congress:తెలంగాణ ద్రోహులంతా మీ పార్టీలోనే ఉన్నారు: షబ్బీర్​ అలీ

author img

By

Published : Sep 16, 2021, 8:44 PM IST

congress  meeting at gajwel in siddipet district

తెలంగాణ ద్రోహులంతా మీ పార్టీలోనే ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో రేపు జరగనున్న దళిత, గిరిజన దండోరా సభ ఏర్పాట్లను ఇతర నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సభకు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.

తెలంగాణ కోసం త్యాగాలు చేసింది మేమేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. రాష్ట్రం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్సేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ ద్రోహులంతా ఆ పార్టీలోనే ఉన్నారని తెరాసను ఉద్దేశించి మాట్లాడారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో రేపు జరగనున్న దళిత, గిరిజన దండోరా సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పట్టణంలోని సమీకృత కార్యాలయం వెనక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సభా వేదిక ప్రాంగణంలో వీఐపీ గ్యాలరీలతోపాటు ప్రజలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రులు గీతా రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, స్థానిక నేతలతో కలిసి సభాస్థలిని పరిశీలించారు. తెలంగాణ కోసం ఉద్యమాలు, త్యాగాలు చేసింది మేమైతే, ఉద్యమ ద్రోహులందరినీ కేసీఆర్ మంత్రివర్గంలో చేర్చుకున్నారని షబ్బీర్ అలీ విరుచుకుపడ్డారు.

సైదాబాద్​లో ఘటన జరిగిన ఆరు రోజులైనా కూడా మంత్రులెవ్వరూ పరామర్శించలేదని మాజీమంత్రి గీతారెడ్డి ఆరోపించారు. వివరాలు తెలుసుకోకుండా నిందితుడిని పట్టుకున్నట్లు ట్విట్టర్​లో మంత్రి కేటీఆర్ ట్వీట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. అందుకే తన పేరును ట్విట్టర్ రామారావుగా పేరు పెట్టుకోవాలని ఆమె ఎద్దేవా చేశారు. సైదాబాద్ ఘటనపై పోలీసులను అడిగితే మాకు తెల్వదని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని గీతారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎన్నికలు రాగానే హుజూరాబాద్​లో దళితబంధు తీసుకొచ్చారని మాజీమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితులను ఓటు బ్యాంకు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ వాడుకుంటున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే ఏకకాలంలో 119 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలన్నారు. తెరాస ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలిపేందుకు ప్రజలు పెద్ద ఎత్తున గజ్వేల్ సభకు తరలి రావాలని సీతక్క అన్నారు.

గజ్వేల్ సభకు ముఖ్య అతిథిగా మల్లిఖార్జున్‌ ఖర్గే

రేపు గజ్వేల్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొంటారని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు బెంగుళూరులో బయలుదేరి మధ్యాహ్నం 12.05 గంటలకు ఆయన హైదరాబాద్‌ చేరుకుంటారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి రోడ్డు మార్గాన 5.15 గంటలకు గజ్వేల్‌ చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. సభకు హాజరైన తర్వాత తిరిగి గజ్వేల్‌లో రాత్రి 8 గంటలకు బయలుదేరి 9.15 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 11.20 గంటలకు బెంగుళూరుకు ఖర్గే చేరుకుంటారని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ఆ మేరకు పర్యటన ఖరారైనట్లు ఖర్గే కార్యాలయం రాష్ట్ర కాంగ్రెస్​కు సమాచారం వచ్చిందని తెలిపారు.

సైదాబాద్​లో ఘటన జరిగిన ఆరు రోజులైనా కూడా మంత్రులెవ్వరూ పరామర్శించలేదు. నిందితుడిని పట్టుకున్నామని ట్విట్టర్​లో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తారు. అసలు విషయం తెలుసుకోకుండా ట్వీట్ చేస్తారా? పోలీసులను అడిగితే మాకు తెల్వదని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు. ఎన్నికలు రాగానే దళితబంధు హుజూరాబాద్​లో తీసుకొచ్చారు.- గీతా రెడ్డి, మాజీమంత్రి

తెలంగాణ ఇచ్చింది మేము. త్యాగాలు చేసింది మేం. రాష్ట్రం కోసం పోరాడింది మేము. తెలంగాణ ద్రోహులని మమ్మల్ని అంటరు. ద్రోహులంతా మీ పార్టీలోనే ఉన్నారు. ఎనిమిది మంది మీ చెంతన చేరారు. ఎర్రబెల్లి, తలసాని, మల్లారెడ్డి లాంటి ఎందరో ఉన్నారు. మేం ఊహించిన దానికంటే పెద్దఎత్తున రేపు జరగబోయే సభకు జనం గజ్వేల్​ సభకు రానున్నారు.- షబ్బీర్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

ఏదైనా పథకం ప్రకటిస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి. కేవలం ఎన్నికలు ఉన్న చోట దళితబంధు అమలు చేస్తారా? దళితులపై మీకు ఎంత ప్రేమ ఉందో ఇక్కడే అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత వర్గాలకు ఏకకాలంలో దళితబంధు అమలు చేయండి. అనేకమంది గిరిజనులను, దళితులను అన్యాయానికి గురి చేస్తున్న ఘనత మీదే.- సీతక్క, ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో దళిత, గిరిజన దండోరా సభ

ఇదీ చూడండి: సంజయ్, ఈటల ఎంత తిరిగినా ప్రయోజనం ఉండదు: రేవంత్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.