ETV Bharat / state

Ayurvedic Industry : నాన్నమ్మే స్ఫూర్తిగా రూ.400 కోట్ల ఆయుర్వేద వ్యాపారం

author img

By

Published : May 11, 2023, 5:11 PM IST

Ayurvedic Industry : ఆయుర్వేదానికి పుట్టినిల్లు భారతదేశం. ఇప్పుడంటే అలోపతి వైద్యం వచ్చింది, కానీ ఒకప్పుడు ఏ అనారోగ్యం వచ్చినా మూలికలు, ఔషధాలతోనే చికిత్స చేసేవారు. అలానే తన ఆరోగ్యం చక్కదిద్దుకున్న నాన్నమ్మ స్ఫూర్తితో ఆ యువకుడు కెరీర్‌ను వినూత్నంగా నిర్మించుకున్నాడు. సంప్రదాయ, ఆధునిక విజ్ఞానాల మేళవింపుగా ఆయుర్వేద పరిశ్రమ స్థాపించాడు. ఒక్కో మెట్టు ఎదిగి రూ.400 కోట్ల వార్షిక టర్నోవర్‌ను అందుకుంటున్నాడు . ఇంతకీ ఎవరా యువకుడు? తన సక్సెస్ మంత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం...

Ayurvedic Industry
Ayurvedic Industry

నాన్నమ్మే స్ఫూర్తి... రూ.400 కోట్ల ఆయుర్వేద వ్యాపారం

Ayurvedic Industry : స్థానికంగా లభించే వాటితో నాన్నమ్మ చేసుకునే మూలికల్ని ఆసక్తిగా గమనించేవాడు ఈ యువకుడు. అలా చిన్నతనంలో ఆ రంగంపై మక్కువ ఏర్పడుచుకున్నాడు. మెుదట ఉత్పత్తులను సేకరించి అవసరమైనవారికి సరఫరా చేశాడు. కొనుగోలు, అమ్మకంతో వచ్చిన లాభాలు పెట్టుబడిగా పెట్టి బొటానిక్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమ స్థాపించాడు. ప్రస్తుతం రూ.400 కోట్ల టర్నోవర్‌తో 400 మందికి ఉపాధి ఉపాధి కల్పిస్తున్నాడు ఈ యువ వ్యాపారవేత్త.

హెల్త్‌కేర్‌ పరిశ్రమ స్థాపించిన ఈ యువకుడి పేరు సౌరవ్‌ సోని. హిమాచల్‌ప్రదేశ్‌ హీరానగర్‌ అనే చిన్న గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. పాడిపంటలు చూస్తూ, చేల గట్లపై తిరుగుతూ పెరిగాడు. హైస్కూలు వరకు ఊళ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ప్లస్‌ టూ తర్వాత ఎంబీబీఎస్‌లో సీటు రాకపోవడంతో బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి బయోటెక్‌లో బీటెక్‌ పూర్తి చేశాడు.

నాన్మమ్మే స్ఫూర్తి: సౌరవ్‌ చిన్నతనంలో నాన్నమ్మతో ఎక్కువగా ఉండేవాడు. ఆమె తన ఆరోగ్యం కోసం బ్రాహ్మి, త్రిఫల, ఉసిరి, అల్లనేరేడు పండ్లు, స్థానికంగా లభించే ఆకులు అలములు వాడేవారు. ఇంట్లోనే రోలులో మూలికలు దంచడం, నూరడం ఆసక్తిగా గమనించేవాడు సౌరవ్‌ . ఏ అనారోగ్యం ఉన్నా ఆమె ఆయుర్వేద ఔషధాలతో నయం చేసుకునేదని, అలా చిన్నతనంలో ఆయుర్వేదంపై తనకు మక్కువ ఏర్పడిందని చెబుతున్నాడు.

చదువుకోసం విదేశాలకు వెళ్లి.. తిరిగి భారత్‌కు వచ్చాడు సౌరవ్‌. నాన్నమ్మను ప్రేరణగా తీసుకుని 2013లో ఆయుర్వేద ఔషధాల అమ్మకాలు ప్రారంభించాడు. అలా మెుదట చైనా నుంచి ఆయుర్వేద ఉత్పత్తులు దిగుమతి చేసుకుని అవసరమైనవారికి సరఫరా చేసేవాడు. కొనుగోలు, అమ్మకంతో వచ్చిన లాభాలు పెట్టుబడిగా పెట్టి.. అంచెలంచెలుగా వ్యాపారం విస్తరణ చేశాడు.
రైతుసంఘాలతో భాగస్వామ్యం: 2020లో కేరళకు చెందిన మధు కృష్ణమణితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా తాళ్ల సింగారంలో పరిశ్రమ ప్రారంభించాడు సౌరవ్‌. దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులు, రైతుసంఘాలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నాడు. రైతులకు అవగాహన కల్పించి, ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రియ, శాస్త్రీయ పద్దతులతో సాగు చేసేలా ప్రోత్సాహించాడు.

400 కోట్ల టర్నోవర్‌: ఆధునిక విజ్ఞానం వినియోగించి మూలికల్లోని సారాన్ని ఒడిసిపట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆయుర్వేద ఉత్పత్తులను సాగుచేయిస్తున్నాడు సౌరవ్‌. ఇక్కడ తయారైన ఉత్పత్తులను జపాన్, యూరప్, లాటిన్‌ అమెరికా తదితర 17 దేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. రూ.3 వందల నుంచి రూ.400 కోట్ల వార్షిక టర్నోవర్‌ను సంపాదిస్తున్నాడు. 400 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిసున్నామని చెబుతున్నాడు ఈ పరిశ్రమ డైరక్టర్‌ సౌరవ్‌ సోని.

రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం: తెలంగాణ మెడిసిన్‌ బోర్డుతో ఒప్పందం చేసుకుంది బొటానిక్‌ హెల్త్‌కేర్‌ సంస్థ. రైతులు నాణ్యతా ప్రమాణాలతో సాగు చేసిన ఉత్పత్తులను ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ సంస్థే కొనుగోలు చేస్తుంది. దీనివల్ల ఆ సంస్థకు, రైతులకు, సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా పరిశ్రమ పరిసర ప్రాంతాల రైతులకు, ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు సౌరవ్‌.

నాన్నమ్మ స్ఫూర్తితో ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానం, ఔషధాలు, మూలికలను ప్రపంచానికి సరఫరా చేసి.. అందరికీ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో పదేళ్లుగా కృషి చేస్తున్నాడు సౌరవ్‌. దీన్ని వ్యాపారంగా కాక భారతీయ ప్రాచీన ఆయుర్వేదాన్ని ప్రపంచానికి అందించే మంచి పనిగా చూశాడు. శాస్త్రవేత్తలు, నిపుణులతో హైదరాబాద్‌లోని నాచారంలో పరిశోధన, అభివృద్థి కేంద్రం ఏర్పాటు చేశాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.