ETV Bharat / state

Yadadri Temple: యాదాద్రిలో భక్తుల కిటకిట.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

author img

By

Published : Jul 18, 2021, 11:14 AM IST

Updated : Jul 18, 2021, 12:00 PM IST

యాదాద్రిలో భక్తుల కిటకిట
యాదాద్రిలో భక్తుల కిటకిట

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి(Yadadri Temple) ఆలయం కిటకిటలాడుతోంది. నేడు స్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా.. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడం వల్ల భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కరోనా నిబంధనల మధ్య దర్శనం చేసుకునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం(Yadadri Temple) కోలాహలంగా మారింది. ఆదివారం కావడం వల్ల పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది. నేడు స్వామివారి జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు.

rush at yadadri lakshmi narasimha swamy temple
లక్ష్మీనరసింహస్వామికి హారతి నివేదన

సువర్ణ పుష్పార్చన..

తెల్లవారుజామునే తరలివచ్చిన భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకున్నారు. అష్టోత్తర శతఘటాభిషేకంలో పాల్గొన్నారు. శతకలశాలు ఏర్పాటు చేసి వాటిలోని జలాలతో నరసింహుణ్ని అభిషేకించారు. వేదమంత్రాలు, మంగళ వాద్యాల నడుమ సువర్ణ పుష్పార్చన చేశారు. దాదాపు రెండు గంటలపాటు అర్చకులు.. స్వామివారికి స్వాతి నక్షత్రం పూజలు నిర్వహించారు. ఈరోజు జరిగిన ప్రత్యేక పూజల్లో ఆలేరు కోర్టు జడ్జి మణికంఠ, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, ఆలయ ఈఓ గీతారెడ్డి, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.

rush-at-yadadri-lakshmi-narasimha-swamy-temple
నరసింహుని సేవలో ఆలేరు జడ్జి

నిత్య కల్యాణ ఉత్సవం

బాలాలయంలోని లక్ష్మీనరసింహ స్వామి(Yadadri Temple) మూర్తులకు హారతి నివేదన చేసి, ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించారు. సుదర్శన నరసింహ హోమం, స్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణ ఉత్సవాన్ని ఘనంగా జరిపారు.

rush at yadadri lakshmi narasimha swamy temple
యాదాద్రిలో భక్తుల కిటకిట

భక్తుల కిటకిట..

ఆదివారం కావడం, స్వామి వారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని పెద్దఎత్తున భక్తులు యాదాద్రికి తరలివచ్చారు. ధర్మదర్శనానికి దాదాపు గంటన్నర సమయం.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యనారాయణ వ్రత మండపాలు, కల్యాణ కట్ట, వసతి గృహ సముదాయాల వద్ద సందడి కనిపించింది.

rush-at-yadadri-lakshmi-narasimha-swamy-temple
భక్తుల కిటకిట

కరోనా నిబంధనల మధ్య దర్శనం..

కరోనా నిబంధనల మధ్య భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మాస్కు ధరించిన వారినే లోనికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఆలయంలోని వచ్చిన వారందరికీ శానిటైజర్ అందజేస్తున్నట్లు వివరించారు. భౌతికదూరం పాటించేలా.. క్యూలైన్లు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు.. కొండపైకి వాహనాలు అనుమతించడం లేదు.

rush-at-yadadri-lakshmi-narasimha-swamy-temple
క్యూలైన్​లో భక్తుల బారులు

గర్భాలయ ద్వార పునఃప్రతిష్ట..

పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి(Yadadri Temple) గర్భాలయ ద్వార పునః ప్రతిష్ట మహోత్సవాన్ని నేడు నిర్వహిస్తున్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా సంప్రోక్షణతో పాటు పునఃప్రతిష్ట పర్వాన్ని చేపడుతున్నారు. గర్భాలయ ద్వారం విస్తరణ కోసం ఈ నెల 6 నుంచి స్వయంభువుల దర్శనాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. నేటి నుంచి మూలవర్యులతో సహా స్వర్ణ మూర్తులను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు.

Last Updated :Jul 18, 2021, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.