ETV Bharat / sukhibhava

DENTAL PROBLEMS: మాస్కు వాడకంతో ఆ సమస్య పెరుగుతోంది.. గమనించారా?

author img

By

Published : Aug 17, 2021, 9:53 AM IST

DENTAL PROBLEMS, mask wearing problems
పెరుగుతున్న దంత సమస్యలు, లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతోంది

కరోనా నుంచి రక్షణకు గంటల తరబడి మాస్కు వాడుతున్నారా... ఇలా చేయడం వల్ల లాలాజల ఉత్పత్తి తగ్గిపోయి పళ్లు, చిగుళ్ల వంటి వాటిపై సూక్ష్మక్రిములు ప్రభావం చూపుతున్నట్టు వైద్యుల పరిశీలనలో తేలింది. ఇటీవల ఇలాంటి సమస్యలు(DENTAL PROBLEMS) ఎక్కువగా కనిపిస్తున్నాయని దంత వైద్య నిపుణులు చెబుతున్నారు.

కరోనా కారణంగా విరామం లేకుండా మాస్క్ వాడడం వల్ల దంత సమస్యలు(DENTAL PROBLEMS) పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. నోట్లో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోయి పళ్లు, చిగుళ్ల వంటి వాటిపై సూక్ష్మక్రిములు ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు. అప్పటికే దంత వ్యాధులతో బాధపడేవారికి కరోనా సోకితే పరిస్థితి తీవ్రమవుతోందని వైద్యుల పరిశీలనలో తేలింది. చిగుళ్ల వ్యాధులు ఉంటే సైటోకైన్‌ అనే కెమికల్‌ రియాక్షన్‌ జరిగి గొంతుపై ఉండే పైపొరపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్‌ సోకగానే ఆ వైరస్‌ నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతుంది. అందువల్ల మాస్కులు గంటల తరబడి వాడేవారు కొన్ని మెలకువలు పాటించాలని సూచిస్తున్నారు.

రోజూ లీటరు లాలాజలం...

ప్రతి వ్యక్తి నోట్లో రోజూ లీటరు లాలాజలం ఉత్పత్తవుతుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. నోటిని శుభ్రపర్చడానికి, పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని శుభ్రం చేయడానికి ఇది దోహదపడుతుంది. తిన్న ఆహారం అరగడానికి ఉపయోగపడే అమైలేజ్‌ ఎంజైమ్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. కడుపులో గ్యాస్‌ను నియంత్రిస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న లాలాజలం చాలా మందిలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి కావడంలేదు. కారణం.. విరామం లేకుండా మాస్కు వాడడమే. ఇటీవల చాలా మంది రెండు మాస్కులను ఉపయోగిస్తున్నారు. ఇది గాలిని సరిగా పీల్చలేని పరిస్థితికి దారితీస్తుంది. కొందరు ఎన్‌95 మాస్కు వాడుతూనే దాని కింద మూడు పొరలు ఉన్న మరో మాస్కును వాడుతున్నారు. దీంతో బయట గాలి అంతగా లోపలికి చొరబడదు. అడపాదడపా నోటి ద్వారానూ శ్వాస తీసుకుంటున్నారు. దీంతో నోరు ఎండిపోతోంది. ఫలితంగా నోట్లోని సూక్ష్మక్రిములు బలపడుతున్నాయి. అప్పటికే కొద్దిగా పుచ్చిన పళ్లపై ఇవి ప్రభావం చూపుతున్నాయి. చిగుళ్లు ఉబ్బడం, రక్తం కారడంతోపాటు నోట్లో దుర్వాసన ప్రారంభమవుతోంది. ఆ తరవాత పళ్లు కదిలిపోతుండటమే కాకుండా వాటి కింద ఎముకలూ దెబ్బతింటున్నాయి. మధుమేహం రోగుల్లో దీని తీవ్రత అధికంగా ఉంటోంది. చాలా వరకు వీరి దంతాలు దెబ్బతింటున్నాయని వైద్యుల పరిశీలనలో తేలింది.

ఇలా చేయండి...

  • ఉదాహరణకు ఎన్‌95 మాస్కు ఉపయోగించేవారు అదనంగా మూడు పొరల మాస్కు కాకుండా, వస్త్రంతో చేసినది వాడాలి. వాడిన మాస్కులు ఎట్టి పరిస్థితుల్లో శుభ్రపరచకుండా తిరిగి పెట్టుకోకూడదు. అలా చేస్తే సూక్ష్మక్రిములు పెరుగుదలకు ఆస్కారం ఇచ్చినట్లవుతుంది.
  • చుట్టూ ఎవరూ లేనప్పుడు, దూరంగా ఉన్నప్పుడు కొద్దిసేపు మాస్కు తీసినా ఇబ్బంది ఉండదు. తద్వారా బయట గాలి పీల్చుకోవడమే కాకుండా లాలాజల ఉత్పత్తికి దోహదపడుతుంది.
  • నోరు ఆరిపోతుందని భావించినప్పుడు మంచినీళ్లు తాగాలి.
  • రోజు రెండుసార్లు కచ్చితంగా దంత ధావనం చేయాలి.

-డాక్టర్ మేకా ప్రసాద్, కిమ్స్ డెంటల్ విభాగం ఇంఛార్జి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.