ETV Bharat / state

Thara degree college : పాఠాలు వింటారు... డప్పుల దరువేస్తారు!

author img

By

Published : Feb 15, 2022, 11:50 AM IST

Updated : Feb 15, 2022, 12:57 PM IST

Thara degree college, drums training
పాఠాలు వింటారు... డప్పుల దరువేస్తారు

Thara degree college : డిగ్రీ కళాశాలల్లో ఏం నేర్పిస్తారు అని అడిగితే... విద్యార్థులు ఎంచుకున్న పాఠాలే బోధిస్తారు కదా.. అని అందరు సమాధానమిస్తారు. మరి ఎక్కడైనా డప్పు కొట్టడం నేర్పుతారా అంటే.. అదెందుకు అనే ప్రశ్న వినిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాలలో.. ఇదే విషయం అడిగితే.. ఓ తప్పకుండా..! అనే సమాధానం వస్తుంది. ఇక్కడ విద్యార్థులకు పుస్తకాల్లో ఉన్న పాఠాలకు అదనంగా కళలను పరిచయం చేసేలా చొరవ చూపుతున్నారు.

Thara degree college : ఉత్సాహంగా డప్పు కొడుతూ.. కదం తొక్కుతూ దరువేస్తే చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది కదా!. అయితే ఈ ప్రదర్శన చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. అందుకే దీనికి జీవం పోసేందుకు ఓ కళాశాల యాజమాన్యం ముందుకు వచ్చింది. అక్కడ విద్యార్థులు పాఠాలు చదువుకుంటూనే... కదం తొక్కుతూ.. డప్పు దరువేస్తారు. అదే సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల.

నేటి తరానికి పరిచయం

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు డప్పు దరువేయడం నేర్పుతున్నారు. ఆదరణ కోల్పోతున్న ఈ వాయిద్యాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ ఏడాది ఒక కోర్సు రూపంలో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. కళలు, కళా రూపాల మీద వారికి ఆసక్తి పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పైగా ఏదో ఒక సెమిస్టర్​లో విద్యార్థులు డప్పు వాయించడం నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో వారం రోజుల పాటు నేర్పించగా చాలా మంచి స్పందన వస్తోంది.

కదం తొక్కుతూ.. దరువేస్తూ..

రెండో బ్యాచ్​కి కూడా గత ఇరవై రోజులుగా నేర్పిస్తున్నారు. డప్పు గురించి కనీస పరిజ్ఞానం కూడా లేని విద్యార్థులు కూడా.. ఇప్పుడు చక్కని నైపుణ్యం సాధించారు. దరువుకు అనుగుణంగా కదం తొక్కుతూ.. ఉత్సాహంగా డప్పు కొడుతున్నారు. వీరి కోర్సు పూర్తయిన తర్వాత రెండు పాయింట్లు ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్ అందిస్తారు. మ్యూజిక్ అకాడమీ శిక్షకుల సాయంతో ఇప్పుడు వీరికి డప్పు కొట్టడం నేర్పించారు. ప్రస్తుతం ఒక్కో బ్యాచ్​కి యాభై గంటల పాటు శిక్షణ అందిస్తున్నారు.

ఈనెల 16న ప్రదర్శన

ఈ డప్పుతో పాటు మరిన్ని విభిన్న కోర్సులు అందుబాటులోకి తెచ్చేలా తారా డిగ్రీ కళాశాల బృందం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే డప్పు కొట్టడంలో నైపుణ్యం సాధించిన ఈ రెండో బ్యాచ్ విద్యార్థులు... సంగారెడ్డిలోని కళాశాల ప్రాంగణంలో ఈ నెల పదహారున ప్రదర్శన ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి : వయసు 60+.. 14 మందికి భర్త.. 7 రాష్ట్రాలకు అల్లుడు.. చివరకు..

Last Updated :Feb 15, 2022, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.