ETV Bharat / state

పంట పొలాల్లో నీళ్లు.. అన్నదాతల కళ్లలో కన్నీళ్లు...

author img

By

Published : Aug 29, 2020, 12:00 PM IST

huge crop loss in narsampet constituency  due to rain
నర్సంపేట నియోజకవర్గంలో నీట మునిగిన పంట పొలాలు

నేలమ్మ ఒడిలో చెమట చుక్కలు చిందించి బంగారాన్ని పండించాలనుకున్న రైతన్న ఆశలు నీరుగారిపోయాయి. మొక్క పెరుగుతుంటే సంబురపడ్డాడు. చంటి పాపల పంటను కాపాడుకుందామనుకున్నాడు. కానీ అంతలోనే భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. పంటల రూపురేఖలే మారిపోయాయి. పొలాల్లో నిలిచిన నీరు, ఏర్పడిన ఇసుక మేటలను చూసి అన్నదాతలు లబోదిబోమన్నారు. పది మందికి అన్నం పెట్టే రైతన్న కళ్లల్లో కన్నీరు ఇంకిపోయింది. నర్సంపేట డివిజన్‌లో ఆరు మండలాల్లో ఊహకందని రీతిలో పంటలు దెబ్బతిన్నాయి.

నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 80,555 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పత్తి రైతులు అధికంగా నష్టపోయారు. వరి, కందులు, పెసర తదితర పంటలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి. చాలా చోట్ల వరినాట్లు కొట్టుకుపోవడంతో మళ్లీ నాట్లు వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో 48,187 మంది రైతులు తమ పంటను కోల్పోయారు. 331 ఎకరాల కందుల పంట వర్ష ప్రభావంతో దెబ్బతింది. పెసరు 485.29 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. సోయాబిన్‌ 61 ఎకరాలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొన్నారు.

పరిహారాన్ని అందజేస్తాం...

నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దెబ్బతిన్న పంటలను వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో పర్యటించి రైతుల పంట వివరాలు సేకరించాం. త్వరలోనే రైతులకు పరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది. -శ్రీనివాసరావు, ఏడీఏ, నర్సంపేట

ప్రభుత్వం ఆదుకోవాలి..

వట్టెవాగు ఒడ్డుకు రెండెకరాల భూమి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు పొలం మొత్తం కొట్టుకుపోయింది. నాతో పాటు చుట్టుపక్కల వరద తాకిడికి 40 ఎకరాల పంట నష్టం జరిగింది. అందరం దాదాపుగా మళ్లీ నాట్లు వేసుకోవాలి. పంట చేతికి వస్తుందనుకునేలోపు వరద పాలైంది. ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకోవాలి.

మాలోతు జగ్గు, టీకే తండా

దిక్కుతోచని స్థితిలో ఉన్నాం...

చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన బోడా అరుణ.. తనకున్న ఎకరం 20 గుంటల భూమిలో అప్పు చేసి నాట్లు వేయగా పొలం ఇసుక మేటల పాలైంది. పొలాన్ని చూస్తూ దీనంగా కూర్చుంది. మళ్లీ నాటు వేయడానికి నారు, చేతిలో చిల్లిగవ్వ లేదని వాపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.