ETV Bharat / state

ఎంజీఎం ఘటన.. నిందితుడికి మద్దతుగా విద్యార్థుల ధర్నా

author img

By

Published : Feb 24, 2023, 5:14 PM IST

MGM
MGM

Medical Students Protest at MGM: పీజీ వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనలో ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దంటూ వరంగల్‌ ఎంజీఎంలో వైద్య విద్యార్థులు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. పోలీసుల విచారణ బాధితురాలికి మద్దతుగా జరుగుతుందని.. విచారణను నిష్పక్షపాతంగా జరపాలని డిమాండ్ చేశారు. సైఫ్​పై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు.

Medical Students Protest at MGM: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడిగా భావిస్తున్న సీనియర్ పీజీ వైద్య విద్యార్థి డాక్టర్​ సైఫ్​పై ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దంటూ ఎంజీఎంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. పోలీసుల విచారణ బాధితురాలికి మద్దతుగా జరుగుతుందని.. విచారణను నిష్పక్షపాతంగా జరపాలని డిమాండ్ చేశారు.

సైఫ్​పై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. శుక్రవారం ఎంజీఎం ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా ఓపీ, మిగిలిన సేవలను వైద్య విద్యార్థులు బహిష్కరించారు. సైఫ్​కు మద్దతుగా విద్యార్థులు ధర్నాకు దిగడం అనేక విమర్శలకు దారి తీస్తోంది. ఈ మేరకు సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్​కు మద్దతుగా నిలిచిన విద్యార్థులు ఎంజీఎం సూపరింటెండెంట్​కు సమ్మె నోటీసులు ఇచ్చారు.

అనంతరం ఆసుపత్రిలో విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. సీనియర్ విద్యార్థి సైఫ్​పై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును రద్దు చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టుల ఆధారంగా కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ వృత్తిలో జూనియర్లను సీనియర్లు వర్క్ విషయంలో మందలించడం సహజమేనని పేర్కొన్న విద్యార్థులు.. ఇది కొత్తేమీ కాదన్నారు. సైఫ్​పై కేసులను ఎత్తివేయాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. పీజీ వైద్య విద్యార్థుల సమ్మెతో రోగులు ఇబ్బందులు పడ్డారు.

విద్యార్థులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆసుపత్రిలో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూపరింటెండెంట్‌ డా.చంద్రశేఖర్‌ హెచ్‌ఓడీలతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వైద్య సేవలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమ్మె సమాచారం తెలుసుకున్న వరంగల్‌ సీపీ రంగనాథ్‌ ఎంజీఎం అధికారులు, పీజీ వైద్య విద్యార్థులతో వేర్వేరుగా మాట్లాడారు. సీనియర్లు, జూనియర్ల మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొల్పేందుకు ఇలాంటి కమ్యూనికేషన్ జరగడం మామూలేనని ఈ సందర్భంగా డా.చంద్రశేఖర్‌ అన్నారు.

ఈ ఘటనపై విచారణ వేగవంతం చేశారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థినిని.. సైఫ్ లక్ష్యంగా చేసుకుని, వేధింపులకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలియచేశారు. వాట్సప్ చాట్స్​లో సైఫ్ పెట్టిన సందేశాలు చూసి మనస్తాపానికి గురై... విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా భావిస్తున్నామని తెలిపారు. వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కేసులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో నిందితుడు సైఫ్​ను వరంగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.