ETV Bharat / state

నామినేషన్ పత్రాలను చింపి వేశారని తెరాస నేతలపై సీఈవోకు ఫిర్యాదు

author img

By

Published : Nov 24, 2021, 5:04 PM IST

Updated : Nov 24, 2021, 5:37 PM IST

సీఈవో శశాంక్‌ గోయల్‌కు ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు శైలజ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ వేయకుండా తెరాస నేతలు అడ్డుకుని.. తన నామినేషన్ పత్రాలను చింపి వేశారని ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి కలెక్టర్ నుంచి సీఈవో నివేదిక కోరారు.

నామినేషన్ పత్రాలను చింపి వేశారని తెరాస నేతలపై సీఈవోకు ఫిర్యాదు
నామినేషన్ పత్రాలను చింపి వేశారని తెరాస నేతలపై సీఈవోకు ఫిర్యాదు

నామినేషన్ వేయకుండా తన పత్రాలను చింపివేశారన్న రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు శైలజ సత్యనారాయణరెడ్డి ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ నివేదిక కోరారు. బుద్ధభవన్​లో సీఈవోను కలిసిన శైలజ... తెరాస నేతలపై ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని, తన చేతిలో ఉన్న పత్రాలను చింపి వేశారని ఫిర్యాదు చేశారు.

శైలజ ఫిర్యాదుపై నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్​ను సీఈవో శశాంక్ గోయల్ ఆదేశించారు. జరిగిన ఘటనపై రేపు ఉదయం లోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. కలెక్టర్ నుంచి వచ్చే నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు.

అసలేం జరిగిందంటే..

మంగళవారం రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ఎంపీటీసీల సంఘం నాయకురాలు శైలజను తెరాస నాయకులు అడ్డుకుని, నామినేషన్ పత్రాలు చింపివేశారు. రంగారెడ్డి కలెక్టరేట్​లో నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను తెరాస నేతలు అడ్డుకుని వారి చేతుల్లోని నామినేషన్ పత్రాలను గుంజుకుని చింపివేస్తున్నా పోలీసులు నిలువరించకుండా చోద్యం చూశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని గెలవాలని తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు చింపుల శైలజ సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. తమ ఎంపీటీసీల సమస్యల పరిష్కారం కోసం పోటీలో నిలబడితే నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని అన్నారు. మహిళ అని కూడా చూడకుండా తనపై దాడి చేసి... నామినేషన్ పత్రాలను చింపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఈవోను కలిసిన శైలజ.. తెరాస నేతలపై ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: KTR On BJP Corporators GHMC Attack: 'గాడ్సే అభిమానులను గాంధీ మార్గంలో నడవమని కోరడం అత్యాశే'

Last Updated : Nov 24, 2021, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.