'ప్రతి కార్యకర్త ఉగ్ర నరసింహుడి అవతారమెత్తాలి.. కేసీఆర్​ను గద్దె దించాలి'

author img

By

Published : Aug 2, 2022, 4:46 PM IST

Updated : Aug 2, 2022, 7:22 PM IST

సర్వేలన్నీ భాజపాకు అనుకూలం.. యువత మద్దతివ్వాలి: బండి సంజయ్

BANDI SANJAY: తెలంగాణలో రాక్షస పాలనను అంతమొందించేందుకు ప్రతి కార్యకర్త ఉగ్ర నరసింహుడి అవతారమెత్తాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పిలుపునిచ్చారు. బుక్కెడు బువ్వ కోసం విద్యార్థులు రోడ్డెక్కితే పట్టించుకోలేని ముఖ్యమంత్రి.. దేశ రాజకీయాలంటూ బయలుదేరారని విమర్శించారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవంలో కేసీఆర్​ సర్కార్​పై నిప్పులు చెరిగిన ఆయన.. హామీలతో మభ్యపెట్టి, రాష్ట్రంలో అన్ని వర్గాలను నిండా ముంచారని ధ్వజమెత్తారు.

BANDI SANJAY: రాష్ట్రంలో రాబోయేది భాజపా సర్కారేననే సంకేతాలు పంపడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ప్రారంభమైంది. యాదాద్రి పుణ్యక్షేత్రం నుంచి భద్రకాళి ఆలయం వరకు.. 24 రోజుల పాటు సాగే యాత్రను కేంద్రమంత్రులు గజేంద్రసింగ్​ షెకావత్, కిషన్​రెడ్డిలు ప్రారంభించారు. అంతకుముందు బండి సంజయ్, పార్టీ నేతలతో కలిసి షెకావత్​ లక్ష్మీ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, యాదగిరిగుట్టపై జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న నేతలు.. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది భాజపానేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను కాపాడలేని కేసీఆర్.. దేశ రాజకీయాలంటూ బయలు దేరారని బండి సంజయ్​ విమర్శించారు.

'ప్రతి కార్యకర్త ఉగ్ర నరసింహుడి అవతారమెత్తాలి.. కేసీఆర్​ను గద్దె దించాలి'

ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్​ చిప్ప చేతికిచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల వేళ ఓట్ల కోసం ఇచ్చిన హామీలను విస్మరించి.. అన్ని వర్గాలను మోసగించారని విమర్శించారు. చేనేత బీమాను ఏడాది క్రితం ప్రకటించారని.. అప్పటి నుంచి చనిపోయిన వారి కుటుంబాలందరికీ బీమా వర్తింపజేసే దాకా వదలిపెట్టబోమని బండి హెచ్చరించారు.

సొమ్ము రికవరీ చేసే దాకా వదలం..: రాష్ట్రంలో జరిగే అత్యాచారాలు, ఆక్రమణలన్నింటి వెనక తెరాస నేతలే ఉంటారన్న బండి సంజయ్.. తాజాగా సంచలనంగా మారిన క్యాసినోలోనూ ఆ పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. నయీమ్​ డైరీపైనా సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్​ చేసిన ఆయన...కేసీఆర్ దోచుకున్న సొమ్మును రికవరీ చేసే వరకు వదలిపెట్టబోమని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన యువత.. కుటుంబ రహిత పాలన కోసం భాజపాకు మద్దతివ్వాలని బండి కోరారు. మోదీ స్ఫూర్తితో నడ్డా నేతృత్వంలో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రతి భాజపా కార్యకర్త ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి కేసీఆర్‌ను పారదోలాలి. రజాకార్లను తరిమికొట్టిన గడ్డ నల్గొండ.. నల్గొండ గడ్డకు ఆ శక్తి ఉంది. కేసీఆర్ కుటుంబానికి నిజాయతీ ఉంటే ట్రిపుల్‌ ఐటీ, గురుకుల పాఠశాలల్లో భోజనం చేయాలి. తెలంగాణలో ఏమీ చేయని కేసీఆర్.. దిల్లీ రాజకీయ సమీకరణాలు మారుస్తానంటున్నారు. చేనేత బీమాను ఏడాది క్రితమే ప్రకటించారు. ఎంతమందికి చేనేత బీమా ఇచ్చారో కేసీఆర్ స్పష్టం చేయాలి. సర్వేలన్నీ భాజపాకు అనుకూలంగా ఉన్నాయి. అధికారంలోకి రాగానే.. కేసీఆర్ దోచుకున్న సొమ్మును తప్పకుండా రికవరీ చేస్తాం. -బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

భారీ సభతో ముగింపు..: యాదాద్రి నుంచి వరంగల్ వరకు 328 కిలోమీటర్ల మేర సాగే మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. 5 జిల్లాల్లోని ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్​పూర్, జనగాం, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ఆగస్టు 26న హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగియనుంది.

ఇవీ చూడండి..

'తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టారు'

'మంకీపాక్స్​పై ఆందోళన వద్దు.. వ్యాక్సిన్​పైనా ముందడుగు'

Last Updated :Aug 2, 2022, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.