ETV Bharat / state

'రాచరిక వ్యవస్థను మార్చడం కాదు.. ముందు గవర్నర్ వ్యవస్థను తొలగించాలి'

author img

By

Published : Jan 30, 2023, 8:54 PM IST

Updated : Jan 30, 2023, 10:20 PM IST

KTR Fires on Central Government: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఈ బడ్జెట్‌లో నిధులివ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించిన ఆయన.. విభజన చట్టం ప్రకారం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే రాచరిక వ్యవస్థ మార్చాలని చెబుతున్న ప్రధాని మోదీ.. ముందు బ్రిటీష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను తొలగించాలని వ్యాఖ్యానించారు.

ktr
ktr

గవర్నర్ వ్యవస్థను తొలగించాలి: కేటీఆర్

KTR Fires on Central Government: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ మరోసారి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధింఛారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేర్చేందుకు కేంద్రానికి.. ఇది చివరి బడ్జెట్ అని సూచించారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఒక్కటంటే ఒక్కటి కొత్త రైల్వే ప్రాజెక్ట్ ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను చెప్పింది ఏదైనా అబద్దమని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమని కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు.. కేంద్రం ఈ బడ్జెట్‌లోనైనా నిధులివ్వాలని కోరారు. రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రం కన్నా.. కేంద్రం తక్కువ ఖర్చు చేస్తోందని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలకు కేంద్రాన్ని అడిగే సత్తా లేదని ఆరోపించారు. రైల్వేశాఖమంత్రి అశ్విని వైష్ణవ్‌కు బీఆర్ఎస్ తరఫున లేఖ రాసినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్‌ను తిట్టడం కాదు.. ప్రాజెక్టులు ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రాన్ని నిలదీయాలని.. రాష్ట్ర బీజేపీ నేతలకు కేటీఆర్ సూచించారు. వారు చేయాల్సిన పనిని కూడా తామే చేస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ తరఫునే కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని పేర్కొన్నారు. రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీని రద్దు చేశారని గుర్తు చేశారు. మోదీ కూడా సీనియర్ సిటిజనేకాబట్టి భవిష్యత్తులో పనికొస్తుందని.. దానిని వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ క్రమంలోనే తెలంగాణ రైతుబంధు తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని సూచించారు.

''రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష చూపుతోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదు. రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రం కన్నా.. కేంద్రం తక్కువగా ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఈ బడ్జెట్‌లో నిధులివ్వాలి. విభజన చట్టం ప్రకారం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి.'' - మంత్రి కేటీఆర్

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు ఒక పార్టీకి మద్దతుగా మాట్లాడటం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో ఒక్క పార్టీకి చెందిన నాయకుల ఫొటోలు పెట్టడం సరికాదన్నారు. రాజకీయాల్లో ఉన్న వారికి రెండేళ్ల వరకు ఎలాంటి పదవులు ఇవ్వవద్దని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన మోదీ.. ఇప్పుడు ప్రధానిగా మాత్రం తుంగలో తొక్కుతున్నారని ఆక్షేపించారు. రాచరిక వ్యవస్థ మార్చాలని చెబుతున్న ప్రధాని.. ముందు బ్రిటీష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను తొలగించాలని డిమాండ్‌ చేశారు.

''రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు ఒక పార్టీకి మద్దతుగా మాట్లాడటం సరికాదు. రాజ్‌భవన్‌లో ఒక పార్టీకి చెందిన నాయకుల ఫొటోలు పెట్టడం సరికాదు. బ్రిటీష్ కాలం నాటి పేర్లు, చట్టాలు మోదీ తొలగిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను తొలగించాలి.''-మంత్రి కేటీఆర్‌

ఇవీ చూడండి..

తెలంగాణ అనతికాలంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది: మంత్రి కేటీఆర్

అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం.. హైకోర్టులో ముగిసిన విచారణ

Last Updated :Jan 30, 2023, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.