ETV Bharat / bharat

కదులుతున్న రైలులో దారుణం.. ప్రయాణికుడిపై పెట్రోల్​ పోసి నిప్పు.. ముగ్గురు మృతి

author img

By

Published : Apr 3, 2023, 7:06 AM IST

Updated : Apr 3, 2023, 10:54 AM IST

రైలులో తోటి ప్రయాణికుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడో వ్యక్తి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో 9 మంది గాయపడ్డారు. ఈ దారుణం కేరళలో జరిగింది. మరోవైపు, అప్పుడే పుట్టిన నవజాత శిశువును కుక్క నోటితో తీసుకెళ్లిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని ఓ ఆస్పత్రిలో జరిగింది.

A dog that bit a newborn baby in Shimoga Meggan Hospital
A dog that bit a newborn baby in Shimoga Meggan Hospital

కేరళలో దారుణం జరిగింది. కదులుతున్న రైలులో ఓ గుర్తుతెలియని వ్యక్తి.. తన తోటి ప్రయాణికుడికి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు. ఈ దారుణం కోజికోడ్​ జిల్లా ఎలత్తూరు రైల్వే స్టేషన్​ సమీపంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్​ ఎక్స్​ప్రెస్​ రైలు కోజికోడ్​ నగరం దాటి.. కొరపుజా రైల్వే వంతెన వద్దకు చేరుకుంది. రాత్రి 9.45 గంటలకు డీ1 కాంపార్ట్​మెంట్​లో ఎర్ర చొక్కా, టోపీ ధరించి ఉన్న ఓ వ్యక్తి.. తోటి ప్రయాణికులపై రెండు బాటిళ్ల పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. దీంతో డీ1 బోగీలో చెలరేగిన మంటలు డీ2 కంపార్ట్​మెంట్​కు కూడా వ్యాప్తించాయి. భయాందోళనకు గురైన ప్రయాకులు ఎమర్జెన్సీ చైన్​ లాగి రైలును ఆపారు. కొందరు రైలులోంచి కిందకు దూకే ప్రయత్నం కూడా చేశారు. అనంతరం దాదాపు 35 ఏళ్ల వయసున్న నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.

9 మంది క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి.. తన బంధువులు ఓ చిన్నారి, మరో మహిళ మహిళ కనిపించడం లేదని అన్నాడు. చిన్నారి, మరో మహిళ మిస్సింగ్​ గురించి సమాచారం అందుకున్న పోలీసులు రైలు పట్టాలను పరిశీలించారు. ఆదివారం అర్ధరాత్రి ఎలత్తూరు రైల్వే స్టేషన్​ సమీపంలోని పట్టాలపై ఓ చిన్నారి, మహిళ సహా మధ్య వయస్కుడైన మరో వ్యక్తి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను కోజికోడ్​ మెడికల్​ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వీరంతా రైలుకు మంటలు అంటుకున్నాయనుకుని.. రైలులోంచి దూకేశారా? లేదా రైలులోంచి దిగే ప్రయత్నంలో కిందపడి చనిపోయారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్థానిక సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

man set on fire on train
ట్రైన్​లో కాలిపోయిన సీట్లు
man set on fire on train
ఘటనాస్థలంలో లభ్యమైన పెట్రోల్​ బాటిల్

ఫోరెన్సిక్​ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్​ సేకరిస్తోంది. కాగా, ట్రైన్​ నిందితుడికి సంబంధించిన ఓ బ్యాగ్​ లభ్యమైందని.. కానీ అందులో ఓ పెట్రోల్ బాటిల్​ తప్ప ఇంకేమీ లేదని రైల్వే పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొంతమందికి 50 శాతం.. కాలిన గాయాలయ్యాయని.. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.

