RAITHANNA: 'కొత్త సాగు చట్టాలు రైతుల మీద ఉరుములు లేని పిడుగులు'

author img

By

Published : Aug 19, 2021, 10:55 PM IST

RAITHANNA: 'కొత్త సాగు చట్టాలు రైతుల మీద ఉరుములు లేని పిడుగులు'

పీపుల్స్​ స్టార్​ ఆర్​.నారాయణమూర్తి మంత్రి జగదీశ్​రెడ్డిని కలిశారు. రైతన్న సినిమాను చూసి, మద్దతు తెలిపినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సాగు చట్టాలు దేశ వ్యవసాయరంగంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో చక్కగా చూపించినందుకు నారాయణమూర్తిని మంత్రి అభినందించారు.

నేటి పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, కొత్త సాగు చట్టాల వల్ల కలిగే దుష్ప్రరిణామాలు ఇతివృత్తంగా తీసిందే రైతన్న సినిమా అని పీపుల్స్​ స్టార్​ ఆర్​.నారాయణమూర్తి పేర్కొన్నారు. రైతులోకాన్ని మేల్కొలిపే రైతన్న సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. రైతుల మేలు కోరే కథాంశంతో సినిమా తీశానని.. తన సినిమాను చూసి ఆదరించాలని మంత్రి జగదీశ్​రెడ్డికి చేసిన విజ్ఞప్తి మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని థియేటర్​లో మంత్రి నిన్న సినిమాను చూశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి చేసిన ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు.

మంత్రి జగదీశ్​రెడ్డితో నారాయణమూర్తి
మంత్రి జగదీశ్​రెడ్డితో నారాయణమూర్తి

మీడియా ద్వారా మంత్రి స్పందన చూసిన ఆర్.నారాయణమూర్తి స్వయంగా సూర్యాపేటకు వచ్చారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్​రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంచి కథాంశంతో.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. ప్రజలను చైతన్యపరచి, జాగృత పరిచేలా నారాయణమూర్తి చేసిన ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సాగు చట్టాలు రైతుల మీద ఉరుములు లేని పిడుగుల లాంటివని మంత్రి జగదీశ్​రెడ్డి వ్యాఖ్యానించారు. రైతాంగాన్ని కూలీలుగా మార్చే కుట్రలో భాగమే ఆ చట్టాల రహస్యమని అభిప్రాయపడ్డారు.

నారాయణమూర్తి విజ్ఞప్తి మేరకు నేను రైతన్న సినిమా చూశాను. ప్రతిక్షణం పేదల గురించి, రైతుల కష్టాల గురించి ఆలోచించే నారాయణమూర్తి.. వారిని చైతన్యం చేసేందుకు సినిమా రంగాన్ని ఎంచుకున్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలు భారతదేశ వ్యవసాయరంగంపై ఏవిధంగా ప్రభావం చూపిస్తాయని చాలా చక్కగా చూపించారు.-జగదీశ్​రెడ్డి, విద్యుత్​శాఖ మంత్రి

దేశంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని.. తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించుకునే హక్కు రైతుకి లేదని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే దేశం-ఒకే మార్కెట్ చట్టం అమలు వల్ల కార్పొరేట్ కంపెనీలకు లాభం జరిగి, రైతులు కూలీలుగా మారతారని అన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశానికి అన్నం పెడుతున్న రైతన్న రుణం తీర్చుకోవాలంటే కచ్చితంగా కొత్త రైతు, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా సాగు, విద్యుత్​ చట్టాలను తెచ్చింది. ఈ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెబుతోంది. ఈ నల్ల చట్టాలు మాకొద్దు.. వీటిని రద్దు చేయండంటూ 8 నెలలుగా దిల్లీలో రైతన్నలు మహోన్నత పోరాటం చేస్తున్నారు. కరోనా విపత్తులోనూ ఆరుగాలం కష్టపడి మనకు అన్నం పెడుతున్న అన్నదాతల రుణం తీర్చుకోవాలంటే కొత్త సాగు, విద్యుత్​ చట్టాలను వెంటనే రద్దు చేయాలి. -నారాయణమూర్తి, చిత్ర దర్శక, నిర్మాత.

ఇదీ చూడండి: R.Narayana Murthy : 'రైతన్న'.. కర్షకుడి కష్టాన్ని చూపే సినిమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.