ETV Bharat / state

యాదాద్రీశా.. ఎంఎంటీఎస్‌ రైలుకేదీ మోక్షం..!

author img

By

Published : Apr 3, 2023, 1:22 PM IST

MMTS
MMTS

MMTS Train HYD to Yadadri Update : హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నగరం నుంచే రోజుకు 10 వేల మంది భక్తులు వస్తున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు వేస్తే ప్రయాణం సులువు అవుతుందని భక్తులు కోరుకుంటున్నారు. కానీ ఆరేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. ఈ రైలు మార్గానికి ఎప్పటికీ మోక్షం కలుగుతుందో వేచిచూడాలి .

MMTS Train HYD to Yadadri Update : భాగ్యనగరానికి చేరువగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహాలయానికి భక్తుల సంఖ్య రోజురోజుకు అనూహ్యంగా పెరుగుతోంది. ఏటా దాదాపు కోటి మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇందులో హైదరాబాద్ నుంచి వెళ్తున్నవారే ఎక్కువగా ఉన్నారు. నగరం నుంచి రోజుకు 10 వేల మంది భక్తులు వస్తున్నారని యాదాద్రి ఆలయ అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైలు వేస్తే భక్తులకు సౌలభ్యంగా ఉంటుంది. ఈ రైళ్లు అక్కడి వరకు పొడిగించాలని రాష్ట్ర సర్కార్‌ గతంలో ద.మ. రైల్వేకు ప్రతిపాదించింది. ఆరేళ్లు దాటినా ఒక్క అడుగు ముందుకు పడలేదనే చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ నెల 8న సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునర్నిర్మాణంతో పాటు.. తిరుపతికి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించడానికి వస్తున్న ప్రధాని మోదీ ఈ విషయంపై దృష్టిపెట్టాలని భాగ్యనగర ప్రజలు కోరుకుంటున్నారు.

యాదాద్రికి ఎంఎంటీఎస్ ప్రతిపాదించి ఆరేళ్లు : నగర శివారులోని ఘట్‌కేసర్‌ వరకూ మూడు లైన్లుండగా.. అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడో లైను వేయాలని దక్షిణ మధ్య రైల్వేకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దాని నిర్మాణం కోసం అయ్యే ఖర్చులో రెండు వాటాలు ఇస్తామని సర్కార్ ప్రకటించింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన రైల్వే అధికారులు ఖర్చుపై నివేదిక సమర్పించారు. ఆనాటి లెక్కల ప్రకారం రూ.330 కోట్లు అంచనా వేసింది. ఈ ఎంఎంటీఎస్ కోసం రూ.220 కోట్లు రాష్ట్ర సర్కార్ భరించడానికి అంగీకారం కుదిరింది. టెండరు ప్రక్రియకు దక్షిణమధ్య రైల్వే సిద్ధమైనా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా నిధులందకపోవడంతో కేంద్రం ఈ ప్రతిపాదనను పక్కన పడేసింది. దాంతో ఆరేళ్లు గడిచినా ఫలితం లేదు. ప్రాజెక్టు ఆలస్యం అవుతున్నకొద్దీ దీనిపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.

ఎంఎంటీఎస్ రెండో దశ కొనసాగింపుగా : కొత్తగా చేపట్టిన ఎంఎంటీఎస్‌ రెండో దశ నగర శివారులోని ఘట్‌కేసర్‌ వరకూ ఉంది. సికింద్రాబాద్‌ నుంచి ఘట్‌కేసర్‌కు 21 కిలోమీటర్ల కొత్త లైను ఇటీవలే అందుబాటులోకి తీసుకువచ్చారు. ఘట్‌కేసర్ నుంచి మరో 35 కిలోమీటర్లు కొనసాగిస్తే.. రాయగిరి(యాదాద్రి)కి ఎంఎంటీఎస్‌ రైళ్లు చేరేవి. అప్పుడు కేవలం 20రూపాయల టిక్కెట్‌తో నగరవాసికి యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం లభించేది. ప్రస్తుతం భాగ్యనగరం నుంచి రోడ్డుమార్గంలో యాదాద్రికి 65 కిలోమీటర్లు వెళ్లేందుకు దాదాపు 2 గంటల సమయం పడుతోంది. అదే ఎంఎంటీఎస్‌ రైళ్లు అందుబాటులోకి వస్తే కేవలం సికింద్రాబాద్‌ నుంచి 45 నిమిషాల నుంచి గంటలోపు వెళ్లేందుకు అవకాశం లభిస్తుందని నగరవాసులు కోరుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.