చనిపోయిన మహిళ, చిన్నారిని మట్టన్నూరు పాలోట్​ పల్లికి చెందిన రహ్మత్(43)​, ఆ మహిళ సోదరి కుమార్తె(2)గా పోలీసులు గుర్తించారు. మూడో వ్యక్తిని ఇంకా గుర్తించలేదు. ఈ ఘటనలో గాయపడిన వారిని కతిరూర్​కు చెందిన అనిల్​ కుమార్​(50), అతడి భార్య సజిషా (47), కుమారుడు అద్వైద్ (21), త్రిసూర్​కు చెందిన అశ్వతి (29), మట్టనూర్ వాసి రసిక్ (27), తాలిపరం వాసులు రూబీ (52), జోతీంద్రనాథ్ (50), త్రిసూర్‌కు చెందిన ప్రిన్స్ (39), కన్నూర్ వాసి ప్రకాశం (52)గా పోలీసులు గుర్తించారు.

man set on fire on train
ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
man set on fire on train
క్లూస్​ సేకరిస్తున్న ఫోరెన్సిక్​ బృందం
man set on fire on train
క్లూస్​ సేకరిస్తున్న ఫోరెన్సిక్​ బృందం

క్రికెట్​ అంపైర్​ను చంపిన యువకుడు..
ఒడిశాలో దారుణం జరిగింది. క్రికెట్​ మ్యాచ్​లో భాగంగా.. తనకు నచ్చని నిర్ణయాన్ని ప్రకటించాడని కోపోద్రిక్తుడైన ఓ యువకుడు.. అంపైర్​ను హత్య చేశాడు. గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రక్తత వాతావరణం నెలకొనడం వల్ల.. పోలీసు బలగాలను మోహరించారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కటక్​ జిల్లా చౌద్వార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మహిసలంద గ్రామంలో క్రికెట్​ టోర్నమెంట్​ జరుగుతోంది. ఆ టోర్నీలో భాగంగా బెర్హంపుర్, శంకర్​పుర్​ గ్రామాల జట్ల మధ్య ఆదివారం మ్యాచ్​ జరిగింది. ఈ మ్యాచ్​లో అంపైర్​ లక్కీ రౌత్​ నిర్ణయంపై స్మృతి రంజన్​ రౌత్​ అనే యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ప్రధాన నిందితుడు స్మృతి రంజన్, మరో యువకుడు జగ్గా రౌత్​తో కలసి అంపైర్​ లక్కీపై వెనుక నుంచి దాడిచేశారు. బాధితుడి చేతులు గట్టిగా పట్టుకుని.. బ్యాట్​తో కొట్టి.. కత్తితో దారుణంగా పొడిచారు.

తీవ్రంగా గాయపడ్డ లక్కీని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు చెప్పారు. కాగా, దాడి చేసిన వారిలో ఓ యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా, దాడిచేసిన వారిలో ఓ యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.

నవజాత శిశువును నోటితో లాక్కెళ్లిన కుక్క..
కర్ణాటకలో హృదయవిదారక ఘటన జరిగింది. ఓ నవజాత శిశువు(ఆడపిల్ల)ను కుక్క నోటితో తీసుకెళ్లిపోయింది. మార్చి 31న ఈ ఘటన శివమొగ్గలోని మెగాన్​ ఆస్పత్రిలో వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన పసికందును పట్టుకుని ఆస్పత్రిలోని ప్రసూతి వార్డు సమీపంలోకి కుక్క పరుగెత్తింది. కొద్దిసేపటి తర్వాత అక్కడే వదిలి వెళ్లిపోయింది. చిన్నారి అక్కడ పడి ఉండడాన్ని గమనించిన ఆస్పత్రి సెక్యూరిటీ వెళ్లి పరీక్షించగా.. ఆ శిశువు అప్పటికే మృతిచెందింది. ఈ ఘటనపై దొడ్డపేట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది ఆస్పత్రి యాజమాన్యం.

అప్పుడే పుట్టిన పసికందును ఆస్పత్రిలోని ప్రసూతి వార్డు వెనుక భాగంలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, చిన్నారి కుక్క కాటుకు చనిపోయిందా లేక అంతకుముందే మృతి చెందిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Apr 3, 2023, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.