ETV Bharat / state

Yadadri: రేపే స్వయంభువుల దర్శనం.. నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌.!

author img

By

Published : Mar 27, 2022, 10:11 AM IST

maha kumbha samprokshana in yadadri
యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణ

Yadadri Maha Kumbha Samprokshana: యాదాద్రి మూలమూర్తుల దర్శనభాగ్యానికి ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న భక్తజనం ఆకాంక్ష.. మరికొన్ని గంటల్లో నెరవేరబోతోంది. మహాకుంభ సంప్రోక్షణతో ఆలయ ఉద్ఘాటన ఘనంగా జరిపి.. స్వయంభువుల దర్శనాన్ని కల్పించనున్నారు. బంగారు వర్ణంతో వెలుగులీనుతున్న యాదాద్రిపై గర్భాలయంలోని స్వామి వారిని దర్శించుకునేందుకు రెండు కళ్లు చాలవేమో అని.. పునర్నిర్మాణం అనంతరం ఆలయ వైభవం చూసిన ప్రతి ఒక్కరికీ కలిగిన సందేహమే. రేపు ఉదయం పూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ అనంతరం.. యాదాద్రీశుని దర్శించుకుని ఇక ఆ అనుభూతిని పొందడమే తరువాయి.

Yadadri Maha Kumbha Samprokshana: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి మూలవరుల దర్శనాలకు శుభతరుణం ఆసన్నమవుతోంది. అద్భుత శిల్పకళతో యాదాద్రి కొత్త అందాలను సంతరించుకుంది. ఎటు చూసినా ఆధ్మాత్మికత ఉట్టి పడుతోంది. సోమవారం ఆలయ ఉద్ఘాటన ఘనంగా జరగనుంది. ఆరోజు ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ మహాపర్వం మొదలు కానుంది. ఆ తర్వాత ఆలయంలో దైవ దర్శనాలకు తెరతీయనున్నారు. ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి, 9:30 గంటలకు బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర, 11:55 గంటలకు మహా కుంభసంప్రోక్షణ, తదితర వైదిక కార్యక్రమాలుంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి స్వయంభువుల దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంగారు వర్ణ విద్యుత్తు దీపాల వెలుగులో శ్రీస్వామి సన్నిధి వెలుగులతో జిగేలుమంటోంది. దివ్య విమానంపై వివిధ రంగులతో కూడిన పతాకాలు ఆవిష్కరించారు.

.

సోమవారం ప్రధానాలయం దివ్య విమానంపై శ్రీ సుదర్శన స్వర్ణ చక్రానికి సీఎం కేసీఆర్‌ సమక్షంలో యాగ జలాలతో సంప్రోక్షణ పర్వానికి శ్రీకారం చుడతారు. ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపైనా స్వర్ణకలశాలకు మహాకుంభ సంప్రోక్షణను ఒకేసారి 92 మంది రుత్వికులు నిర్వహిస్తారు. సప్తాహ్నిక దీక్షతో వారం నుంచి బాలాలయంలో కొనసాగించిన పంచకుండాత్మక మహాయాగంలో పూజించిన నదీజలాలను మహాకుంభంలోకి చేర్చి ఆ పుణ్య జలాలతో పాటు శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో శోభాయాత్ర చేపడతారు. పునర్నిర్మితమైన ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పాల్గొంటారు. విమానం, గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాన్ని కొనసాగిస్తారు. అనంతరం ప్రధానాలయంలోకి వేద, మంత్ర పఠనాల మధ్య ప్రవేశించి ఉపాలయాలలో ప్రతిష్ఠామూర్తులకు మహా ప్రాణన్యాసం నిర్వహిస్తారు. ప్రథమారాధనలు చేపడతారు. మహాకుంభ సంప్రోక్షణ పర్వం అనంతరం గర్భాలయంలోని స్వయంభువుల దర్శనాలకు తెరతీస్తారు. కొండ మీద విష్ణు పుష్కరిణిని శనివారం నీటితో నింపారు.

.

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యవేక్షణ

బాలాలయంలో పంచకుండాత్మక మహాయాగ పర్వాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చతుస్థానార్చన, విష్ణుపారాయణం, యాగాది పూజలను శనివారం నిర్వహించారు. కాండూరి వెంకటాచార్య పర్యవేక్షణలో మహాయాగం కొనసాగింది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఈవో గీత, ధర్మకర్త నరసింహమూర్తి పాల్గొన్నారు. ఆలయ ఉద్ఘాటనకు సీఎం కేసీఆర్‌, మంత్రులు రానున్న సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యవేక్షించారు. భారీ బందోబస్తు ఏర్పాట్లపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ సమీక్ష నిర్వహించారు.

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సమేతంగా ఆదివారం రాత్రి యాదగిరిగుట్టకు చేరుకోనున్నారని సమాచారం. ఆయన విడిదికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత బాలాలయంలో జరిగే పూర్ణాహుతితోపాటు ప్రతిష్ఠామూర్తుల శోభాయాత్రలోనూ భాగస్వాములు కానున్నారు. గర్భాలయంలోని మూలవర్యులకు తొలిపూజ చేపట్టి దర్శించుకుంటారు. ఆ తర్వాత క్షేత్రాభివృద్ధికి కృషిచేసిన వారందరినీ సీఎం ఆలయ మాడవీధిలో సన్మానిస్తారు.

.

కంచి తరహాలో బంగారు బల్లి

ప్రధానాలయంలో కంచి తరహాలో బంగారు బల్లిని ఏర్పాటుచేయనున్నారు. దీంతోపాటు 12 రాశుల బంగారు రూపాలను అమర్చనున్నారు. రాతి గోడలకు అమర్చే శంఖు, చక్రం, కలశం, రాజసింహ, హంస పుత్తడి తొడుగుల బిగింపు మొదలుపెట్టారు. ప్రధానాలయంలో దర్శనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులను కొండ కింది నుంచి కొండపైకి చేర్చడానికి 32 మినీ బస్సులకు యాదాద్రి దర్శినిగా రూపురేఖలు మార్చారు. ప్రధానాలయం పునర్నిర్మాణం దృష్ట్యా 2016 ఏప్రిల్‌ 21 నుంచి బాలాలయంలోనే భక్తులకు దర్శనాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. నేటితో ఇక్కడి దర్శనాలకు తెర పడనుంది.

ఇవీ చదవండి: Yadadri Night Visuals : విద్యుత్ కాంతుల్లో వెలుగులీనుతున్న యాదాద్రి

Yadadri temple: నవ వైకుంఠం యాదాద్రి వైభవం.. అడుగడుగునా అద్భుతం.!

Yadadri Temple Reopening : యాదాద్రీశుడి ఘనచరిత్ర.. కనులముందు కొలువయ్యే తరుణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.