ETV Bharat / state

పోటీపడి మరీ గీసిన చిత్రాలు.. చూస్తే ఔరా అనక మానరు...

author img

By

Published : Jun 25, 2021, 2:53 PM IST

drawing, drawing brothers, patancheru
బొమ్మ బ్రదర్స్, చిత్రకళ, లాక్​డౌన్​లో చిత్రకళ

కరోనా, లాక్​డౌన్ వల్ల విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. బయట స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్దామంటే భయం.. ఇంట్లో ఉంటే ఏం చేయాలో అర్థంకాని అయోమయం. ఇలా ఎన్నిరోజులు ఖాళీగా ఉంటామనిపించింది ఆ అన్నదమ్ములకు. అప్పుడప్పుడు కాలక్షేపానికి బొమ్మలు వేయడం గుర్తొచ్చి.. ఆ కళకు సాన పెట్టడానికి వారిద్దరు పూనుకున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ.. ఛాలెంజ్ విసురుకుంటూ.. ఒకరికంటే మరొకరు అందంగా.. అద్భుతంగా చిత్రాలు గీయడం ప్రారంభించారు. లాక్​డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నామని సంబుర పడుతున్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరుకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు చిట్ల కార్తిక్, కుందన్ లాక్​డౌన్​ సమయంలో ఏమీ తోచక తమకు వచ్చిన కళకు సానపెట్టడం మొదలు పెట్టారు. కాలక్షేపానికి బొమ్మలు గీసే వీరు.. లాక్​డౌన్​లో శ్రద్ధగా తమ కళను మరింత అభివృద్ధి చేసుకున్నారు. పదో తరగతి చదివే కార్తిక్, ఇంటర్​ చదివే కుందన్.. వారి సోదరుడు శ్రీనాథ్ స్ఫూర్తితో చిత్రకళపై ఇష్టాన్ని పెంచుకున్నారు.

దేవుళ్లతో షురూ..

మొదట్లో దేవుళ్ల ఫొటోలు గీసేవారు.. తర్వాత వివిధ రకాలు చిత్రాలు వేయడం ప్రారంభించారు. ఒకరికొకరు చిత్రాలు పంపించుకుంటూ.. ఎవరు బాగా గీస్తారో అని సవాల్ విసురుకునేవారు. కొన్ని రోజుల అనంతరం ఏం చిత్రాలు గీయాలో అర్థంగాక తర్జనభర్జనపడ్డారు. అప్పుడే వారికి ఓ ఐడియా వచ్చింది. ప్రముఖుల చిత్రాలు గీయాలని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.

ప్రముఖుల చిత్రాలు..

అప్పటి నుంచి కార్తిక్, కుందన్​లు.... సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, రియల్ హీరో సోనూసూద్, రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీ రావు చిత్రాలు గీశారు. వీరితో పాటు కరోనా కష్టకాలంలో ప్రాణాలొడ్డి ప్రజలకు సేవలందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ బొమ్మలను వేశారు. ఇలా దాదాపు 70 బొమ్మలు వేసిన ఈ సోదర ద్వయం.. 200 చిత్రాలు గీయడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

ఆనందమానందం..

తమ కుమారుల ప్రతిభ చూసిన తల్లిదండ్రులు ముచ్చటపడిపోతున్నారు. వీరు గీసిన బొమ్మలను చూసి చాలా మంది మెచ్చుకుంటున్నారని సంబురపడిపోతున్నారు. ఈ సోదరులు గీసిన చిత్రాలతో ఓ ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారి తండ్రి శివ తెలిపారు. పాఠశాలలో పెయింటింగ్, డ్రాయింగ్ పోటీల్లో బహుమతులు గెలుచుకునేవారని చెప్పారు. తాను ఓ చిరుఉద్యోగి అయినందున.. తన కుమారులు గీసిన చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేయడం కష్టమని.. ఎవరైనా దాతలు స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు.

సాయం కావాలి..

లాక్​డౌన్ సమయాన్ని ఆటలు ఆడుకోవడానికో, సినిమాలు చూడటానికో కాకుండా ఇలా అర్థవంతంగా ఉపయోగించడం నిజంగా అభినందనీయమని పలువురు అంటున్నారు. కార్తిక్, కుందన్​ల ప్రతిభను గుర్తించి.. వారు గీసిన చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే.. వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

ఆ చిత్రాలు.. చూస్తే ఔరా అనక మానరు..!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.