'ఈ పండక్కి పిండి వంటలు చేసే తీరికలేదా? అయితే మాకు చెప్పండి'

author img

By

Published : Jan 15, 2022, 11:31 AM IST

Sankranthi Pindi Vantalu

Sankranthi Pindi Vantalu: పండుగ రోజు కుటుంబసభ్యులతో కలిసి... పిండివంటలు తింటూ కబుర్లు చెప్పుకోవడం గొప్ప అనుభూతి. అందులోనూ సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు... సకినాలు, అరిసెలు తింటుంటే వచ్చే మాజాయే వేరు. పిండివంటలు చేయాలంటే ఓపికతోపాటు అధిక సమయం కేటాయించాలి. ప్రస్తుతం ఉద్యోగాలతోనే రోజంతా గడిస్తే... ఇంకా పిండివంటలు చేసే తీరిక ఎక్కడుంటుంది? అలాంటివారికి మేమున్నామంటూ రుచికరమైన పిండివంటలు చేసి ఇస్తున్నారు ఓరుగల్లు మహిళలు. నలుగురు అతివలు ఏకమై.. 70 మందికి ఉపాధి కల్పిస్తూ పిండివంటలశాల నిర్వహిస్తున్నారు.

పిండివంటలు తయారుచేస్తూ అమ్ముతున్న మహిళలు

Sankranthi Pindi Vantalu: కష్టమనుకుంటే ఏదీ చేయలేం... కానీ అదే ఇష్టంగా భావించి కృషి చేస్తే విజయం దానంతట అదే వస్తుందనడానికి నిదర్శనం ఈ నలుగురు నారీమణులు. వరంగల్‌కు చెందిన ఉమాదేవి, రమాదేవి, ఉషారాణి, అర్చనలు.... పెళ్లి చేసుకుని వంటింటికే పరిమితం కాకుండా... పాకశాస్త్రాన్నే ఉపాధి మార్గంగా మలుచుకున్నారు. తెలుగు సంప్రదాయ పిండి వంటకాలు నేటి తరం మరచిపోకూడదనే ఉద్దేశంతో... శ్రీనిధి తెలంగాణ పిండివంటలశాలను ఏర్పాటు చేశారు. 2016లో నలుగురుతో ప్రారంభించిన ఈ శాలలో ఇప్పుడు 70 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వీరు సకినాలు, పల్లిగారెలు, పప్పుగారెలు, పల్లిఉండలు, సర్వపిండి, మడుగులు, అరిసెలు అన్ని రకాల పిండివంటలు తయారుచేస్తూ... విదేశాలతోపాటు వివిధ రాష్ట్రాలకు పంపిస్తున్నారు.

సకినాలకు డిమాండ్‌ ఎక్కువ

పిండివంటలపై ఆసక్తి ఉన్నా.. చాలామంది బిజీ లైఫ్‌లో పడిపోయి ఓపిక లేకపోవడంతో చేసుకోవడం లేదు. అందుకే వారి కోసం మేం ఆర్డర్ల మీద చేస్తాం. పండగ సమయంలో మా వ్యాపారం చాలా బిజీగా ఉంటుంది. ఈ సమయంలో సకినాల గిరాకీ ఎక్కువ ఉంటుంది. సమయం అంతగా లేకపోవడంతో కేజీ చొప్పున అందిస్తున్నాం. ---రమాదేవి, పిండివంటలశాల నిర్వాహకురాలు

మన సంప్రదాయ వంటకాలను ముందు తరాలకు అందించడం కోసమే కృషి చేస్తున్నాం. బిజీ జీవితంలో పిండివంటలు చేసుకోలేని వారి కోసం ఆర్డర్ల మీద సమయానికి అందిస్తున్నాం. మగవారిపై ఆధారపడకుండా మహిళలు ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి. గౌరవంగా ఉండే ఏ పని చేసుకున్నా తప్పు లేదు. ---ఉమాదేవి, పిండివంటల శాల నిర్వాహకురాలు

నాణ్యతకు అధిక ప్రాధాన్యం

నాణ్యత, శుభ్రతకు పెద్దపీట వేయడంతో... ప్రారంభించిన కొద్ది కాలంలోనే మూడు చోట్ల పిండివంటల దుకాణాలను ప్రారంభించారు. నిర్వాహకులు, పనిచేసేవాళ్లూ అంతా మహిళలే కావటంతో ఎలాంటి ఇబ్బందులు ఉండడంలేదు. పిండివంటలకు అవసరమైన వస్తువులు మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం, పనివాళ్లతో చేయించడం, ప్యాకింగ్ వంటి పనులను విభజించుకుంటున్నారు. మగవారి సంపాదనపై మహిళలు ఆధారపడకూడదని... ఆర్ధికంగా బలపడినప్పుడే వారికి గౌరవం ఉంటుందని అంటున్నారు.

అన్నీ తాజా పదార్థాలతోనే పిండి వంటలు చేస్తాం. నాణ్యత పాటిస్తాం. వాడిన నూనె వాడకుండా ఫ్రెష్‌ ఆయిల్‌ వాడతాం. మా వ్యాపారం కోసం మేం పెద్దగా ప్రచారం చేయలేదు. తరచూ వస్తున్న వినియోగదారుల ద్వారానే మా వ్యాపారం వృద్ధి చెందింది. ---అర్చన, పిండివంటల శాల నిర్వాహకురాలు

మా పిండివంటల శాలలో పనిచేసే వాళ్లు కూడా శుచీ, శుభ్రత పాటిస్తారు. వాళ్లు నమ్మకంగా పనిచేయడం వల్లే నాణ్యత కలిగిన పిండివంటలను అందించగలుగుతున్నాం. ----ఉషాదేవి, పిండివంటల శాల నిర్వాహకురాలు

వారాంతం, పండుగ రోజుల్లోనూ రద్దీ బాగా ఉండడంతో... పిండివంటలన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. నోరూరించే రుచి, నాణ్యత పాటించడం, సకాలంలో అందించడం వల్ల తరచూ ఇక్కడే కొంటున్నట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు. కొనుగోలుదార్ల నుంచి మంచి స్పందన వస్తుండటంతో... త్వరలో హైదరాబాద్‌, ఇతర ముఖ్యపట్టణాల్లో పిండివంటలశాలను ఏర్పాటు చేయాలని నిర్వాహకులు యోచిస్తున్నారు.

ఇదీ చదవండి: Kodi pandalu: జోరుగా కోడి పందేలు.. చేతులు మారిన కోట్ల రూపాయలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.