ETV Bharat / state

KTR: తెలంగాణలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతోంది

author img

By

Published : Jun 16, 2021, 7:38 PM IST

minister ktr
KTR: తెలంగాణలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతోంది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనుకోని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్​ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం కొదురుపాక వద్ద కేటీఆర్​ అమ్మమ్మ-తాతయ్య జ్ఞాపకార్థం నిర్మించిన రైతువేదికను మంత్రులు కేటీఆర్​, ప్రశాంత్​రెడ్డి కలిసి ప్రారంభించారు. రైతును రాజును చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్యమని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు.

కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆగలేదని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలనలో తెలంగాణలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతోందని మంత్రి వెల్లడించారు. దమ్ముంటే భాజపా, కాంగ్రెస్​ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా 24 గంటలు విద్యుత్​ సరఫరా చేసే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం కొదురుపాక వద్ద కేటీఆర్​ అమ్మమ్మ-తాతయ్య జ్ఞాపకార్థం నిర్మించిన రైతువేదికను మంత్రులు కేటీఆర్​, ప్రశాంత్​రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం కొదురుపాక జంక్షన్​ రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు.

చిన్ననాటి జ్ఞాపకాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనుకోని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్​ తెలిపారు. రైతువేదిక ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్​ కొదురుపాకతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు ప్రతి వేసవికాలంలో ఇక్కడికి వచ్చేవాడినని... తాతయ్య చనిపోయినప్పుడు తాను ఇక్కడ లేనని... అది చాలా బాధను కలిగించిందని ఆవేదనకు గురయ్యారు. గతంలో ఆ ప్రాంతంలో కరువు తాండవమాడేదని... ప్రస్తుతం అక్కడ భూగర్భజలమట్టం ఆరు మీటర్లు పెరిగిందనే విషయాన్ని ముస్సోరీలో కాబోయే ఐఏఎస్‌లకు పాఠాలుగా చెబుతున్నారన్నారు. సిరిసిల్ల మీదుగా కరీంనగర్​ వరకు రైలు మార్గం కూడా రాబోతోందన్నారు.

నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు..

రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి లాంటి పథకాలు దేశంలోని ఏ ప్రాంతంలో లేవని మంత్రి కేటీఆర్​ అన్నారు. రైతును రాజును చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్యమన్నారు. నోరుందని ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయన్నారు. పంజాబ్​ను దాటి రాష్ట్రంలో ధాన్యం అధికంగా పండించిందంటే అది కేసీఆర్​ కృషి వల్ల కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 2600 రైతు వేదికలను నిర్మించుకున్నామని... ఆ వేదికల్లో రైతులు సంఘటితమై చర్చించుకోవాలని సూచించారు.

సంతోషంగా ఉంది: వేముల ప్రశాంత్​ రెడ్డి

గ్రామానికి మనుమడై వారి అమ్మమ్మ-తాతయ్య జ్ఞాపకార్థం మంత్రి కేటీఆర్​ తన సొంత నిధులతో రైతు వేదిక నిర్మించడం సంతోషంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి అన్నారు. దిల్లీకి రాజైనా పుట్టిన ఊరిపై ప్రేమ మమకారం ఉంటుంది కాబట్టే ఇంత పెద్ద రైతు వేదిక నిర్మించారన్నారు. 21కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని... కరీంనగర్‌ నుంచి సిరిసిల్ల వరకు గల మొత్తం రహదారిలో మిగిలి ఉన్న ఆరు కిలోమీటర్ల రోడ్డును కూడా విస్తరించేందుకు కృషి చేస్తామని మంత్రి ప్రశాంత్​రెడ్డి హామీ ఇచ్చారు.

అభివృద్ధి కార్యక్రమాలు ఆపలేదు: వినోద్​ కుమార్​

కరోనా కారణంగా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికి ఎక్కడా కూడా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ఆపలేదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్​పల్లి వినోద్​కుమార్​ పేర్కొన్నారు. తెలంగాణ సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్​ పుట్టారన్నారు. రైతు వేదికల ప్రతిపాదన రావడంతోనే మంత్రి కేటీఆర్‌ ఏడు నిర్మిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: KTR: పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.