ETV Bharat / state

Kaleshwaram Project News : మూన్నెళ్లుగా మునకలో మల్కపేట పంపుహౌస్

author img

By

Published : Dec 18, 2021, 8:47 AM IST

Kaleshwaram Project News : ఈ ఏడాది సెప్టెంబర్​లో కురిసిన వానలకు కాళేశ్వరం ప్రాజెక్టు లింక్​-3లో ముఖ్యమైన తొమ్మిదో ప్యాకేజీ సొరంగం, మల్కంపేట పంపుహౌస్​లోకి వరద నీరు చేరింది. అదే 15 నుంచి మోటార్లతో నీటిని తోడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ పనులు పూర్తి కాలేదు. సొరంగంలో నీరు తగ్గినా.. పంపుహౌస్ మాత్రం మునకలోనే ఉంది. ఈ ప్యాకేజీ పనులు ఈ నెలాఖరుతో పూర్తి కావాల్సి ఉంది.

Kaleshwaram Project News
Kaleshwaram Project News

Kaleshwaram Project News : కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-3లో ప్రధానమైన తొమ్మిదో ప్యాకేజీలో సొరంగం, మల్కపేట పంపుహౌస్‌ పనుల్లో జాప్యం వీడటం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయం నుంచి 120 రోజుల్లో 11.63 టీఎంసీల నీటిని ఎగువ మానేరుకు తరలించడం ఈ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశం. ఈ పనులు నెలాఖరుతో పూర్తి కావాలి.

మూడు నెలలుగా కొనసాగుతున్న వరదనీటి తోడివేత పనులు

Kaleshwaram Ninth Package : ఈ ఏడాది సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు సొరంగం, పంపుహౌస్‌లోకి వరద నీరు చేరింది. అదే నెల 15న చెన్నై నుంచి 8 మోటార్లను తెప్పించి.. మూడు నెలలుగా నీటిని తోడుతున్నారు. సొరంగంలో నీరు తగ్గినా.. పంపుహౌస్‌ మునకలోనే ఉంది. దీనికితోడు సీపేజీతో పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటికీ సొరంగం, పంపుహౌస్‌లో కలిపి సుమారు 30 కోట్ల లీటర్ల నీటిని తోడారు. ఇంకా 7 కోట్ల లీటర్లు ఉన్నట్లు అధికారుల అంచనా. నీటిని తోడి పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రధాన గుత్తేదారుదే.

మల్కపేట పంపుహౌస్

పనులు ఇలా..

Malkapet Pump House : రగుడు నుంచి మల్కపేట వరకు 12.035 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉంది. ఇందులోని వరద నీరు తొలగించడంతో మిగిలిఉన్న 2.4 కిలోమీటర్ల సిమెంటు లైనింగ్‌ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. చంద్రపేటలో అడిట్‌(సొరంగానికి అదనపు ప్రవేశ మార్గం)-4 కోసం తీసుకున్న భూమి లీజు గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. పనులు పూర్తి చేసి జనవరి నాటికి మార్గాన్ని మూసివేయాల్సి ఉంది.

Malkapet Pump House in Sircilla : మల్కపేట జలాశయం పనులు 90 శాతం పూర్తయ్యాయి. కుడి కాలువ ప్రారంభంలో కిలోమీటరు మేరకు పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. 8 కిలోమీటర్ల ఎడమ కాలువ కోసం 70 ఎకరాలు సేకరించారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.10 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేస్తున్నారు.

మల్కపేటలోని సర్జ్‌పూల్‌ పంపుహౌస్‌లో 30 మెగావాట్ల సామర్థ్యంతో రెండు మోటార్లు బిగించాల్సి ఉంది. మొదటిది బిగిస్తుండగానే వరదలు ముంచెత్తాయి. నీటిని పూర్తిగా తొలగించి.. అందులోని సామగ్రిని బయటకు తీయాలి. అన్నీ సక్రమంగా జరిగితే మార్చిలో మొదటి మోటారుతో ట్రయల్‌ రన్‌ చేపట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.