నవీన్‌ హత్య కేసు.. సీన్‌ టు సీన్‌ ఇలా జరిగింది..!

author img

By

Published : Mar 9, 2023, 10:25 PM IST

Naveen murder case updates
Naveen murder case updates ()

Naveen murder case updates: ప్రేయసి కోసం స్నేహితుడిని హత్య చేయడానికి కుట్ర పన్నాడు. ఆ విషయాన్ని రెండుసార్లు ప్రియురాలి వద్ద ప్రస్తావించాడు. అదేంటని ప్రశ్నించిన ప్రియురాలితో.. సరదాగా అన్నానంటూ బుకాయించాడు. కానీ అనుకున్నది చేయడానికి సమయం కోసం వేచి చూశాడు. అదను చూసి స్నేహితుడిని అతి కిరాతకంగా హత్య చేశాడు. నవీన్ హత్య కేసులో హరిహర కృష్ణ, హసన్, నిహారికలను ప్రశ్నించినప్పుడు పలు విషయాలు బయటపడ్డాయి. మొదట వద్దని వారించిన నిహారిక.. ఆ తర్వాత హత్య చేసిన విషయం తెలుసుకొని హరిహర వెంట వెళ్లి నవీన్ మృతదేహాన్ని చూసింది. ఆ తర్వాత హరిహరకు న్యాయసాయం చేసేందుకు ప్రయత్నించింది.

Naveen murder case updates: నవీన్ హత్య కేసులో నిందితులను ప్రశ్నించినప్పుడు క్రైం థ్రిల్లర్ సినిమాను మించిపోయే వాస్తవాలు బయటపడ్డాయి. హరిహర కృష్ణను హత్య చేసిన విషయం తెలుసుకున్న హసన్, నిహారిక.. ఆ తర్వాత అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. దీని కోసం నిహారిక న్యాయవాది అయిన తన బావకు విషయాన్ని చెప్పింది. హత్యకు సంబంధించిన ఆధారాలు లభించకుండా చేయాలని హసన్‌ హరిహరకు సలహా ఇచ్చాడు. హరిహర కృష్ణను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించడంతో నిహారిక, హసన్ పాత్ర ఉన్నట్లు తేలింది. హత్యలో భాగస్వాములు కాకపోయినప్పటికీ.. నవీన్‌ను చంపిన విషయం ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టడంతో పాటు హరిహరకు సలహాలివ్వడం, ఇక్కడ ఏం జరుగుతుందనే విషయాలు చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

గత నెల 17న హరిహరకృష్ణ నవీన్‌ను హత్య చేశాడు. ఆ తర్వార శరీర భాగాలను వేరు చేసి వాటిని సంచిలో పెట్టుకున్నాడు. నవీన్‌ను చంపిన విషయాన్ని హసన్‌కు ఫోన్‌లో చెప్పాడు. హసన్ విషయాన్ని నమ్మలేదు. హసన్ ఇంటికి బయల్దేరిన హరిహర.. మార్గమధ్యలో చెట్ల పొదల్లో నవీన్ తల, ప్యాంటుతో పాటు కత్తిని పడేశాడు. 20 నిమిషాల వ్యవధిలో హరిహర కృష్ణ హసన్ నివాసముండే రాజీవ్ గృహ కల్ప వద్దకు చేరుకున్నాడు. మిగతా శరీర భాగాలను ఉన్న సంచిని హసన్‌కు చూపించడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు.

Naveen murder case latest updates: ఆ సంచిలో ఉన్న గుండె, చేతి వేళ్లు, మర్మాంగాలు, నవీన్ సెల్‌ఫోన్‌ను హరిహర కృష్ణ, హసన్ కలిసి బ్రాహ్మణపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు. హసన్ దుస్తులను హరిహర వేసుకున్నాడు. రక్తంతో తడిచిన తన దుస్తులు, బూట్లను హరిహర ఓ సంచిలో వేశాడు. రాత్రి అక్కడే నిద్రపోయిన హరిహర.. తన దుస్తులను సాగర్ జాతీయ రహదారిపై మన్నెగూడ సమీపంలో ఉన్న చెత్తకుండిలో వేశాడు. 18వ తేదీ ఉదయం 9.30 గంటల సమయంలో బీఎన్ రెడ్డిలో ఉన్న నిహారికను కలిసి హత్య చేసిన విషయం వెల్లడించాడు. ఆమె వద్ద రూ.1500 తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు.

