ETV Bharat / state

కోహెడకే గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్​.. అధికారుల ఏర్పాట్లు

author img

By

Published : Jun 30, 2020, 12:26 PM IST

కోహెడ పండ్ల మార్కెట్ పునరుద్ధరణపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. దక్షిణాదిలో అతి పెద్ద విపణి.. హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించేందుకు మళ్లీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రస్తుతం మార్కెట్​ పునరుద్ధరణ పనులు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో.. గడ్డిఅన్నారం మార్కెట్‌ను తిరిగి కోహెడకు తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ అంశంపై వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జరగనున్న సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Arrangements by the authorities in the Koheda Fruit Market
మళ్లీ కోహెడకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్​.. అధికారుల ఏర్పాట్లు

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కోహెడలో పండ్ల మార్కెట్ పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొవిడ్-19 నేపథ్యంలో ఏప్రిల్‌ మాసం చివర్లో హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్​ను తాత్కాలికంగా కోహెడకు మార్చారు. క్రయవిక్రయాలు సాగించారు. ఈ క్రమంలో మే 4న భారీ వర్షం, ఈదురు గాలుల తీవ్రతకు తాత్కాలిక షెడ్లన్నీ కుప్పకూలిపోయాయి. పలువురికి గాయాలయ్యాయి. ఫలితంగా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మార్కెట్​ కమిటీ అధికారులు గడ్డి అన్నారం, ఉప్పల్‌ రెండు చోట్లా మళ్లీ మామిడి క్రయ, విక్రయాలు ప్రారంభించారు. కోహెడలో మార్కెట్​ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

గతంలో కోహెడలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పండ్ల మార్కెట్‌ నిర్మాణం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో లోపభూయిష్టంగా సాగింది. ఫలితంగా ఈదురు గాలులకు షెడ్లన్నీ కుప్పకూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి వ్యవస్థ అంతా పూర్తిగా స్థంభించిపోయింది. సుమారు 1.5 కోట్ల నిధులు వృథా అయ్యాయి. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మరో 1.5 కోట్లతో మార్కెట్ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం పనులన్నీ ముగింపు దశకు చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో గడ్డి అన్నారం నుంచి మార్కెట్​ను తరలించేందుకు మళ్లీ మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం కమిషన్ ఏజెంట్లు, రైతులతో కీలక సమావేశం జరగనుందని గడ్డిఅన్నారం ఏఎంసీ ప్రత్యేక శ్రేణి-1 కార్యదర్శి యెండ్రపల్లి వెంకటేశం తెలిపారు.

మరోవైపు ఇప్పటికే మామిడి సీజన్ ముగింపు దశకు చేరుకోగా.. మరో 15 రోజులపాటు బత్తాయి వస్తాయి. జులై 15 నుంచి ఆపిల్‌ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో కమిషన్ ఏజెంట్ల సౌకర్యార్థం కోహెడ మార్కెట్‌ యార్డులో 3 షెడ్లు నిర్మించారు. వీటిలో 77 మందికి పైగా కమిషన్​ ఏజెంట్లకు దుకాణాలు కేటాయించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఈ మేరకు మంగళవారం గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెడ్ కమిటీ కార్యాలయంలో జరగనున్న సమావేశంలో కోహెడ మార్కెట్ కార్యకలాపాల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన పనులను పూర్తిచేసి త్వరలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిల చేతుల మీదుగా మార్కెట్‌ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

ఇదీచూడండి: ప్రభుత్వ నిర్ణయం మేరకే గురుకులాల ప్రారంభం: ఆర్​ఎస్ ప్రవీణ్​కుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.