ETV Bharat / state

Boy Died: వెంటాడిన మృత్యువు.. గాయం నుంచి కోలుకున్నా.. కోతుల రూపంలో..!

author img

By

Published : Apr 18, 2023, 11:31 AM IST

Boy Died falling A Rock in Siddipet: దురదృష్టం తలుపు తడితే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుందంటే ఇదేనేమో. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కుమారుడికి నెల క్రితం గాయం కాగా.. ఆ తల్లిదండ్రులు రూ.లక్షలు వెచ్చించి బతికించుకున్నారు. అయితే వారికి ఆ సంతోషం ఎన్నో రోజులు మిగలలేదు. విధి చిన్నచూపు చూడటంతో కోతుల రూపంలో మృత్యువు ఆ చిన్నారిని కబళించింది. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Boy
Boy

Boy Died falling A Rock in Siddipet: ఏ తల్లిదండ్రులైనా తమ కుమారుడికి చిన్న దెబ్బ తాకితేనే అల్లాడిపోతుంటారు. వారే తమ సర్వస్వంగా బతికే కన్నవారు.. తమకేమైనా పర్వాలేదు కానీ తమ బిడ్డ సంతోషంగా ఉండాలనుకుంటారు. తాము తిన్నా తినకున్నా.. వారి కడుపు నిండితే చాలనుకుంటారు. అందరిలాగే ఈ తల్లిదండ్రులూ తమ కుమారులను అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. కానీ విధి వారిని చిన్నచూపు చూసింది. ఇద్దరు కుమారుల చిన్ని చిన్ని మాటలు.. ముసిముసి నవ్వులతో మురిసిపోతున్న ఆ కుటుంబంలో ఓ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న బిడ్డకు నెల రోజుల క్రితమే ప్రమాదవశాత్తు గాయం కాగా.. రూ.4 లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించారు. డబ్బులు పోయినా.. బిడ్డ దక్కాడన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎన్నో రోజులు నిలవలేదు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్న కుమారుడిని.. ఈసారి కోతుల రూపంలో మృత్యువు కబళించింది. ఈ హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్‌లో సోమవారం జరిగింది.

సర్పంచి జిల్లెల అశోక్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. కట్కూర్‌ గ్రామానికి చెందిన దేవునూరి శ్రీకాంత్‌, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి స్లాబు గదుల ఇళ్లుతో పాటు రేకులతో కూడిన వంటగది ఉంది. అయితే రెండింటికీ మధ్య గాలి, వెలుతురు కోసం ఉన్న ఖాళీ ప్రదేశంపై తడక పెట్టి, గాలికి ఎగిరిపోకుండా దానిపై ఓ బండ పెట్టారు. ఇదిలా ఉండగా.. నిన్న కోతులు ఆ ఖాళీ ప్రదేశం నుంచి శ్రీకాంత్​ ఇంటి లోపలికి ప్రవేశించాయి. అది గమనించిన రజిత కోతులను బయటకు వెళ్లగొట్టేందుకు వంటింట్లోకి వెళ్లారు.

తల్లి వెంటనే రెండున్నరేళ్ల చిన్న కుమారుడు అభినవ్‌ ఉన్నాడు. ఆమె వాటిని ఆదమాయిస్తుండగా అవి వచ్చిన మార్గం నుంచే వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఎగిరి తడకపైకి దూకాయి. దాంతో అక్కడ ఉన్న బండ కదిలి కింద ఉన్న బాలుడి తలపై పడింది. ప్రమాదంలో బాలుడి తల పగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కళ్ల ముందే బాలుడు కన్నుమూయడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది.

ఈ ఘటనకు నెల రోజుల క్రితం అభినవ్‌.. ఇంట్లో గడప దాటుతున్న సమయంలో కాలు జారి కింద పడ్డాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కత్తి తగిలి బాలుడి గొంతు కొంత మేర తెగింది. తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేసి చికిత్స చేయించి కుమారుడిని దక్కించుకున్నారు. కానీ, సోమవారం కోతుల కారణంగా ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.