ఉగాది రోజు కోళ్లు, మేకలు తెగాల్సిందే...!

author img

By

Published : Apr 13, 2021, 4:56 PM IST

non veg on ugadi festival at mothkur village

ఉగాది అంటే పూజలు, షడ్రుచుల పచ్చడి, తియ్యని బొబ్బట్లు, కమ్మని పిండివంటలు. పూర్తిగా వెజిటేరియన్​ పండుగ. వాళ్లకు మాత్రం ఉగాది... ఒక నాన్​వెజ్​ పండుగ. పొద్దున్నే గ్రామ దేవతల ముందు... కోళ్లు, మేకలు తెగాల్సిందే. ఏళ్లనాటి నుంచి వస్తున్న ఈ సంప్రదాయం... ఎక్కడో కాదు. మన రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోనే...!

ఉగాది పండుగ రోజు పొద్దున్నే లేచి తలస్నానాలు చేసి... పచ్చని తోరణాలు.. పూల దండలు... మామిడి ముక్కల పులుపులు, బొబ్బట్ల ఘుమఘుమలే మనకు మదిలో మెదులుతాయి. నిజానికి ఇదే వాతావరణం దాదాపు అన్ని తెలుగిళ్లలోనూ ఉంటుంది. మనం మామిడి ముక్కలు, చింతపులుసు, వేపాకు చిగురులతో చేసిన షడ్రుచులు పచ్చడి తాగి... బొబ్బట్ల మీద నెయ్యి వేసుకుని తింటుుంటే... వాళ్లు మాత్రం మసాలాలు దట్టించిన మటన్​ కూర, కారం కారంగా వండిన చికెన్​ ముక్కలు ఉండాల్సిందే అంటున్నారు. అందరికీ ఇది శాకాహార పండుగ అయితే... మాకు మాత్రం మాంసాహార పండుగే అంటున్నారు... యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ప్రజలు. ఎందుకు ఇలా జరుపుకుంటారో తెలియాలంటే... వంద ఏళ్ల క్రితం గ్రామంలో జరిగిన కథ తెలుసుకోవాలి.

వందేళ్ల క్రితం నుంచి...

వందేళ్ల క్రితం ఇదే ఉగాది సమయంలో... గ్రామంలో అతిసార వ్యాధి సోకి అధిక సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. చలిబోనాలు సమర్పిస్తే... అతిసార మహమ్మారి నుంచి గ్రామ దేవతలు కాపాడతారని నమ్మి నైవేద్యాలు నివేదించారు. అప్పుడు ఆ వ్యాధి తగ్గుముఖం పట్టింది. అప్పటి నుంచి పాటిస్తున్న ఆ ఆనవాయితీని... ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇలా ఉగాది రోజున దేవతకు కోళ్లు, మేకలు బలి ఇవ్వడం వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని ఇక్కడివారి నమ్మకం .
వంద ఏళ్ల క్రితం లాగనే మళ్లీ ఇప్పుడు కూడ కరోనా రూపంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని... గ్రామ దేవత కటాక్షం వల్ల అందరు క్షేమంగా ఉండాలని బోనాలు సమర్పించారు. గ్రామస్థులంతా కలిసి... వైభవంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

ఇదీ చూడండి: ఉగాది పంచాంగ శ్రవణం.. రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.