ETV Bharat / state

శ్మశానంలోనే ఆవాసం.. గమ్యం చేరే చోటే జీవనం

author img

By

Published : Mar 14, 2020, 10:47 PM IST

సాధారణ ప్రజలు రాత్రి సమయంలో శ్మశానం వైపు వెళ్లాలంటే భయపడతారు.. అలాంటిది ఓ కుటుంబం అక్కడే కొన్ని రోజుల నుంచి జీవనం గడుపుతోంది. వారి పిల్లలు పుస్తకాలు చేతబట్టి బడి బాట పట్టాల్సిన సమయంలో శ్మశానంలో సేద తీరుతున్నారు. తోటి వారితో ఆడుకోవాల్సిన వారు ఒంటరిగా సమాధుల నడుమ ఆడుకుంటున్నారు. శ్మశాన వాటికనే బొమ్మరిల్లుగా భావించి జీవనం సాగిస్తున్నారు. ఈ హృదయ విదారక గాధ గురించి తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చూడాల్సిందే.

Residence and living in cemetery at laxmipur warangal
శ్మశానంలోనే ఆవాసం.. గమ్యం చేరే చోటే జీవనం

శ్మశానంలోనే ఆవాసం.. గమ్యం చేరే చోటే జీవనం

ఈ వీడియోలో చిన్నారులతో కలిసి ఉన్న అతని పేరు భాస్కర్. వరంగల్ అర్బన్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన భాస్కర్ కొంతకాలంగా శ్మశాన వాటికలో తన ముగ్గురు చిన్నారులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కూరగాయల మార్కెట్ వద్ద వారసత్వంగా వచ్చిన ఇల్లుండేది. కానీ అది శిథిలావస్థకు చేరి ఒక్కసారిగా కూలిపోయింది. అంతే అప్పటి నుంచి భాస్కర్ దళిత శ్మాశాన వాటికలోనే నివసిస్తున్నాడు.

ఆర్థిక ఇబ్బందులే కారణం

ఇటీవలే భార్య అనారోగ్యంతో కాలం చేసిందని.. ఎక్కడికి పోవాలో దిక్కుతోచక తన చిన్నారులతో కలిసి శ్మశానంలో సేదతీరుతున్నానని చెప్పాడు. కూలీ చేసి పిల్లలను పోషిస్తున్నానని తెలిపాడు. పెద్ద కుమార్తె జయశ్రీని 8వ తరగతి వరకు చదివించగా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాఠశాల మానేసిందన్నాడు. కుమారుడు జయరాజ్ స్థానిక పాఠశాలలో చదువుతుండగా.. చిన్న కూతురు గౌతమి లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తోందన్నాడు.

అక్కడే జీవనం

పాఠశాల ముగిసిన అనంతరం చిన్నారులు నేరుగా శ్మశాన వాటికకు చేరుకుని సమాధుల మధ్య ఆడుకుంటారు. అందరు చిన్నారుల్లా ఆడుకోవాలని తమకూ ఉంటుందని.. కానీ స్థానికులు రావద్దని హెచ్చరించడం వల్ల శ్మశాన వాటికకే పరిమితం అవుతున్నామన్నారు. సమాధులతో సావాసం చేస్తూ.. అక్కడే వంట చేసుకుని జీవనాన్ని సాగిస్తున్నారు.

శ్మశానానికి వచ్చి పోయే వారు దయ తలిచి డబ్బులు ఇస్తే సంపూర్ణంగా భోజనం చేస్తామని చెబుతున్నారు. తమ సమస్య వినే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, హఠాత్తుగా కాలం చేస్తే తన పిల్లలు వీధిన పడతారని ఆవేదనను వెలిబుచ్చాడు భాస్కర్. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని, పిల్లలకి మంచి విద్యను అందించాలని కోరుతున్నాడు.

ఇదీ చూడండి : రేవంత్​ జైలుకెళ్లింది అందుకోసం కాదు: రాజగోపాల్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.