ETV Bharat / state

'దేశంలోనే ఎక్కువ వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే'

author img

By

Published : Dec 24, 2022, 3:27 PM IST

Updated : Dec 24, 2022, 7:45 PM IST

దేశంలో ఎక్కువ వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని కోరారు. వనస్థలిపురంలో నిర్వహించిన ఎస్‌టీయూటీఎస్‌ వజ్రోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.

మంత్రి హరీశ్‌రావు
మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బడ్జెట్‌లో విద్యపై 10 శాతం ఖర్చు పెడుతున్నామని వివరించారు. దేశంలోనే ఎక్కువ వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే అన్న మంత్రి.. ఉపాధ్యాయులు పిల్లలకు విలువతో కూడిన విద్యను అందించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో నిర్వహించిన ఎస్‌టీయూటీఎస్‌ వజ్రోత్సవాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాధ్యత గల పౌరులను సమాజానికి అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదర్శ పాఠశాలల విషయంలో కేంద్రం చేతులెత్తేస్తే ప్రభుత్వమే నడిపిస్తుందని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని.. కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తుంటారని మండిపడ్డారు. మన ఊరు-మన బడి ద్వారా రూ.7,289 కోట్లతో 26 వేల ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. రాష్ట్రం వచ్చాక 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. ఇది కేవలం ముఖ్యమంత్రి ముందుచూపు వల్లే సాధ్యమైందని చెప్పారు. అటవీ విశ్వ విద్యాలయం, గిరిజనుల కోసం ప్రత్యేకంగా లా రెసిడెన్షియల్ కళాశాల, అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్‌.. ఇలా అనేక మార్గాల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యపై ఖర్చు చేస్తుందని మంత్రి వివరించారు.

ప్రమోషన్లు, బదిలీలకు సీఎం సానుకూలం..: తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్య వచ్చినా ఇప్పటి వరకు ప్రభుత్వమే పరిష్కరించిందన్నారు. ఇకపైనా పరిష్కరించేది ప్రభుత్వమే అన్నారు. కరోనా పరిస్థితులు, కేంద్రం సహాయ నిరాకరణ వంటి కారణాల వల్ల కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ.. సీఎం కేసీఆర్‌ ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని చెప్పారు. దేశంలో ఎక్కువ జీతాలు పొందుతున్న ఉద్యోగులు రాష్ట్ర ఉద్యోగులేనన్నారు. విద్యాశాఖలో అన్ని ఖాళీలు భర్తీ చేస్తామని.. ప్రమోషన్లు, బదిలీల విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఒకటో తేదీన జీతాలు రావడం లేదంటే అందుకు కారణం కేంద్ర ప్రభుత్వమే అని దుయ్యబట్టారు.

రూ.40 వేల కోట్లకు కోత పెట్టింది..: కేంద్రం ఉద్దేశ పూర్వకంగా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిధులలో రూ.17 వేల కోట్లకు కేంద్రం కోత పెట్టిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టమంటే రూ.12,000 కోట్లకు కోత పెట్టిందన్నారు. 15వ ఆర్థిక సంఘం చెప్పినా రూ.5,300 కోట్లు ఆపిందని పేర్కొన్నారు. ఇలా మొత్తం రూ.40 వేల కోట్లు హక్కుగా రావాల్సిన నిధులను కేంద్రం ఆపేసిందని ఆరోపించారు.

తెలంగాణ ఏం చేస్తే.. దేశం అదే చేస్తుంది..: ష్ట్రం ఏర్పడక ముందు కోటీ 34 లక్షల సాగు భూమి ఉంటే.. ప్రస్తుతం 2 కోట్ల 3 లక్షలకు విస్తరించామని మంత్రి తెలిపారు. తెలంగాణలో పండుతున్న ధాన్యాన్ని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు తమకు ఇవ్వండని అడుగుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు ఏపీని అన్నపూర్ణ అన్నారని.. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దక్షిణ భారతానికి ధాన్యాగారంగా మారిందని వివరించారు. తెలంగాణ ఏం ఆచరిస్తుందో.. నేడు దేశం అదే ఆచరిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు రూ.25 వేల కోట్లు కేటాయించాం. దేశంలోనే ఎక్కువ వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే. విలువతో కూడిన విద్యను ఉపాధ్యాయులు అందించాలి. దేశంలో తొలి అటవీ విశ్వవిద్యాలయం తెలంగాణలోనే ఏర్పాటు చేశాం. - మంత్రి హరీశ్‌రావు

'దేశంలోనే ఎక్కువ వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే'

ఇవీ చూడండి..

కేజీ టు పీజీ విద్య ఒకే దగ్గర.. వీడియో షేర్ చేసిన కేటీఆర్

దిల్లీ మెట్రోకు 20 ఏళ్లు ప్రతిరోజూ 50 లక్షల మంది ప్రయాణం

Last Updated : Dec 24, 2022, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.