ETV Bharat / state

ఉద్ధృతంగా గౌరవెల్లి నిర్వాసితుల ఆందోళన.. కొలిక్కిరాని చర్చలు

author img

By

Published : Jun 17, 2022, 8:38 AM IST

gouravelli project oustees protest : సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన నాలుగు రోజులైనా ఉద్ధృతంగా కొనసాగుతూనే ఉంది. రెండు పర్యాయాలు లాఠీఛార్జీ, పరస్పర దాడులతో అట్టుడకడంతో సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ నేతలు ఓ అడుగు ముందుకేశారు. మంత్రి హరీశ్‌రావుతో జరిపిన చర్చల్లో కొన్ని అంశాలు అంగీకారానికి వచ్చినా ఇంకా కొలిక్కి రాలేదు. మంత్రి ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న నిర్వాసితులు ఆందోళన కొనసాగింపునకే మొగ్గుచూపుతున్నారు.

gouravelli project oustees protest
gouravelli project oustees protest

ఉద్ధృతంగా గౌరవెల్లి నిర్వాసితుల ఆందోళన

gouravelli project oustees protest : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద... జలయజ్ఞంలో భాగంగా నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు 15 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంతో పనులు ప్రారంభించారు. స్వరాష్ట్రం వచ్చాక...పునరాకృతిలో భాగంగా ఎనిమిదిన్నర టీఎంసీలకు పెంచారు. ప్రస్తుతం గౌరవెల్లి ప్రాజెక్టు 95 శాతం పనులు పూర్తికాగా తోటపల్లి నుంచి రేగొండ పంప్‌హౌస్ ద్వారా గోదావరి జలాలను గౌరవెల్లి ప్రాజెక్టులోకి ట్రయల్‌రన్ చేస్తామన్న మంత్రి హరీశ్‌రావు ప్రకటనతో ఆందోళనలు ఊపందుకున్నాయి.

ఇంకా పరిహారం అందని భూ నిర్వాసితులు పనులు అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ట్రయల్‌రన్‌ చేసిన నీటిని కాల్వ ద్వారా పంపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కాల్వనిర్మాణానికి చేస్తున్న సర్వేను నిర్వాసితులు అడ్డుకున్నారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్న అధికారుల ఫిర్యాదుతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేయడం, అరెస్ట్‌లతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. నిర్వాసితులు చేపట్టిన హుస్నాబాద్‌ బంద్‌ను తెరాస నేతలు ప్రతిఘటించడంతో నిర్వాసితులు నిరసనల హోరు పెంచారు.

గుడాటిపల్లి భూ నిర్వాసితుల దీక్షకు మద్దతుగా వచ్చిన...కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కోదండరెడ్డి నిర్వాసితులను మంత్రి హరీశ్‌రావు వద్దకు తీసుకెళ్లారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావుతో జరిపిన చర్చల్లో కొన్ని అంశాలపై పరస్పర అంగీకారానికి వచ్చారు. 2015 వరకు 18 ఏళ్లు దాటిన వారికి ఓ ప్లాట్‌, రెండు లక్షలిస్తామని 2015 నుంచి 2022 వరకు 324 మందికి ఓ ఫ్లాటు 84 ఎకరాలకు పరిహారం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇవ్వాల్సిన పరిహారం మొత్తం ఇచ్చాకే ప్రాజెక్టు పనులు చేయనిస్తామని లేకుంటే పనులు అడ్డుకుంటామని హెచ్చరిస్తూ నిర్వాసితులు దీక్షను కొనసాగిస్తున్నారు.

సిద్దిపేట ఏసీపీ, ఎస్‌ఐపై దాడిచేశారంటూ గుడాటిపల్లి భూనిర్వాసితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సయంలో భూనిర్వాసితులపై జరిపిన లాఠీఛార్జి ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఆగస్టు 4 లోపు నివేదిక ఇవ్వాలని డీజీపీని హెచ్‌ఆర్సీ ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.