నవీన్‌ను చంపి నిన్ను అపహరించుకుపోతా..: నవీన్‌ను హత్య చేస్తాననే విషయాన్ని హరిహర.. గతంలో రెండుసార్లు నిహారిక వద్ద ప్రస్తావించాడు. నవీన్, నిహారిక ప్రేమించుకునే సమయంలో ఇద్దరి మధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలను హరిహర సర్దిచెప్పేవాడు. నవీన్ మరో అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న నిహారిక.. అతడిని దూరం పెట్టింది. దీంతో ఏడాది క్రితం హరిహర కృష్ణ తన ప్రేమ విషయాన్ని నిహారకకు చెప్పాడు. నిహారిక అంగీకరించడంతో ఇద్దరూ కలిసి తిరిగారు. నవీన్ మధ్య మధ్యలో నిహారికకు ఫోన్ చేయడం, మెసెజ్‌లు పెడుతున్న విషయాన్ని హరిహర కృష్ణ తెలుసుకున్నాడు. ''నవీన్‌తో మాట్లాడితే నువ్వు నాకు దూరం అయిపోతావు. అతడిని హత్య చేసి నిన్ను అపహరించుకుపోతా'' అని 3 నెలల క్రితం నిహారికతో హరిహర చెప్పాడు. ఆమె గట్టిగా ప్రశ్నించడంతో సరదాగా అన్నానని బుకాయించాడు. రెండు నెలల క్రితం నిహారికను ఇంటికి తీసుకెళ్లిన హరిహర.. తన వద్ద ఉన్న కత్తి, గ్లౌజులను చూపించి నవీన్‌ను హత్య చేయడానికి తీసుకొచ్చానని చెప్పాడు. హత్య చేస్తే జైలుకు పోతావు అని బెదిరించడంతో.. హరిహర ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. తన కుట్రను అమలు చేసేందుకు ఎదురు చూశాడు.

నిహారికతో నవీన్‌ గొడవ..: ఫిబ్రవరి 17న నవీన్ నల్గొండ నుంచి హైదరాబాద్‌కు వచ్చి హరిహరను కలిశాడు. రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరూ కలిసి అబ్దుల్లాపూర్‌మెట్ వెళ్లాక.. హరిహర తన ఫోన్ నుంచి నిహారికను ఫోన్ చేశాడు. ఇద్దరం ప్రేమలో ఉన్నట్లు నవీన్‌కు చెప్పాల్సిందిగా అప్పటికే హరిహర కృష్ణ నిహారికకు చెప్పాడు. ఇదే విషయాన్ని నిహారిక, నవీన్‌కు చెప్పింది. దాదాపు 6 నిమిషాల పాటు నవీన్.. నిహారికతో మాట్లాడి గొడవపడ్డాడు. ఆ తర్వాత హరిహరతోనూ ఇదే విషయమై గొడవ జరిగింది. ఈ క్రమంలోనే నవీన్‌ను హరిహర హత్య చేశాడు. హత్య చేసిన విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని నిహారికకు హరిహర చెప్పాడు. హసన్‌కూ ఇదే విషయాన్ని తెలిపాడు.

ఫోన్‌ చేస్తే ఏమీ తెలియనట్లు..: ఇందుకోసం ఇద్దరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకోవడానికి హరిహర ఇతరుల నంబర్ల నుంచి నిహారిక, హసన్‌లకు ఫోన్ చేశాడు. నవీన్ కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో 21న ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హరిహర కోసం మూసారాంబాగ్‌లోని ఇంటికి వచ్చి వెళ్లారు. 21వ తేదీ నుంచి హరిహర కనిపించకపోవడంతో ఆమె సోదరి మలక్‌పేట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. హరిహర చరవాణి నుంచి చివరి ఫోన్ హసన్‌కు వెళ్లడంతో.. హసన్‌ను మలక్‌పేట్ పోలీసులు పిలిపించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన హసన్, హరిహర గురించి తనకు తెలియదని చెప్పాడు. నవీన్ ఆచూకీ గురించి తెలుసుకోవడానికి అతని స్నేహితుడు సైతం నిహారికకు ఫోన్ చేశాడు. అప్పటికే నవీన్‌ హత్య గురించి తెలిసినా.. నిహారక మాత్రం ఏమీ తెలియనట్లు నవీన్ స్నేహితుడికి సమాధానం ఇచ్చింది.

అతడు చెప్పడంతో లొంగిపోయిన హరిహర..: 24వ తేదీ ఉదయం 10 గంటలకు హరిహర కృష్ణ నిహారికను కలిశాడు. కోర్టులో హత్య కేసు గురించి మాట్లాడటానికి న్యాయవాదిని చూడాలని నిహారికను కోరాడు. నిహారిక న్యాయవాది అయిన తన బావకు నవీన్ హత్య గురించి మొత్తం వివరించింది. హత్య విషయంలో వెంటనే పోలీసులకు లొంగిపోవాలని నిహారిక బావ సూచించడంతో ఇదే విషయాన్ని హరిహరకు చెప్పింది. అతి కిరాతకంగా హత్య చేసిన హరిహర కృష్ణను కాపాడేందుకు హసన్, నిహారిక ప్రయత్నించిన తీరును చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. హరిహర కృష్ణ సైతం మొదట హసన్, నిహారికల పాత్ర గురించి ఏమాత్రం చెప్పలేదు. పోలీసులు సాంకేతికతను ఉపయోగించుకొని హరహర కృష్ణ, నిహారిక, హసన్‌లు కలుసుకున్న విషయాలను ఆధారాలతో సహా ముందు పెట్టడంతో నిందితుడు అప్పుడు నోరు విప్పాడు.

ఇవీ చూడండి..

'నా కొడుకు చేసింది తప్పే.. కానీ నవీన్​ హత్య ఒక్కడి వల్ల సాధ్యం కాదు'

హరిహరా... స్నేహితురాలి ఇంట్లో స్నానం.. ఆమెతో రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.