ETV Bharat / sukhibhava

పుచ్చకాయతో డీహైడ్రేషన్​కు చెక్​.. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు!

author img

By

Published : Feb 20, 2023, 1:43 PM IST

ఎండాకాలం మొదలైనట్లే కనిపిస్తోంది. మధ్యాహ్నం పూట ఎండలు బాగా మండుతున్నాయి. మరి ఈ ఎండల నుంచి శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవడానికి మంచి ఉపాయం పుచ్చకాయ. అవును వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఓ సారి చూద్దాం.

watermelon benefits
పుచ్చకాయ వల్ల ఉపయోగాలు

ఆకుపచ్చ, ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా మనకు పుచ్చకాయలు దర్శనమిస్తుంటాయి. చూడగానే నోరూరించే ఈ పుచ్చకాయలను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పుచ్చకాయను నేరుగా తిన్నా లేదంటే జ్యూస్​గా తీసుకున్నా శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. వేసవి కాలంలో పుచ్చకాయ తినడం వల్ల డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. పుచ్చకాయ తినడం వల్ల కలిగే లాభాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

పుచ్చకాయను నేరుగా తినడం లేదా జ్యూస్ చేసుకోని తాగడం శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. అలాగే ఎండల వల్ల శరీరం కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఉక్కపోత, వడదెబ్బ నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. పుచ్చకాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్​లు ఉంటాయి. వీటి వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బరువు తగ్గించే పుచ్చకాయ: పుచ్చకాయ తినడం లేదంటే జ్యూస్ రూపంలో తాగడం వల్ల బరువు తగ్గుతారు. అందులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉండడం సహా క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా డైట్​లో ఉన్న వాళ్లు కూడా దీనిని తీసుకోవచ్చు. పుచ్చకాయలో కొలెస్ట్రాల్​ కూడా ఉండదు. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు పుచ్చకాయను తినొచ్చు.

"ఎండాకాలంలో శరీరానికి నీరు ఎక్కువ అవసరం అవుతుంది. చెమట, మూత్రం రూపంలో శరీరం ఎక్కువ నీటిని కోల్పోతుంది. కాబట్టి శరీరానికి తగిన నీటి శాతం అందించడానికి ఉపయోగపడే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇందులో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. తక్కువ స్థాయిలో షుగర్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా పుచ్చకాయను తీసుకోవచ్చు."

- డా.అంజలీదేవి, న్యూట్రిషనిస్ట్

పుచ్చకాయను తినడం వల్ల త్వరగా కడుపు నిండడం సహా జీర్ణశక్తి పెరుగుతుంది. ఎలక్ట్రోలైట్లు, ఖనిజ లవణాలు, పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనిని అన్ని వయసుల వారు తినవచ్చు. తక్కువ స్థాయిలో షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ రోగులు కాడా తినవచ్చు అని నిపుణలు చెబుతున్నారు.

పుచ్చకాయతో లాభాలు..
పుచ్చకాయను తినడం/జ్యూస్ తాగడం వల్ల శరీరానికి బీటా కెరాటిన్, విటమిన్ ఎ, బి1, బి6, మెగ్నీషియం, సి, పొటాషియం లభిస్తాయి. అలాగే పుచ్చకాయ గుజ్జులో, తొక్కలో సిట్రోలిన్ అనే అమైనో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తనాళాలు బాగా పనిచేస్తాయి. అలాగే పుచ్చకాయలో ఎక్కువగా పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు తగ్గుతుంది. పుచ్చకాయ వల్ల లభించే లైకోపెన్.. గుండెజబ్బు ముప్పును తగ్గిస్తుంది. చర్మ సంరక్షణలో కూడా పుచ్చకాయ జ్యూస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి: పుచ్చకాయను కోసిన వెంటనే తినడం వల్ల శరీరానికి అన్ని పోషకాలు, ఖనిజాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే కోసిన తర్వాత నిల్వ ఉంచడం వల్ల నీటిలో కరిగే విటమిన్లు పోతాయని, ఫలితంగా తక్కువ పోషకాలు, ఖనిజాలు శరీరానికి లభిస్తాయని అంటున్నారు. పుచ్చకాయ జ్యూస్​ను అప్పటికప్పుడు తయారుచేసుకొని తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. పుచ్చకాయను నేరుగా లేదా జ్యూస్ రూపంలో తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. పుచ్చకాయలో షుగర్​ ఉంటుంది కనుక సూక్ష్మజీవులు త్వరగా చేరడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. కాబట్టి పుచ్చకాయ జ్యూస్ తయారు చేసే పాత్రలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

పుచ్చకాయతో డీహైడ్రేషన్​కు చెక్​.. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.