ETV Bharat / state

హడావుడిగా నిర్మాణం.. ప్రాణాలతో చెలగాటం

author img

By

Published : May 5, 2020, 7:31 AM IST

అనుకున్నదే తడవుగా మార్కెట్‌ను తరలించారు. ఈ తొందరలో వ్యవసాయ ,మార్కెటింగ్‌ శాఖలు అక్కడి నిర్మాణ పనుల పటిష్ఠతను పట్టించుకోకుండా.. రైతులు, కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు, హమాలీలు, కూలీల ప్రాణాలతో ఆడుకుంది. భాగ్యనగర శివార్లలోని కొహెడలో 178 ఎకరాల సువిశాల స్థలంలో మార్కెట్‌ ఏర్పాటు చేస్తున్నామనుకున్నారే తప్పా.. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేలా ఉంటుందా.. లేదా.. అనే విషయాన్ని విస్మరించారు. ఈ నిర్లక్ష్యమే కొహెడ మార్కెట్‌ కుప్పకూలడానికి కారణమైంది. సోమవారం నాటి గాలిదుమారం ఘటనలో మొత్తం 40 మంది గాయాలపాలయ్యారు.

The collapsed koheda fruit market
The collapsed koheda fruit market

అంతా హడావిడే.. ట్రాఫిక్‌ ఇబ్బందుల నేపథ్యంలో కొత్తపేటలోని గడ్డిఅన్నారం మార్కెట్‌ను నగర శివార్లలోని కొహెడకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 2015లోనే ప్రభుత్వం 178 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అప్పటి నుంచి ఎలాంటి పనులు చేపట్టలేదు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలో భాగంగా గడ్డిఅన్నారం మార్కెట్‌ను మూసేసి, కొహెడకు తరలించారు. మామిడి అమ్మకాలకు అనుకూల వాతావరణం లేదు.. కనీస వసతులు లేవని కమీషన్‌ ఏజెంట్లు మొత్తుకున్నా.. మార్కెటింగ్‌ శాఖ పట్టించుకోలేదు. ఏప్రిల్‌ 27 నుంచి అక్కడ అమ్మకాలు ప్రారంభించేందుకు.. గడ్డిఅన్నారం మార్కెట్‌ను ఏప్రిల్‌ 23నే మూసేశారు.

అధికారికంగా ప్రారంభించలేదు...

ఏప్రిల్‌ 27నే అధికారికంగా మార్కెట్‌ను ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ, ఏర్పాట్లు పూర్తి కాకపోవడం వల్ల కుదరలేదు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి తదితరులు పలుమార్లు మార్కెట్‌ను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మామిడి కాయలు రాసులుగా పోసేందుకు ప్లాట్‌ఫాంలు, పైకప్పుతో కూడిన షెడ్డులు కావాలని పట్టుపడితే.. తాత్కాలికంగా రేకులు, తడకల షెడ్లు ఏర్పాటు చేశారు. సువిశాలమైన మార్కెట్‌లో గాలిదుమారం వస్తే ఎలా అనేది పట్టించుకోలేదు. సోమవారం 83.52 కిలోమీటర్ల వేగంతో గాలి వీచడం వల్ల కొహెడ మార్కెట్‌ ఆనవాళ్లు కోల్పోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.