KU: విద్యార్థులకు మరో షాక్​.. కేయూ సైతం ఫీజులు పెంచేసింది.!

author img

By

Published : Sep 15, 2021, 8:56 AM IST

kakatiya-university-decides-to-doubles-the-fee-for-students

ఇంజనీరింగ్​, ఫార్మసీ విద్యార్థులకు ఫీజులను రెట్టింపు చేస్తూ కేయూ(KU) సైతం నిర్ణయం తీసుకుంది. కేయూ పరిధిలోని వరంగల్​, కొత్తగూడెంలోని​ కళాశాలల్లో చేరే విద్యార్థులపై ఈ భారం పడనుంది. ఈ విషయాన్ని గమనించి ఎమ్​సెట్(EAMCET)​ కౌన్సిలింగ్​ సమయంలో విద్యార్థులు వెబ్​ ఆప్షన్లు ఇచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బీటెక్‌, బీఫార్మసీ చదవబోయే విద్యార్థులకు రుసుములను రెట్టింపు చేసి కాకతీయ విశ్వవిద్యాలయం(KAKATIYA UNIVERSITY) కూడా షాక్‌ ఇచ్చింది. జేఎన్‌టీయూహెచ్‌(JNTUH), ఉస్మానియా విశ్వవిద్యాలయాల(OU) తరహాలోనే కేయూ సైతం రెగ్యులర్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల ఫీజులను రెండింతలు పెంచింది. నెలన్నర క్రితం ఆయా కోర్సుల రుసుములను పాలకమండలి ఆమోదం తీసుకొని పెంచుకోవచ్చని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈక్రమంలో ఇటీవల ఓయూ, జేఎన్‌టీయూహెచ్‌ తమ పరిధి ప్రభుత్వ కళాశాలల్లో బీటెక్‌ రుసుములను రెండింతలు పెంచటం తెలిసిందే. అప్పటికి వరంగల్‌లోని కాకతీయ, నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోలేదు. తాజాగా కాకతీయ వర్సిటీ కూడా బీటెక్‌ రెగ్యులర్‌ ఫీజును రూ.18వేల నుంచి రూ.35వేలకు, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు రూ.35వేల నుంచి రూ.70 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త రుసుములను ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దీనివల్ల కేయూ పరిధిలోని వరంగల్‌, కొత్తగూడెంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరే విద్యార్థులపై భారం పడనుంది. ఆయా కళాశాలల్లోని రెగ్యులర్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల రుసుములు వేర్వేరుగా ఉన్నందున వాటిని గమనించి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సుల్తానాపూర్‌ బీఫార్మసీ ఫీజు రూ.65వేలు

ఈ విద్యా సంవత్సరం జేఎన్‌టీయూహెచ్‌ తన పరిధిలోని సుల్తానాపూర్‌(సంగారెడ్డి జిల్లా) కళాశాలలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కేటగిరీ కింద బీఫార్మసీ కోర్సు ప్రారంభించింది. దాని ఫీజు రూ.65 వేలుగా నిర్ణయించారు. అంటే బీటెక్‌ కంటే రూ.5వేలు తక్కువ. కాకతీయ వర్సిటీలో మాత్రం బీఫార్మసీ రెగ్యులర్‌ కోర్సుకు ఫీజు రూ.45 వేలు ఉంది. బీటెక్‌ రెగ్యులర్‌ కోర్సు రుసుం కంటే అది రూ.10 వేలు ఎక్కువ కావటం గమనార్హం.

కొత్తగా రెండు కళాశాలలకు అనుమతి

బాచుపల్లిలోని గోకరాజు రంగరాజు ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో గోకరాజు లైలావతి మహిళా కళాశాల ప్రారంభం కానుంది. ప్రభుత్వం ఆ కళాశాలకు అనుమతి ఇచ్చింది. అందులో బీటెక్‌ సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచీలను ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చారు. కొత్త కళాశాల కావడంతో కనీస ఫీజు రూ.35వేలుగా నిర్ణయించారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ సమీపంలో కేశవ్‌ మెమోరియల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల పేరిట మరో కాలేజీకీ ఈసారి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో సీఎస్‌ఈ, సీఎస్‌ఈ(ఏఐ అండ్‌ ఎంఎల్‌) కోర్సులున్నాయి. వాటికీ రూ.35 వేలే రుసుముగా నిర్ణయించారు. మరోవైపు మహబూబాబాద్‌ సమీపంలోని సాంఘిక సంక్షేమ శాఖ డిగ్రీ కళాశాలలో బీఫార్మసీ కోర్సుకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందులో 75శాతం సీట్లను ఎస్‌సీలకు కేటాయిస్తారు. బోధనా రుసుముకు అర్హత ఉన్నవారికి ఆ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. ఈ కోర్సు ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌లో అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: JEE Main 2021 Results: తెలుగు విద్యార్థుల హవా.. ఆరుగురికి మొదటి ర్యాంక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.