CONGRESS: నేడు గజ్వేల్​లో దళిత, గిరిజన ఆత్మగౌరవ బహిరంగ సభ.. సర్వం సిద్ధం

author img

By

Published : Sep 17, 2021, 5:27 AM IST

CONGRESS: నేడు గజ్వేల్​లో దళిత, గిరిజన ఆత్మగౌరవ బహిరంగ సభ.. సర్వం సిద్ధం

ముఖ్యమంత్రి కేసీఆర్​ సొంత నియోజకవర్గం గజ్వేల్​లో దళిత, గిరిజన ఆత్మగౌరవ బహిరంగ సభ నిర్వహణకు రాష్ట్ర కాంగ్రెస్ సర్వం సిద్ధం చేసింది. దళిత, గిరిజనులకు జరుగుతున్న మోసాలను ఎండగట్టేందుకు సభలు నిర్వహిస్తున్న కాంగ్రెస్.. ఇవాళ గజ్వేల్​ను ఎంచుకుంది. ఏడున్నరేళ్లలో కేసీఆర్​ ప్రభుత్వం దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలను ఎత్తిచూపుతూ... ఛార్జిషీట్​ వేయాలని నిర్ణయించిన పీసీసీ.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను భారీ సంఖ్యలో తరలించి సభను విజయవంతం చేయాలని నిర్ణయించింది.

రాష్ట్ర కాంగ్రెస్.. దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై ఆయా వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలను నిర్వహిస్తోంది. పోరాటాలకు నిలయమైన అదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లిలో గత నెల 9న క్విట్ ఇండియా దినోత్సవం రోజున.. రాష్ట్ర కాంగ్రెస్​ మొదలుపెట్టిన సభలు.. ఇవాళ తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గజ్వేల్​ సభతో ముగించనుంది. భారీ బహిరంగ సభలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా.. స్థానికంగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చింది. అదేవిధంగా రావిర్యాలలో రెండో సభ నిర్వహించిన కాంగ్రెస్.. ముఖ్యమంత్రి కేసీఆర్​ దత్తత తీసుకున్న మూడుచింతలపల్లిలో రెండు రోజుల దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా దళితులకు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలు... మోసాలపై కాంగ్రెస్​ నాయకులు గళమెత్తారు. ముచ్చటగా మూడో సభను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్​ను ఎంచుకుని.. అక్కడ కాంగ్రెస్​ జెండాను రెపరెపలాడించాలని పీసీసీ నిర్ణయించింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు కాంగ్రెస్​ పార్టీ సర్వం సిద్ధం చేసింది.

మూడున్నర లక్షల మందితో సభకు ప్లాన్​..

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రాతినిథ్యం వహిస్తున్న గడ్డ గజ్వేల్​లో కాంగ్రెస్​ జెండాను రెపరెపలాడించేందుకు నిర్ణయించిన పీసీసీ.. సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. భారీ ఎత్తున జనం హాజరయ్యేట్లు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలకుపైగా పోలింగ్​ బూతులున్నాయని.. ప్రతి బూతు నుంచి తొమ్మిది మంది లెక్కన ఈ సభకు హాజరయ్యేట్లు చూడాలని ఇప్పటికే పీసీసీ జిల్లా అధ్యక్షులకు.. నియోజకవర్గాల ఇంఛార్జిలకు, స్థానిక నేతలకు దిశానిర్దేశం చేసింది. ప్రణాళిక ప్రకారం.. మూడున్నర లక్షల మందితో సభ నిర్వహించి విజయవంతం చేయాలని కాంగ్రెస్​ పార్టీ నిర్ణయించగా.. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని.. కాంగ్రెస్​ సీనియర్​ నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం త్యాగం చేసింది... కాంగ్రెస్​ పార్టీనేనని నేతలు చెబుతున్నారు.

పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాలని..

రాష్ట్రంలో దళిత, గిరిజన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలు, మోసాలపై పోరాటం చేస్తున్నామంటున్న కాంగ్రెస్... వీటిని జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశలో ముందుకెళ్తోంది. ఇవాళ్టి బహిరంగ సభకు రాజ్యసభ ప్రతిపక్ష నేత... మల్లిఖార్జున ఖర్గేను తీసుకురావడం ద్వారా ఈ అంశాలకు జాతీయ స్థాయిలో ప్రచారం వస్తుందని భావిస్తోంది. మరోవైపు దళిత, గిరిజనులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. 10కిపైగా అంశాలపై ఛార్జీ షీట్​ వేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్​ నేతృత్వం వహిస్తున్న నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్​ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాలని పీసీసీ యోచిస్తోంది.

ఇదీ చూడండి: Revanth Reddy: 'లక్షమందితో దండుకట్టి... కేసీఆర్​పై దండయాత్ర చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.