ETV Bharat / state

weather report: రానున్న మూడు రోజులు వర్షాలే..!

author img

By

Published : Aug 31, 2021, 2:04 PM IST

weather report
weather report

రానున్న మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురస్తాయని వాతావారణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో జనానికి అవస్థలు తప్పడం లేదు. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో... గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మధ్యప్రదేశ్​ పరిసర ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడిందని... అయితే దానికి అనుబంధంగా సమద్రమట్టానికి 4.5 కి.మి. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ప్రకటించింది.

ఓరుగల్లులో జోరు వానలు

వరంగల్‌ వాసులకు వర్షాలు మరోసారి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హంటర్ రోడ్‌లోని బృందావన కాలనీ, ఎన్టీఆర్​నగర్, సంతోషిమాత నగర్ కాలనీల్లో వరదనీరు నిలిచింది. కట్టమల్లన్న చెరువు నుంచి వరదనీరు పెద్ద ఎత్తున రావడంతో శివనగర్, ఎనుమాముల లక్ష్మీ గణపతి కాలనీ, సాయి నగర్, మధుర నగర్ కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఖమ్మం బైపాస్ రోడ్డులోని రాజీవ్‌కాలనీ పూర్తిగా నీట మునగడం వల్ల వరంగల్ మహానగర పాలక సంస్థ సిబ్బంది... బాధితులను హంటర్​రోడ్‌లోని సంతోషిమాత గార్డెన్‌కు తరలించారు. బాధితులకు అక్షయపాత్ర ద్వారా భోజనం అందిస్తున్నారు. గతేడాది ఇదే తరహాలో వర్షాలు కురిసి ఓరుగల్లు నగరం అతలాకుతలమైనా అధికారులు చర్యలు చేపట్టలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం రాగానే ఖాళీ చేయించి భోజనం అందించడమే తప్ప... శాశ్వత పరిష్కారం ఆలోచించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిద్దిపేటలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని మోయతుమ్మెదవాగు పరవళ్లు తొక్కుతోంది. పలు గ్రామాల్లోని వాగులు, చెరువులు పొంగి పొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. హనుమకొండ- సిద్దిపేట ప్రధాన రహదారిపై బస్వాపూర్ వద్ద కల్వర్టు పైనుంచి మోయతుమ్మెద వాగు పొంగిపొర్లుతున్నందు వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కోహెడ నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారిలో ఇందుర్తి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిపేశారు. వింజపల్లి, వరికోలు ప్రాంతంలోని రెండు కుంటలు ప్రవహించడం వల్ల వరికోలు, రాంచంద్రపూర్, ఎర్రగుంటపల్లి, సామార్లపల్లి నుంచి కోహెడకు... వింజపల్లి నుంచి పైగ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి అవసరమైన చోట కల్వర్టులు, వంతెనలు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

సూర్యాపేటలో జలదిగ్బంధంలో గ్రామాలు

సూర్యాపేట జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మోతె మండలంలో చెరువులు మత్తడి పోస్తున్నాయి. నామవారం పెద్ద చెరువు మత్తిడి పోయడంతో నామవారం-గుంజలూరు ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మావిళ్లగూడెంలో వర్షం నీటితో వైకుంఠధామం జల దిగ్బంధం అయింది. విభలపురం వద్ద గండ్ల చెరువు మత్తడి పోయడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంబించాయి. రాఘవపురం వద్ద ఎస్సారెస్పీ కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నెరేడువాయి, ఉర్లుగొండ, తుమ్మగూడెం, నామవరం, నర్సింహపురం గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

నిర్మల్​లో ఎడతెరిపి లేకుండా..

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కుబీర్ మండల కేంద్రంలోని మేదరివాడ కాలనీలో ఇళ్లలోకి వరదనీరు చేరింది. నిత్యావసర సరుకులు తడిసి ముద్ధయ్యాయి. బాధితులను గ్రామ పంచాయతీకి తరలించారు. వారికి రాత్రి అక్కడే బస ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకున్నారు.

ఇదీ చూడండి: RAINS: ఎడతెరిపి లేని వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.