Textile projects: ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు నిధుల కొరత.. కేంద్రాన్ని కోరినా అందని సాయం

author img

By

Published : May 11, 2022, 5:04 AM IST

Updated : May 11, 2022, 5:37 AM IST

Textile projects

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులకు సొమ్ములు లేక పనులు ఆశించిన వేగంగా సాగడం లేదు. కాకతీయ జౌళి, సిరిసిల్ల మరమగ్గాల పార్కులను నిధుల కొరత వేధిస్తోంది. జౌళి పార్కు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 946 కోట్లు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదు. అలాగే సిరిసిల్ల పవర్‌ లూమ్స్‌ మంజూరుకూ కేంద్రంలోని భాజపా సర్కారు నుంచి స్పందన రావడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, సిరిసిల్లలో భారీ మరమగ్గాల సమూహం-మెగా పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు మొత్తం అంచనా వ్యయం 3 వేల కోట్లు కాగా... మౌలిక వసతులకు ఇందులో 2 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెండింటి కోసం 110 కోట్లను వెచ్చించింది. కాకతీయ పార్కు కోసం కేంద్రాన్ని 946 కోట్ల సాయం కోరినా.. నిధులు కేటాయించలేదు. ఇప్పటికే ఇక్కడ ప్రాథమిక సౌకర్యాలు కల్పించగా.. పూర్తి స్థాయిలో పనులు చేపట్టాల్సి ఉంది. సిరిసిల్ల మెగా పవర్‌ లూమ్‌ పార్కుకు భూములను గుర్తించినా మంజూరుపై సందిగ్ధంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది.

Textile projects
కాకతీయ జౌళి, సిరిసిల్ల మరమగ్గాల పార్కులను నిధుల కొరత


కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. 2 వేల ఎకరాల భూసేకరణ జరిపింది. పార్కులో 8 సంస్థలకు భూములను కేటాయించింది. భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ పార్కుకు కేంద్ర ప్రభుత్వ వాటా కింద మౌలిక వసతుల కోసం 897.92 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి సాయం రాకపోవడంతో రాష్ట్ర సర్కారు ఇక్కడ మౌలిక సదుపాయాలను సొంతంగా చేపట్టింది. ఇప్పటివరకు 100 కోట్లతో అంతర్గత రహదారులు, 33 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం పూర్తి చేసింది. పార్కుకు నీటివసతి లేకపోవడంతో 25 కిలోమీటర్ల దూరంలోని ధర్మసాగర్‌ నుంచి మిషన్‌ భగీరథ జలాలను రప్పించాలని నిర్ణయించింది. మెగా జౌళి పార్కు గల చింతలపల్లి-శాయంపేట హవేలీల నుంచి మామునూరు విమానాశ్రయానికి, వరంగల్‌, హనుమకొండ జిల్లాలకు 4 వరుసల రహదారులను నిర్మించాల్సి ఉన్నా అదీ జరగలేదు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పెండింగులో ఉంది. వీటన్నింటికీ మరో 150 కోట్లు అవసరం. పార్కులో విద్యుత్‌ సౌకర్యం కోసం 220 కేవీ సబ్‌ స్టేషన్‌, భూగర్భ కేబుల్‌, ఇతర మౌలిక వసతులకు 90 కోట్లు, వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటుకు 60 కోట్లు వెచ్చించాల్సి ఉంది. నిధుల అవసరం దృష్ట్యా మెగా జౌళి పార్కుల పథకం లేదా పీఎం మిత్ర పథకం కింద దీన్ని చేర్చి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. కానీ కేంద్రం నుంచి స్పందన కొరవడింది.

ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు నిధుల కొరత.. కేంద్రాన్ని కోరినా అందని సాయం


కేంద్రం మంజూరు చేస్తేనే సిరిసిల్లలో 100 ఎకరాల్లో దేశంలోనే భారీ పవర్‌లూమ్‌ సమూహం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి 993.65 కోట్లను అంచనా వేసింది. ఇందులో కేంద్రాన్ని 49.84 కోట్లు సాయం కోరింది. ప్రాజెక్టును స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ కింద నిర్వహించేందుకు నిర్ణయించిన సర్కారు.. అందులో తమ వాటాగా 756.97 కోట్లను ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ సమగ్ర మరమగ్గాల సమూహ అభివృద్ధి పథకం-సీపీసీడీఎస్ కింద దీనిని గుర్తించి సాయం అందించాలని అభ్యర్థించినా.. సానుకూలత కరవైంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర సర్కారు 10 కోట్లను వెచ్చించింది.

ఇవీ చూడండి:ఆరునెలల్లో కాకతీయ టెక్స్​టైల్ పార్కులో ఉద్యోగాలు: ఎర్రబెల్లి

సముద్రంలో కొట్టుకొచ్చిన మందిరం... ఏ దేశం నుంచి వచ్చిందంటే..?

Last Updated :May 11, 2022, 5:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.