సీఎం దత్తత గ్రామంలో రసాభాసగా మారిన గ్రామసభ.. ఆందోళన చేపట్టిన గ్రామస్థులు

author img

By

Published : May 11, 2022, 3:32 PM IST

Updated : May 11, 2022, 6:55 PM IST

సీఎం దత్తత గ్రామంలో రసాభాసగా మారిన గ్రామసభ.. ఆందోళన చేపట్టిన గ్రామస్థులు

ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసాలమర్రి పునర్నిర్మాణం ‘పంచాయితీ’కి దారితీస్తోంది. ప్రజల ఏకాభిప్రాయం కూడగట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించటం లేదు. తమ విలువైన ఆస్తులకు నష్టం కలుగుతోందని కొందరు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారంపై స్పష్టత ఇవ్వకపోవటంపై ఆగ్రహిస్తున్నారు. సీఎం కేసీఆర్​ దత్తత గ్రామమైన ఇవాళ వాసాలమర్రిలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. ప్రజల అభిప్రాయాలు స్వీకరించకముందే ఏకపక్ష నిర్ణయాలకు ఎలా ఆమోదం తెలుపుతారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం దత్తత గ్రామంలో రసాభాసగా మారిన గ్రామసభ

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్​ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నిర్వహించిన గ్రామసభకు తరలివచ్చిన గ్రామస్థులు.. అధికారుల ముందు ఆందోళనకు దిగారు. ప్రజల అభిప్రాయాలు స్వీకరించకముందే ఏకపక్ష నిర్ణయాలకు ఎలా ఆమోదం తెలుపుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థుల ఆందోళనతో కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఎట్టకేలకు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడంతో శాంతించారు. అధికారులు గ్రామస్థుల అందరి అభిప్రాయాలు స్వీకరించి సమష్టి నిర్ణయాలతో ముందుకెళ్లాలని కోరారు. గ్రామసభ దృష్ట్యా గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

"ఊరిలో పది వాట్సాప్​ గ్రూపులు పెట్టి ఎవరికి సంబంధించిన విషయాన్ని ఆ గ్రూపులో పెట్టుకుంటరు. సర్పంచ్​కు ఓ గ్రూపు, ఎంపీటీసీకి ఓ గ్రూపు.. ఇలా ఎవరికి సంబంధించిన విషయాన్ని వారి గ్రూపులో షేర్​ చేసుకుంటరు. ఇది అబద్ధం కాదు వాస్తవం. సమాచారాన్ని వాళ్లే చెప్పుకుంటరు. కలెక్టర్​ వస్తుంది.. మంత్రి, ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పుకుంటరు. ఎవరికీ ఆ సమాచారాన్ని చెప్పరు. ఎవరితో కూడా చర్చించరు. గ్రామంలో అందరికీ తెలుసు ఈ విషయం కానీ ఎవ్వరు నోరుమెదపరు. ఊరిని ఏకతాటి మీదికి తీసుకురావాలంటే ఇది కాదు పద్ధతి. ఏం చేస్తున్నారో అందరికి చెప్పండి. గ్రామస్థులందరి అభిప్రాయాలను తీసుకోండి. ఒక సంవత్సరంలో ఇళ్లు కట్టిస్తం అంటే ఎవరు నమ్ముతారు." -వాసాలమర్రి గ్రామస్థుడు

పల్లె పునర్నిర్మాణానికి గ్రామసభ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏప్రిల్‌ 25న యాదాద్రికి వెళ్తుండగా మార్గమధ్యలో వాసాలమర్రి వద్ద సర్పంచి పోగుల ఆంజనేయులును తన కాన్వాయ్‌లో తీసుకెళ్లిన విషయం తెలిసిందే. గ్రామాభివృద్ధిపై ఆరా తీసిన సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే రోజు సాయంత్రం కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆ గ్రామాన్ని సందర్శించారు. మరుసటి రోజు వివిధ శాఖల అధికారులు గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ నెల 6న వాసాలమర్రిలో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్‌ పమేలా సత్పతి గ్రామ పునర్నిర్మాణం గురించి గ్రామస్థులకు తెలిపారు. ‘గ్రామాన్ని పునర్నిర్మిస్తాం. పక్కా ఇల్లు లేని వారందరికీ 200 గజాలలో గృహాలతో పాటు, రోడ్లు, మురుగు కాల్వలు నిర్మిస్తామ’ని చెప్పారు. ఆదర్శ గ్రామం(మోడల్‌ విలేజ్‌)గా తీర్చిదిద్దేందుకు గ్రామసభ ఏర్పాటుచేసి తీర్మానం చేసి ఇవ్వాలని సర్పంచి ఆంజనేయులును కోరారు.

ఇందుకు ఆదివారం ఏర్పాటుచేసిన గ్రామసభలో ప్రజలు అనేక సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. అందరి ఆమోదయోగ్యంతో గ్రామాన్ని పునర్నిర్మించాలని తేల్చిచెప్పారు. ప్రజల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామని ప్రజా ప్రతినిధులు బదులిచ్చారు. కలెక్టర్‌ హాజరవుతున్నందున గ్రామసభను మంగళవారానికి వాయిదా వేశారు. కానీ, అనివార్య కారణాల వల్ల గ్రామసభ మరోసారి వాయిదా పడింది. ఇవాళ మళ్లీ గ్రామసభ నిర్వహించగా.. ప్రజల అభిప్రాయాలు స్వీకరించకముందే ఏకపక్ష నిర్ణయాలకు ఎలా ఆమోదం తెలుపుతారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనేక సందేహాలు: గ్రామం పునర్నిర్మాణంపై ప్రజలలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాలకులు, అధికారులు ఎవరు ఈ సందేహాలను నివృత్తి చేయకపోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఆర్కిటిక్ విభాగం తయారుచేసిన బ్లూప్రింట్ ఆధారంగా గ్రామాన్ని తీర్చిదిద్దనున్నారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి 200 గజాల ఇల్లు నిర్మిస్తామని.. గ్రామీణ ప్రాంతం కావడంతో 300 నుంచి 500 వరకు 200 గజాల ఇల్లు నిర్మించి స్థలాన్ని పరిహారంగా ఇవ్వాలని కొందరు చెబుతున్నారు. తమ స్థలంలో ఎవరికో ఇవ్వడానికి ఒప్పుకోమని గ్రామస్థులు చెబుతున్నారు. తక్కువ స్థలం ఉన్నవారు బాగుపడితే ఎక్కువ స్థలం ఉన్నవాళ్లు నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలని.. స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాల్లో గృహాలను నిర్మించాలని కోరుతున్నారు. ఇండ్లు కూల్చివేస్తే వర్షాకాలం చలికాలంలో పిల్లలు, పెద్దలు, తీవ్ర ఇబ్బందులు పడుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామ పునర్నిర్మాణంపై గ్రామసభ కంటే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ తీర్మానంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కలెక్టర్‌ పమేలా సత్పతి మధ్యలోనే వెళ్లిపోయారు.

ఇవీ చదవండి:

Last Updated :May 11, 2022, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.