారణంగా దీనికి బ్యాక్టీరియా కారణం అవుతుంది. ముక్కు కారుతూ, ముఖ భాగాల్లో నొప్పి ఉండి, పది రోజుల వరకు లక్షణాలు తగ్గకపోతే అది బ్యాక్టీరియా వల్ల వచ్చిన సైనసైటిస్ కావొచ్చు.

"సైనసైటిస్ అనేది చాలా రకాల కారణాల నుంచి వస్తుంది. కాలుష్యం, వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల సైనసైటిస్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు అలర్జీ వల్ల కూడా దీని బారిన పడే ప్రమాదం ఉంది. ముక్కులో ఎముక వంకరగా ఉన్నా, పిల్లల్లో ఎడినాయిడ్ సమస్య ఉన్నా సైనసైటిస్ రావొచ్చు. డయాబెటిస్​తో బాధపడేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. షుగర్ వ్యాధితో బాధడేవారికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా వస్తాయి" అని ప్రముఖ ఈఎన్​టీ వైద్యులు, డాక్టర్ సి.ఆంజనేయులు చెప్పుకొచ్చారు.

చికిత్స చేయకపోతే కష్టం!
సైనసైటిస్​కు గురైనప్పుడు ముఖంలో ముక్కు, నుదురు, కళ్ల భాగాల్లో నొప్పి ఉంటుంది. తల తిప్పినా, వంచినా నొప్పి పెరుగుతుంది. ముక్కు దిబ్బడ కూడా ఉంటుంది. చెవుల్లో నొప్పి, శ్వాసలో చెడు వాసన ఉంటాయి. చాలా వరకు సైనసైటిస్ దానంతట అదే తగ్గుతుంది. అయితే సైనసైటిస్​కు చికిత్స చేయకపోతే బ్యాక్టీరియా కళ్లకు, మెదడుకు చేరితే ప్రమాదకరంగా మారొచ్చు. సైనస్ లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులను సంప్రదిస్తే.. చెవులు, ముక్కు, గొంతును పరిశీలించి లక్షణాలు, ఆరోగ్య వివరాలను తెలుసుకొని సైనసైటిస్​ను నిర్ధరిస్తారు.

లక్షణాలను తెలుసుకోండిలా..
సైనస్ లక్షణాలు ఎలా ఉన్నాయి? అవి ఎంత కాలం నుంచి ఉన్నాయి? అనే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. జలుబు, అలర్జీలను తగ్గించే ముందులు, ముక్కు దిబ్బడను తగ్గించే డీ-కంజెస్టెంట్స్​ను వాడటం ద్వారా ముక్కు రంధ్రాలను శుభ్రం చేయడంతో సైనస్ బాధలు తగ్గుతాయి. సైనస్​తో బాధపడేవారు దాన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. సైనస్ లక్షణాలను త్వరగా గుర్తించి, చికిత్స చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కులో ఏదైనా అనాటామికల్ సమస్య ఉందేమో తెలుసుకోవాలి. సీటీ స్కాన్ ద్వారా సైనస్ ఇన్ ఫ్లమేషన్​ను తెలుసుకొని చికిత్స చేయించుకోవాలి. సైనస్​తో బాధపడేవారు వ్యాయామం లాంటివి చేస్తూ దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇలాంటి వాళ్లకు ఆవిరి పట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చిక్కగా ఉండే శ్లేష్మం పలుచగా మారుతుంది. వేడినీళ్లతో స్నానం చేయాలి.

ఈ చిట్కాలతో సైనస్​కు చెక్!
స్నానం చేసే నీళ్లలో యూకలిప్టస్ నూనెను కలపడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. చక్కటి ప్రశాంతమైన నిద్ర అవసరం. విశ్రాంతి తీసుకోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే తెల్ల రక్తకణాలను మన శరీరం మరింత ఎక్కువగా ఉత్పత్తి చేయగలుగుతుంది. తల కింద దిండ్లను పెట్టుకొని తల, ఛాతీ భాగం పైకి ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల సైనస్​లో ద్రవాలు పేరుకుపోకుండా ఉంటాయి. నీళ్లు, ఇతర ద్రవాలను ఎక్కువగా తాగాలి. శారీరక వ్యాయామాల వల్ల రక్తప్రసరణ మెరుగై ముక్కు దిబ్బడ తగ్గుతుంది. సైనసైటిస్ అంటువ్యాధి కానప్పటికీ.. దానికి కారణమైన బ్యాక్టీరియా, వైరస్​లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి.

సైనసైటిస్ వ్యాధి తగ్గాలంటే ఏం చేయాలి? ఈ సహజ పద్ధతులు పనికొస్తాయా?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.