ETV Bharat / state

బామ్మ అభ్యర్థనకు ముగ్ధుడైన మంత్రి...

author img

By

Published : Aug 15, 2020, 8:36 PM IST

సిరిసిల్ల శాలోల్ల ఆదుకున్నట్లే మా గ్రామ శాలోల్లనూ ఆదుకోవాలని ఓ దివ్యాంగురాలు మంత్రి కేటీఆర్​కు విన్నవించుకుంది. ఆమె అభ్యర్థనపై స్పందించిన కేటీఆర్​ వెంటనే సూర్యాపేట జిల్లా మానాపురంలోని చేనేత కార్మికుల స్థితిగతులు తెలుసుకోవాలని పీఎస్​కు ఆదేశించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే ఇది చదివి తీరాల్సిందే..

KTR
KTR

తన దృష్టికి వచ్చిన సమస్యలపై మంత్రి కేటీఆర్​ ఏ విధంగా స్పందిస్తారో అందరికీ తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్​ను కలవడానికి దివ్యాంగురాలు విజయమ్మ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. జెండా ఆవిష్కరించిన మంత్రి తిరిగి వెళ్లిపోతుండగా ఏమిజరిగిందంటే...

ఓ సారూ.. ఓ కేటీఆర్ సారూ అంటూ గట్టిగా జనం మధ్య నుంచి ఓ కేక వినిపించింది... అది విన్న మంత్రి పిలిచిన వృద్ధురాలి వద్దకు వెళ్లి... ఏ అమ్మా...! ఏమైంది... ఏ సమస్య నీకు? ఏమైనా పింఛన్​ సమస్యనా..? ఏం కష్టం తల్లీ నీకు అని అడిగారు.

'సారూ నేనొచ్చి రెండు గంటలవుతుంది.. ఎవరు లోనికి రానిస్తలేరు.. మీ పుణ్యాన నెలకు మూడు వేల పింఛన్​ వస్తుంది... కానీ సారూ.. మా అల్లుడు సూర్యాపేట జిల్లా..తిరుమలగిరి పక్కన.. మానుపురంల ఉంటడు... అక్కడ 30 శాలోల్ల కుటుంబాలున్నాయి. రెండు నెల్లుగా వారికి పని నడుత్తలేదు.. బట్ట ఎవలు కొంటలేరు. బాంచెన్... వాళ్లను ఆదుకొండి సారూ.. ఊకే మా అల్లుడు నిన్ను యాది జేస్తడు. సిరిసిల్ల శాలోల్లకు కేటీఆర్ మంచిగా చేస్తుండే అని నాకు బాగా సార్లు చెప్పిండు సారూ. పెద్దమనసు చేసుకుని మా అల్లుని ఊరోళ్లకు ఏమైన సాయం చేయండి సారూ మీకు పుణ్యముంటది.. '

అంటూ సిరిసిల్ల పట్టణానాకి చెందిన పులి విజయమ్మ... మంత్రి కేటీఆర్​ను ఆర్థించింది. ఆమె మాటలకు చలించిపోయిన మంత్రి కేటీఆర్​... అమ్మా..! నువ్వు ఇంత వరకు ఎదురు చూసింది నీ సమస్య కోసం కాదా?.. అని వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్​కు ఫోన్​ చేసి జిల్లాలో చేనత కార్మికుల సమస్యపై ఆరా తీశారు.

ప్రభుత్వ పథకాలు అందరికి అందుతున్నాయా లేదా, మరే ఇతర సమస్యలున్నాయి తదితర అంశాలపై సాయంత్రం లోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. వెంటనే స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం మానాపురం వెళ్లినట్లు సమాచారం.

బామ్మ అభ్యర్థనకు ముగ్ధుడైన మంత్రి... సమస్యపై సత్వర పరిష్కారానికి ఆదేశం

ఇదీ చూడండి: కేటీఆర్​ చొరవతో వాగులో చిక్కుకున్న 12 మంది రైతులను కాపాడిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.