ETV Bharat / sukhibhava

రోజుకు ఎంత నీరు అవసరం? సరిపడా తాగుతున్నామో లేదో తెలుసుకోవడం ఎలా?

author img

By

Published : Oct 5, 2022, 8:35 AM IST

ఎంత నీరు అవసరమనేది మన ఆరోగ్యంతో పాటు ఉష్ణోగ్రత, మన శారీరక శ్రమ, పనుల వంటి వాటి ఆధారపడి ఉంటుంది. తగినంత నీరు తాగుతున్నామా? లేదా? అనేది గుర్తించటానికి తేలికైన మార్గం మూత్రం రంగు.

daily water intake calculator
రోజుకు ఎంత నీరు అవసరం?

మంచి ఆరోగ్యానికి నీరు అత్యంత అవసరం. మరి రోజుకు ఎంత నీరు తాగాలి? తేలికైన ప్రశ్నే గానీ దీనికి సమాధానం చెప్పటమే కష్టం. ఇది రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ ఒకే నియమం సరిపోదు. మన శరీరానికి ద్రవాలు ఎందుకు అవసరమనేది తెలుసుకుంటే రోజుకు ఎంత నీరు తాగాలనే అంచనాకు రావొచ్చు. ప్రతీ కణం, కణజాలం, అవయవం సరిగా పనిచేయటానికి నీరు తప్పనిసరి. ఉదాహరణకు- మూత్రం, చెమట, మలం ద్వారా మలినాలు బయటకు పోవటానికి.. శరీర ఉష్ణోగ్రత నార్మల్‌గా ఉండటానికి.. కీళ్లు తేలికగా కదలటానికి.. సున్నితమైన కణజాలాలు దెబ్బతినకుండా ఉండటానికి నీరు తోడ్పడుతుంది.

ఒంట్లో నీటి శాతం తగ్గితే ఇలాంటి పనులన్నీ మందగిస్తాయి. కొద్దిపాటి నీరు తగ్గినా శక్తి, ఉత్సాహం సన్నగిల్లుతాయి. అలసట ముంచుకొస్తుంది. కాబట్టి తగినంత నీరు తాగటం ప్రధానం. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలనేది సాధారణ సిఫారసు. అయితే ఎంత నీరు అవసరమనేది మన ఆరోగ్యంతో పాటు ఉష్ణోగ్రత, మన శారీరక శ్రమ, పనుల వంటి వాటి ఆధారపడి ఉంటుంది. తగినంత నీరు తాగుతున్నామా? లేదా? అనేది గుర్తించటానికి తేలికైన మార్గం మూత్రం రంగు. మామూలుగానైతే ఇది లేత పసుపు రంగులో ఉండాలి. ఏమాత్రం ముదురు రంగులోకి మారినా తగినంత నీరు తాగటం లేదనే అర్థం. నీరు తాగటానికి దాహం వేసేంతవరకు ఆగటం సరికాదు. మనకు దాహం వేసే సరికే ఒంట్లో నీటి శాతం తగ్గిపోయి ఉంటుందని తెలుసుకోవాలి. కాబట్టి అప్పుడప్పుడు గొంతు తడిచేసుకుంటూ ఉండాలి.

ఆహార నియమాలు పాటించినా..
మరోవైపు.. కొందరు ఆహార నియమాలు పాటిస్తున్నా.. వ్యాయామాలు చేస్తున్నా బరువు అంతగా తగ్గరు. దీనికి కారణం బద్ధకంతో కూడిన జీవనశైలి కావొచ్చు. రోజులో ఎక్కువసేపు కదలకుండా ఉండిపోతే ఆహార నియమాలు, వ్యాయామంతో చేకూరే ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. కొవ్వును కరిగించటంలో లైపేజ్‌ అనే ఎంజైమ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. గంటలకొద్దీ అలాగే కూర్చుంటే శరీరం తగినంత లైపేజ్‌ను ఉత్పత్తి చేయలేదు. కాబట్టి రోజంతా చురుకుగా ఉండటం అలవాటు చేసుకోవాలి. గంటకోసారైనా కుర్చీలోంచి లేచి కాసేపు నడవాలి. వీలైతే రెండు మూడు బస్కీలు తీసినా మంచిదే. కంటి నిండా నిద్ర పోకపోయినా బరువు తగ్గకపోవచ్చు. నిద్రలేమితో ఆకలిని ఆపేసే లెప్టిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో జీవక్రియలు నెమ్మదిస్తాయి కూడా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.